వ్యాయామం చేస్తున్నపుడు తీసుకునే ఆహారంలో..

ABN , First Publish Date - 2020-07-05T18:00:50+05:30 IST

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

వ్యాయామం చేస్తున్నపుడు తీసుకునే ఆహారంలో..

ఆంధ్రజ్యోతి(05-07-2020)

ప్రశ్న: క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?

- సీతారామ్‌, అనంతపూర్‌

 

డాక్టర్ సమాధానం: రోజూ గంటసేపు, వారానికి ఐదు రోజులు వ్యాయామం చెయ్యడం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయాయం యొక్క ఫలితాలు సరిగా ఉండాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా, వ్యాయామానికి ముందు, తరువాత తీసుకునే ఆహారం సరైనది కాకపోతే వ్యాయామ సత్ఫలితాలు పూర్తిగా అందకపోవచ్చు. వ్యాయామానికి అరగంట ముందు ఓ అరటి పండు లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే అలసట ఉండదు. కావలసిన శక్తి వస్తుంది. మధ్యలో కొద్దిగా నీళ్లు తాగితే అలసట అన్పించదు. ఒక వేళ మీ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువ అయితే మధ్యలో ఆహారాన్ని తీసుకోవచ్చు.  తరువాత ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు, మిల్క్‌షేక్‌ కానీ, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు, లేదా కొద్దిగా పళ్ళు, పెరుగు తీసుకుంటే మంచిది. అరలీటరు నుండి ముప్పావు లీటర్‌ నీళ్లు తీసుకుంటే చెమట ద్వారా శరీరం నుండి పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు. భోజనంలో ప్రొటీన్‌ కోసం గుడ్లు, పప్పు ధాన్యాలు, శెనగలు, రాజ్మా, అలసందలు లాంటి గింజలు, రెండు మూడు రోజులకు ఓసారి చికెన్‌, చేప తీసుకోవచ్చు. తీవ్ర వ్యాయామం అయితే ప్రొటీన్‌ షేక్స్‌ వల్ల లాభమే. కానీ ఇలాంటి ప్రొటీన్‌ షేక్స్‌ను నిపుణులను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ 

సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2020-07-05T18:00:50+05:30 IST