వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికలు నిర్వహించం

ABN , First Publish Date - 2021-04-21T10:17:33+05:30 IST

వివిధ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా.. ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) రాష్ట్ర హైకోర్టుకు నివేదించారు.

వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికలు నిర్వహించం

  • -విలీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎలక్షన్లపై హైకోర్టుకు ఏజీ 
  • -విచారణ జూన్‌ మూడోవారానికి వాయిదా 

అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వివిధ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై దాఖలైన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా.. ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) రాష్ట్ర హైకోర్టుకు నివేదించారు. వేసవి సెలవుల తర్వాత వీటిపై విచారణ చేపట్టాలని కోరారు. పురపాలక కమిషనర్‌ నుంచి విజ్ఞప్తి రానంతవరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫున న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి, ఏజీ, ఎస్‌ఈసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ మూడోవారానికి వాయిదా వేసింది.


ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ్తజస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబరు 31న రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేయడం, సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాజధాని అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలలో విలీనం చేశారని.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్‌ చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసిందని.. వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 


ఎన్నికల నిర్వహణపై వైఖరి తెలపాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాదిని, ప్రభుత్వం తరఫున ఏజీని ధర్మాసనం కోరింది. ఏజీ ఎస్‌.శ్రీరాం స్పందిస్తూ.. వ్యాజ్యాల పై విచారణ పెండింగ్‌లో ఉండగా ఎన్నికల నిర్వహణకు మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోలేరని స్పష్టం చేశారు. విచారణ పెండింగ్‌లో ఉండగా ఎన్నికల నిర్వహణ ఉత్పన్నమే కాదన్నారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరపాలని.. ఈలోపు వార్డుల పునర్విభజన ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కలుగజేసుకుంటూ.. ఈలోపు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్‌ ప్రక్రియ రద్దవుతాయని.. పిటిషనర్లు ఆందోళన చెందనక్కర్లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-21T10:17:33+05:30 IST