నల్లజాతీయుడిని దారుణంగా చంపిన అమెరికన్ పోలీస్.. ఫోటో వైరల్

ABN , First Publish Date - 2020-05-28T22:25:44+05:30 IST

ఓ నల్లజాతీయుడి ప్రాణాలను అమెరికన్ పోలీసులు బలిగొన్నారు. చేతులకు బేడీలు వేసి రోడ్డుపై పడేసి అతడి మెడపై...

నల్లజాతీయుడిని దారుణంగా చంపిన అమెరికన్ పోలీస్.. ఫోటో వైరల్

వాషింగ్టన్: ఓ నల్లజాతీయుడి ప్రాణాలను అమెరికన్ పోలీసులు బలిగొన్నారు. చేతులకు బేడీలు వేసి రోడ్డుపై పడేసి అతడి మెడపై మోకాలితో తొక్కుతూ పైశాచికానందం పొందాడు ఓ పోలీస్. ‘నీ మోకాలు నా మెడపై ఉంది. నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను.. ప్లీజ్.. ప్లీజ్..’ అంటూ వేడుకున్నా కనికరించకుండా మరింత బలంగా తొక్కసాగాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటన అమెరికాలోని మిన్నియాపోలీస్‌ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని ఫోర్జరీ కేసులో నిందితుడిగా గుర్తించిన పోలీసులు మిన్నియాపోలీస్ రోడ్డుపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడి చేతులకు బేడీలు వేసి నేలపై పడేశారు. ఇంతలో ఓ ఫోలీస్ అధికారి అతడి మెడపై మోకాలు పెట్టి నొక్కడం ప్రారంభించాడు. అయితే కాలు తీయమని, ఊపిరాడడం లేదని ఫ్లాయిడ్ ఎంత వేడుకున్నా ఆ అధికారి వినిపించుకోలేదు. దీంతో కొంత సేపు పెనుగులాడిన ఫ్లాయిడ్ తరువాత కదలడం ఆపేశాడు.  దాదాపు 5 నిముషాల పాటు మోకాలితో తొక్కాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న పోలీసులు కూడా ఫ్లాయిడ్‌ను నేలకు అదిమిపట్టి ఉంచారు. కొంత సేపటికి లేచి ఫ్లాయిడ్‌ను కారులో ఎక్కాలంటూ హెచ్చరించాడు. కానీ అతడు కదలక పోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఫ్లాయిడ్ మరణించినట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు.


ఈ సంఘటనపై మిన్నియాపోలీస్ మేయర్ జాకబ్ ఫ్రే మాట్లాడుతూ, ఈ  సంఘటన తనను తీవ్రంగా  బాధించిందని, దీనికి బాధ్యులైన నలుగురు పోలీసులను విధుల నుంచి తొలగించానని పేర్కొన్నారు. వారిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై అక్కడి పౌర హక్కుల శాఖ అధికారి బెన్ క్రంప్ స్పందిస్తూ, నల్లజాతీయుడిగా పుట్టడం పాపం ఏమీ కాదని, అమెరికాలో నల్లజాతీయుడైనంత  మాత్రాన చంపడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓ సివిల్ కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులే ఇంత దారుణంగా హతమార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లాయిడ్‌ను పోలీసులు ఏం చేశారో దగ్గరలోని సీసీ కెమెరాలలో రికార్డు అవడమే కాక, చుట్టుపక్కల వారు కూడా వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరలవుతున్నాయి. దీంతో జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ అమెరికాలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాతి వివక్ష నసించాలంటూ ప్లకార్డులు పట్టుకుని పలువరు నిరసన తెలిపారు. మరి కొందరు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు, పోలీసులపై కూడా దాడి చేశారు.

Updated Date - 2020-05-28T22:25:44+05:30 IST