Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభ్యర్థులు ఎవరో?

 రేపటితో ముగియనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు 

నేటికీ అభ్యర్థిని ప్రకటించని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం

 కోటిరెడ్డికే ఖరారుచేసినట్టు అనుచరుల సంబరాలు

 పోటీలో నిల్చునేందుకు కాంగ్రెస్‌ ఎంపీటీసీల ఆసక్తి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌కు గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనుండగా, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఖర్చు ల వరకు గిట్టుబాటవుతాయని ఓటర్లు అంచనాలో ఉంటారు. అయితే ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేస్తే ఏకగ్రీవానికి గండిపడే ప్రమాదం ఉందని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఆలోచించడం తో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్‌లకే అవకాశమని టీఆర్‌ఎస్‌ ప్రకటిస్తుండగా, ఎంసీ కోటిరెడ్డిని అభ్యర్థిగా నిలిపేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కీలక నేతలకు కేసీఆర్‌ నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. అయితే బరిలో చిన్నపరెడ్డి ఉంటేనే తమకు లాభమని ఓటర్లు భావిస్తున్న నేపథ్యంలో అధికారపార్టీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. కాగా, అభ్యర్థిగా కోటిరెడ్డినే ఖరారుచేసినట్టు ఆయన అనుచరులు ఆదివారం సంబరాలు చేసుకున్నారు.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)


సిట్టింగ్‌లకే అవకాశం కల్పిస్తామని, వారిని గెలిపించుకునేందుకు జిల్లా నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సమాచారం ఇచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి భారీగా ఖర్చుచేశారు. ఒకసారి ఓటమిపాలు కాగా, మూడేళ్ల పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలో విజయం సాధించారు. తేరా ఆరేళ్లపాటు పదవిలో లేకపోవడంతో తిరిగి ఆయనకే అవకాశం లభిస్తుందన్న చర్చ స్థానిక సంస్థల ఓటర్లలో ఉంది. ఈ మూడేళ్ల కాలంలో శాసనమండలిలో స్థానిక సంస్థల ఓటర్ల హక్కుల కోసం తేరా చిన్నపరెడ్డి పలుమార్లు చర్చ లేవనెత్తారు. వేతనాలు, బాధ్యతలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారన్న చర్చ ఉమ్మడి జిల్లాలో ఉంది. తేరా అభ్యర్థిత్వం డైలమాలో పడిందన్న వాదన మొదలైన నాటి నుంచి ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక సంస్థల ఓటర్లలో చర్చ మొదలైంది. తేరా పదవీకాలంలో శాసన మండలిలో మాట్లాడిన, మంత్రులతో చర్చించిన అంశాలకు సంబంధించిన వీడియోలను స్థానిక సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 2015లో నిర్వహించిన స్థానిక సంస్థలకు ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో నిలవగా, ఆయన్ను ఢీ కొట్టేందుకు ఆర్థికబలం ఉన్న తేరా చిన్నపరెడ్డిని టీఆర్‌ఎస్‌ పోటీలో ఉంచింది. ఇద్దరు ఆర్థికంగా ఉండటంతో నాడు ఓటర్లకు రూ.5లక్షల వరకు గిట్టుబాటైంది. ఈ ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఆతరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మళ్లీ తేరాను బరిలోకి దింపగా విజయం సాధించారు. ఈ ఎన్నికలో కూడా చిన్నపరెడ్డి పెద్ద మొత్తంలో ఓటర్లకు ఖర్చు చేశారు. పూర్తి కాలం పదవిలో ఉండకపోవడం, రెండుసార్లు భారీగా పెట్టుబడి పెట్టడం, సిట్టింగ్‌కే అవకాశం ఇస్తారన్న అధిష్ఠాన ఆలోచనతో ఓటర్లు తేరా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలోనే ఆయన పేరు ప్రతిపాదనకు రాగా కొన్ని కారణాలతో సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నుంచి ఆయన్ను బరిలో దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి జగదీ్‌షరెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలని అధిష్ఠానం నుంచి సంకేతాలు అందాయని తేరా వర్గీయులు వాదిస్తున్నారు. కాగా, కోటిరెడ్డిని అభ్యర్థిగా ఖరారుచేశారని ఆయన అనుచరులు ఆదివారం రాత్రి కొన్నిచోట్ల సంబరాలు చేసుకున్నారు.


ఓటుకు రేటు పెంచే పనిలో ఓటర్లు

ఎంసీ కోటిరెడ్డిని బరిలో దించి ఖర్చును పార్టీనే భరిస్తుంద ని సీఎం కేసీఆర్‌ జిల్లా నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే కోటిరెడ్డి బరిలో ఉంటే ఏ మాత్రం ఆర్థిక ప్రయోజనం కలగదనే యోచనలో పార్టీలకు అతీతంగా ఓటర్ల మదిలో ఉం ది. ఏకగ్రీవం లేకుండా ఏ విఽధంగానైనా పోటీ ఉండేలా చూసుకొని, ఓటుకు డిమాండ్‌ పెంచుకునే పనిలో కొందరు చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ను బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో పీసీసీ ఉంది. ప్రతిపక్షాల ఓట్లను లెక్కలోకి తీసుకొని, గెలిచే అవకాశం లేకపోవడంతో అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టకపోతే దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ ఎంపీటీసీలు పోటీ లో నిల్చోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ఎన్నిక అనివార్యం. దీంతో క్యాంపు రాజకీయలు తప్పవు. ఆశించిన మేరకు సాయం అందకపోతే ఎదుటి అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్‌ ఉంటుందనే అంచనాలో ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారగా, అభ్యర్థులు ఎవరనే విషయంలో ఈ నెల 22న ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

చిన్నపరెడ్డి


కోటిరెడ్డి


Advertisement
Advertisement