ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల ఇంటర్వ్యూపై స్పందించిన వైట్‌హౌస్

ABN , First Publish Date - 2021-03-09T14:35:01+05:30 IST

బ్రిటన్ రాజదంపతులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓఫ్రా విన్‌ఫ్రే షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల ఇంటర్వ్యూపై స్పందించిన వైట్‌హౌస్

వాషింగ్టన్: బ్రిటన్ రాజదంపతులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓఫ్రా విన్‌ఫ్రే షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో రాజదంపతులిద్దరూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షోపై తాజాగా వైట్‌హౌస్ కూడా స్పందించింది. తమ జీవితంలో జరిగిన సంఘటనలను బహిరంగంగా చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలంటూ వైట్‌హౌస్ రాజదంపతులను కొనియాడింది. ‘ఎవరైనా తమ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను బహిరంగంగా చెప్పాలంటే దానికి ఎంతో ధైర్యం కావాలి’ అని అధ్యక్షుడు జో బైడెన్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. రాజదంపతులిద్దరూ ప్రస్తుతం ప్రైవేట్ సిటిజెన్లు అని, కాబట్టి అధ్యక్షుడు బైడెన్ తరపున తాము ఇంతకుమించి మాట్లాడబోమని ఆమె అన్నారు.


బ్రిటిష్ ప్రజలతో అమెరికాకు బలమైన, స్థిరమైన సంబంధాలు ఉన్నాయని జెన్ సాకీ తెలిపారు. అంతేకాకుండా యూకే ప్రభుత్వంతో పలు అంశాలపై అమెరికాకు ప్రత్యేక భాగస్వామ్యం ఉందని, అది ఎప్పటిలాగే కొనసాగుతుందని అన్నారు. కాగా.. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఓఫ్రా విన్‌ఫ్రే షోలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భిణిగా ఉన్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని మేఘన్ చెప్పారు. అధికారికంగా వివాహం చేసుకోవడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా కాంటర్బరీ ఆర్చ్ బిషప్ సమక్షంలో వివాహం చేసుకున్నామని ఈ జంట తెలిపింది. తాము బయటకు వెళ్లిపోయాక తండ్రికి ఫోన్ చేసినా మాట్లాడలేదని, తనకు ప్యాలెస్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నిలిపివేశారని ప్రిన్స్ హ్యారీ ఈ షోలో ఆవేదన వెలిబుచ్చారు. 1995లో ప్రిన్స్‌ హ్యారీ తల్లి డయానా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్వ్యూ ఇది. 

Updated Date - 2021-03-09T14:35:01+05:30 IST