కల్తీ ‘కల్లో’లం

ABN , First Publish Date - 2021-01-10T06:11:00+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు

కల్తీ ‘కల్లో’లం

  • ప్రజల ప్రాణాలను బలిగొంటున్న డిపో కల్లు  
  • కృత్రిమ కల్లు అమ్ముతున్నారని వెల్లువెత్తుతున్న ఆరోపణలు 
  • కల్లు కేంద్రాలపై లోపించిన పర్యవేక్షణ 
  • నిద్రమత్తులో ఎక్సైజ్‌ శాఖ  
  • వికారాబాద్‌ జిల్లా పెండ్లిమడుగులో కల్లు తాగి ఒకరి మృతి..  
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిట్టిగిద్ద వాసి
  • వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో 212మందికి అస్వస్థత.. వారిలో 70 మందికి ఆసుపత్రుల్లో చికిత్స


వికారాబాద్‌ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతోపాటు ఒకరు మృతి చెందడం కలకలం సృష్టించింది. రోజంతా కష్టపడి ఉపశమనం కోసం డిపోకు వెళ్లి కల్లు తాగుదామనుకునే వారిని ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. రోజూ తాము తాగే కల్లు కల్తీదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతిరోజూ కల్లు తాగనిదే ఉండలేని మద్యం ప్రియులు కల్లు జోలికి వెళ్లాలంటేనే ఆందోళనకు గురవుతున్నారు.


ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / వికారాబాద్‌ / నవాబుపేట : కల్తీ కల్లు అమాయకులను కాటేస్తోంది. డిపోల్లో అమ్ము తున్న కల్లు అసలు చెట్టు నుంచి వచ్చినదా.. లేక తయారు చేసినదో తెలియడం లేదు. చాలా ప్రాంతాల్లో నిర్వా హకులు రసాయనాలు కలి పిన కల్తీ కల్లును తయారు చేసి డిపోల్లో అమ్ముతున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి. తయారు చేసిన కృత్రిమ కల్లును తాగి పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. డిపోల్లో అమ్ముతున్న కల్లు స్వచ్ఛమైనదని అనుకొని మద్యం ప్రియులు తాగుతున్నారు. రసాయనాలు కలి పిన కల్లు అని తెలియక తాగడం వల్ల పలువురు అస్వ స్థకు గురవడం, ప్రాణాలను కోల్పోవడం వంటి సంఘ టనలు జరుగుతున్నాయి. కల్తీ కల్లుకు బానిసై కొందరు వింతగా.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చేస్తున్నారు. రోజూ తాగుతూ.. ఒక్కరోజు కల్లు లేకుంటే కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఫిట్స్‌ వచ్చినట్లు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డిపోల్లో అమ్ముతున్న కల్లుపై సంబంధిత అధికారుల నిఘా లేకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎవరు పట్టిం చుకుంటారులే అని డిపో నిర్వాహకులు ఎలాంటి నిబం ధనలు పాటించకుండా కల్లును విక్రయిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన ఎక్సైజ్‌ శాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగానే వికారా బాద్‌ జిల్లాలోని పలు గ్రామాల కల్లు దుకాణాల్లో కల్లు తాగినవారు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు మృతి చెందగా, పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

వికారాబాద్‌, నవాబుపేట మండలాల ప్రజలు శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడానికి కల్తీ కల్లే కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. చిట్టిగిద్ద గ్రామం నుంచి రోజూ కల్లు సరఫరా అయ్యే వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లోని గ్రామాల్లో కల్లు తాగేవారే తీవ్ర అస్వస్థతకు గురి కావ డం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వికారాబాద్‌ మండలంలో 110మంది, నవాబుపేట మండలంలో 102మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంటే, ఆ గ్రామాల్లో 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు. 

జిల్లాలో కలకలం సృష్టించిన ఈ సంఘటనపై పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు. వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో కల్లు తాగిన వారిలో ఒకరు మృతి చెందగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరొకరు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు మండలాలకు చెందిన 212 మంది అస్వస్థతకు గురి కాగా, వారిలో శనివారం రాత్రి 9 గంటల వరకు 70 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వికారాబాద్‌, నవాబుపేట మండలాల పరిధిలో కొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. మరికొందరు ఒక్కసారిగా కిందపడి ఫిట్స్‌తో కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ముఖం తేలేయడం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో బాధపడగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. నవాబుపేట మండలం, చిట్టిగిద్ద, ఆర్కతల, వట్టిమీనపల్లి, నవాబుపేట, ఎకమామిడి, మాదిరెడ్డిపల్లి, వికారాబాద్‌ మండలం, ఎర్రవల్లి, నారాయణపూర్‌, పెండ్లిమడుగు, కొత్తగడి, పులుసుమామిడి తదితర గ్రామాలకు చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్‌ మండలం, పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి (58) మృతి చెందగా, నవాబుపేట మండలం, చిట్టిగిద్దకు చెందిన ప్యాట పర్మయ్య హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యేలు

ప్రజలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డీఎంహెచ్‌వో సుధాకర్‌ సింధేతో మాట్లాడి వెంటనే బాధిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన చికిత్స అందజేయాలని వారు ఆదేశించారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య బాధిత గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్సుల్లో వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అస్వస్థతకు గురవడానికి కారణాలు ఏమై ఉంటాయనేది వారు బాధితులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. వృత్తి పరంగా డాక్టరైన ఆనంద్‌ అనారోగ్యానికి గురైన పలువురిని స్వయంగా స్టెథస్కోప్‌తో పరీక్షించారు.


కల్లు నమూనాల సేకరణ

రెండు మండలాల్లోనూ కల్లు తాగిన వారే అస్వస్థతకు గురి కావడాన్ని గుర్తించిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు చిట్టిగిద్దలోని డిపోతోపాటు కల్లు నమూనాలు సేకరించి సీజ్‌ చేయడమే కాకుండా ప్రజలు అస్వస్థతకు గురైన 11 గ్రామాల్లోని 15 కల్లు దుకాణాల్లోనూ వారు నమూనాలు సేకరించి సీజ్‌ చేశారు. సేకరించిన కల్లు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అస్వస్థతకు గురైన వారి నుంచి కూడా నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌ పంపించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, ఎస్పీ నారాయణ, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, సొసైటీ చైర్మన్‌ ముత్యంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ ఆదేశించడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోపాటు ఇతర అధికారులు కూడా ఆసుపత్రుల వద్దకు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ప్రజలు అస్వస్థతకు గురైన గ్రామాల్లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ, జిల్లా సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌లు పర్యటించి విషయం తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే, గ్రామాల్లో ఎవరి వద్దనైనా కల్లు ఉంటే తాగొద్దని, బయట పారబోయాలని, అస్వస్థతకు గురైతే తగిన వైద్యం చేయించుకోవాలని అధికారులు గ్రామాల్లో చాటింపు వేయించారు. బాధిత గ్రామాల్లో ఎంతమంది అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారేది తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే చెప్పారు. అనారోగ్యం బారిన పడడానికి కారణం రిపోర్టులు వచ్చిన తరువాత తెలుస్తుందని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా పట్టణంలోని మహావీర్‌, సాయి డెంటల్‌ తదితర ఆసుపత్రులతోపాటు పరిగిలోని సీహెచ్‌సీ, తాండూరులోని జిల్లా ఆసుపత్రిని సిద్ధం చే యాలని కలెక్టర్‌ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 


బాధితులకు మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ

వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే, అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను కోరారు.

Updated Date - 2021-01-10T06:11:00+05:30 IST