Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎవరు రాజులు, ఎవరు ద్రోహులు?

ముఖ్యమంత్రులు, మంత్రుల మార్పుల గురించి మీడియాలో  రాజకీయ కథనాలు రావడం సర్వ సాధారణం. కానీ గుజరాత్‌లో అలా రాసినందుకు ధవళ్ పటేల్ అనే ఒక న్యూస్ పోర్టల్ సంపాదకుడిని సమాజంలో అశాంతి రేపుతున్నాడనే ఆరోపణతో గత ఏడాది రాజద్రోహ నేరం క్రింద అరెస్టు చేసి జైలు పాలు చేశారు. చివరకు  గుజరాత్ హై కోర్టు అతడిపై కేసు కొట్టి వేసింది. ఈ జర్నలిస్టు కేవలం ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాల గురించి రాసినందుకు అతడిపై రాజద్రోహం కేసు మోపి ఉండకపోవచ్చు. అంతకు ముందు ఆయన గుజరాత్‌లో టెండర్ రిగ్గింగ్‌తో పాటు  అనేక అవినీతి  కుంభకోణాలను వెలుగులోకి తీసుకువచ్చారు. కరోనాను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనేక కుంభకోణాలపై న్యాయస్థానాల్లో పోరాడి విజయం సాధించారు. చివరకు అతడు రాసిన ఒక రాజకీయ కథనాన్ని ఆధారంగా తీసుకుని జైలుకు పంపి  గుజరాత్ ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడింది.


ఇలాంటి సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడల్లా భారత దేశంలో అమలులో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాచరిక వ్యవస్థా?  అన్న అనుమానం కలుగుతుంది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాల గురించి ప్రచారం చేసి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున వ్యవస్థాగత మార్పులు జరుగుతాయని చాలామంది ఆశించారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నిర్మూలిస్తారని పలువురు భావించారు. కాని ఎప్పుడో 19వ శతాబ్దంలో మెకాలే కాలంలో ప్రయోగించిన సెక్షన్ 124 (ఏ) ను ఇంకా కొనసాగించడం, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్య పోరాట యోధులపై మోపిన రాజద్రోహ కేసులను ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు, మీడియా ప్రతినిధుల గొంతునొక్కేందుకు ఉపయోగించడంచూస్తే మన దేశంలో సమూలంగా  వ్యవస్థీకృత మార్పులు  చేయడం మన రాజకీయ నాయకులకు ఇష్టం లేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.


నిజానికి బ్రిటిష్ వలసవాద పాలనకు చిహ్నంగా ఉన్న సెక్షన్ 124 (ఏ) లోనే  మాత్రమే కాదు, మొత్తం క్రిమినల్ లా లో పూర్తి సంస్కరణలను తీసుకురావల్సిన అవసరం ఉన్నది. పోలీసువ్యవస్థ స్వరూప స్వభావాలను, అధికారానికి ఆ వ్యవస్థ దాసోహం అయ్యే సంస్కృతిని మార్చవలసిన అవసరం ఉన్నది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ  సుప్రీంకోర్టు ఈ విషయమై ఎన్ని వ్యాఖ్యలు చేసినా, లా కమిషన్‌తో పాటు అనేక ఇతర కమిషన్లు  ఎన్ని నివేదికలు సమర్పించినా, పార్లమెంట్‌లో ఎంత విస్తృతంగా చర్చ జరిగినా ఆచరణలో మాత్రం నేతలు ఈ సంస్కరణలను తీసుకువచ్చేందుకు చొరవ చూపించలేకపోతున్నారు. మన దేశంలో రాచరికం, వలసవాదం పోయినా  నాయకుల మనస్తత్వం మారకపోవడం, తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం, తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం పాత చట్టాలు ఉండడం వల్లే తమ ప్రయోజనాలు కాపాడుకోవచ్చని వారు భావించడం, పైగా మరిన్ని  క్రూర చట్టాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి పై రాజద్రోహ నేరం మోపడాన్ని సోమవారం సుప్రీంకోర్టు  తీవ్రంగా పరిగణించడం, పత్రికా స్వాతంత్ర్యం వెలుగులో  మొత్తం సెక్షన్ 124 (ఏ) పరిమితులనే నిర్దేశించాల్సి ఉన్నదని చెప్పడం అత్యంత కీలక పరిణామంగా భావించవచ్చు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు ఈ సెక్షన్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రభుత్వంపై చేస్తున్న ప్రతి విమర్శను తొక్కిపెట్టేందుకు ఈ సెక్షన్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపైనే కాక, జర్నలిస్టులు, రచయితలు, అణు విద్యుత్ ప్లాంట్లను వ్యతిరేకించిన వారు, పర్యావరణ కార్యకర్తలు, సాగు చట్టాలను వ్యతిరేకించిన వారు,  విద్యావేత్తలు, కార్టూనిస్టులపై  కూడా ఈ సెక్షన్‌ను ప్రయోగిస్తున్నారు. తమకు జీతాలు పెంచమని కోరినందుకు కూడా కర్ణాటకలో ఇద్దరు పోలీసులపై రాజద్రోహం కేసు ప్రయోగించారు. 2010 తర్వాత 11 వేల మందిపై రాజద్రోహ నేరం మోపితే వారిలో 65 శాతం కేసులను మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మోపారని ఆర్టికల్ 14 అనే ఒకసంస్థ డాటా బేస్ తెలిపింది. మోదీని విమర్శించినందుకు 149 మందిపై, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు 144 మందిపై రాజద్రోహ కేసులు మోపారని ఈ సంస్థ తెలిపింది. ‘‘ఒక ఎమ్మెల్యేగా నా స్థాయి ఏమిటి? ఎక్కువ మాట్లాడితే నా మీద కూడా రాజద్రోహం కేసు మోపుతారు..’’ అని ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం దేశంలో పరిస్థితికి అద్దం పడుతోంది.


