ఇంజనీరింగ్‌లో.. ఏ ర్యాంక్‌కు ఏ సీటు?

ABN , First Publish Date - 2020-10-14T08:21:50+05:30 IST

ఎంసెట్‌-2020 ఇంజనీరింగ్‌ విభాగం ర్యాంకర్లలో సీటు విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాము సాధించిన ర్యాంక్‌కు ...

ఇంజనీరింగ్‌లో.. ఏ ర్యాంక్‌కు ఏ సీటు?

‘ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌’లో జాబితాలు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌-2020 ఇంజనీరింగ్‌ విభాగం ర్యాంకర్లలో సీటు విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాము సాధించిన ర్యాంక్‌కు ఏ ఇంజనీరింగ్‌ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో సీటు వస్తుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఎంసెట్‌-2019 ర్యాంకర్లకు సంబంధించిన అడ్మిషన్ల గురించి వాకబు చేస్తున్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం నిర్వహించిన ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లోకి 254 ప్రైవేట్‌ కాలేజీలు, 19 వర్సిటీ కాలేజీలను తీసుకున్నారు. వీటిలో కన్వీనర్‌ కోటా(70ు) కింద 92,494 సీట్లు, ఈడబ్ల్యుఎస్‌ కోటా(10ు) కింద 9,197 సీట్లను కలిపారు. అంటే మొత్తం మీద ఎంసెట్‌-2019 ర్యాంకర్లకు 1,01,691 సీట్లు అందుబాటులో ఉంచి 3 దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 


గత ఏడాది ఇంజనీరింగ్‌లో 35 బ్రాంచ్‌లలో అడ్మిషన్లు చేపట్టారు. 2020 ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ర్యాంకర్లు తమకు ఎక్కడ సీటు రావచ్చో అంచనా వేసుకునేందుకు వీలుగా గత ఏడాదికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌/వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల వారీగా, కాలేజీ కోడ్‌, పేరు, టైప్‌, ఏ వర్సిటీ, జిల్లా, ప్రదేశం, కోడ్‌/బాలికలు, అఫిలియేషన్‌, బ్రాంచ్‌ కోడ్‌, రిజర్వేషన్‌ కేటగిరీ తదితర వివరాలు ఇందులో పొందుపరచింది. గత ఏడాది తమ ర్యాంక్‌కు ఎక్కడ సీటు వచ్చిందో తెలుసుకోవడం ద్వారా ప్రస్తుత అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యేందుకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని అంచనాకు వినియోగించుకుని వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 


ఈ ఏడాది 4 కొత్త కోర్సులు

నిరుడు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌(సీఎ్‌సఈ) బ్రాంచ్‌కి భారీ డిమాండ్‌ ఉంది. ఈసారి సీఎ్‌సఈకి సమాంతరంగా కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటికున్న డిమాండ్‌ నేపథ్యంలో కాలేజీలు సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ వంటి బ్రాంచ్‌లను రద్దు చేసుకోవడమో లేక సీట్లు తగ్గించుకోవడమో చేశాయి. గత సంవత్సరం సమాచారాన్ని www.andhrajyothy.comలో  https://bit.ly/34RixWF లింకు ద్వారా చూడవచ్చు.

Updated Date - 2020-10-14T08:21:50+05:30 IST