‘‘ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా రాజద్రోహ కేసులు మోపుతున్నారు. ఒకప్పుడు స్వాతంత్ర్య యోధులపై రాజద్రోహం కేసులు మోపేవారు. ఇప్పుడు సామాన్యులపై కూడా రాజద్రోహం కేసులు మోపుతున్నారు. సామూహిక అత్యాచారం, హత్యల్ని వ్యతిరేకించడం కూడా రాజద్రోహం ఎలా అవుతుంది?’’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ఒక సెమినార్ లో ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించినా దాన్ని దేశవ్యతిరేకంగా, రాజద్రోహంగా చిత్రిస్తున్నారు. వలసవాద కాలానికి చెందిన సెక్షన్ 124(ఏ)ను సుప్రీంకోర్టు పలుసార్లు నిర్వచించినప్పటికీ దాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తే మన వ్యవస్థలో వలసవాద స్వభావం ఇంకా పోనట్లు కనిపిస్తోంది’’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కూడా వ్యాఖ్యానించారు.


సుప్రీంకోర్టు గతంలో కూడా సెక్షన్ 124(ఏ)  విషయంలో స్పష్టంగా తన అభిప్రాయాన్నివ్యక్తం చేసింది. ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా దాన్ని రాజద్రోహం క్రింద పరిగణించలేమని కేదార్ నాథ్ సింగ్ కేసులో తెలిపితే, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసినంత మాత్రాన దాన్ని రాజద్రోహంగా పరిగణించలేమని బల్వంత్ సింగ్ కేసులో స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజద్రోహం కాదని 21వ లా కమిషన్ తెలిపింది, ప్రజలకు తమ నిరసన తెలిపే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే స్వాతంత్ర్యం ఉన్నదని అది తెలిపింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని హింసాత్మక పద్దతుల్లో కూలదోసే నిజమైన ప్రమాదం ఉన్నప్పుడే అలాంటి సెక్షన్లను ప్రయోగించాలని తెలిపింది.


ప్రజాస్వామ్య దేశంలో విమర్శను స్వీకరించే సాహనం పాలకులకు లేకపోతే స్వతంత్ర భారత దేశానికీ, బ్రిటిష్ వలస పాలనా కాలానికీ పెద్ద తేడా ఉండదు. నిరసన, అసమ్మతి అనేది ప్రజల మధ్య భిన్నాభిప్రాయాల గురించి విస్తృత చర్చ జరిగేందుకు, బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో అన్ని విమర్శల్నీ, ప్రశ్నల్నీ ప్రోత్సహించి దానికి ప్రజాస్వామిక పద్ధతిలోనే జవాబు చెప్పే ఆరోగ్యకరమైన మనస్తత్వం మన పాలకులకు లేకుండా పోయింది.


చరిత్ర ఎన్నో పరిణామాల తర్వాత ఆటవికస్థాయి నుంచి రాచరిక పాలనకు, వలసపాలనకు, చివరకు ప్రజాస్వామ్య పాలనకు చేరుకుంది. అయితే మన నేతలు ఇంకా ఆటవిక సంస్కృతినే ప్రోత్సహిస్తున్నారు. ప్రజల మద్దతు సంపాదించేందుకు యాత్రల పేరిట ప్రజల మధ్య తిరిగిన నేతలే అధికారం వచ్చిన తర్వాత రాచరిక మనస్తత్వంతో వ్యహరించడం ఆశ్చర్యకరం.  ఒక ప్రజాప్రతినిధిని ఒక జంతువులాగా లాక్కుపోయి హింసించి ఆనందించే స్వభావం ఉన్న నేతల కాలంలో సామాన్యులు పోలీసుల చేతికి చిక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఫలానావాడిని అరెస్టు చేసి హింసించండి. మీకు ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అన్న ధైర్యం ఇవ్వకపోతే ఇలా జరిగి ఉండేది కాదని, ఇది దేశంలో క్రిమినల్ జస్టిస్ తీరుతెన్నుల్ని తెలుపుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ గురించి సుప్రీంకోర్టులోనూ, ఇతర సంస్థల్లోనూ ఉన్న కేసులు, అనేక ఇతర రంగాల్లో  జరుగుతున్న చర్చలు చూస్తుంటే తెలుగువారు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. నేతలు తాము తీసుకునే చర్యలు తమ ప్రాంతానికి, తమ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఉండాలి కాని పరువు తీసే విధంగా ఉండరాదు. మానవీయ విలువలు, ప్రజాస్వామ్య సంస్కృతికి గౌరవం ఇవ్వనంతకాలం ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని సంక్షేమ పథకాల అమలుకు ఖర్చుపెట్టినా బూడిదలో పోసే పన్నీరు అవుతుంది. 

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి


Advertisement
Advertisement