ఎవరా ఇద్దరు?

ABN , First Publish Date - 2020-05-27T09:26:16+05:30 IST

శ్రీశైల దేవస్థానంలో రూ.కోట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో అసలైన బాధ్యులను తప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మల్లన్న సొమ్ములు స్వాహా చేసిన విషయం బట్టబయలు కావడంతో అస్మదీయులను

ఎవరా ఇద్దరు?

  • శ్రీశైల దేవస్థానంలో రూ.కోట్లు గోల్‌మాల్‌.. 
  • సూత్రధారులకు రాజకీయ అండదండలు 
  • కిందిస్థాయి ఉద్యోగులపై మోపే యత్నం 
  • టీడీపీ హయాంలోదంటూ పక్కదారి 
  • ఇద్దరి పాత్రపై కమిషనర్‌కు ఫిర్యాదులు


కర్నూలు, మే 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలో రూ.కోట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో అసలైన బాధ్యులను తప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మల్లన్న సొమ్ములు స్వాహా చేసిన విషయం బట్టబయలు కావడంతో అస్మదీయులను కాపాడేందుకు కొందరు అధికారులు, రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. ఏళ్ల తరబడి దేవస్థానంలోని ఒకే విభాగంలో పాతుకుపోయిన ఇద్దరు అధికారులను వెనకేసుకొస్తూ కౌంటర్లలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులపై పాప భారం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. వీరికి దేవస్థానం అధికారులు మద్దతు పలుకుతూ జరిగిన అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పైగా అదంతా టీడీపీ హయాంలో జరిగిందని రాజకీయ రంగు పులుముతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


సిబ్బంది బదిలీలతో వెలుగులోకి 

శ్రీశైల దేవస్థానంలో ఆరు నెలల క్రితం అంతర్గత బదిలీలు చేపట్టారు. వసతి విభాగం నుంచి ఓ ఉద్యోగిని దేవస్థానం విభాగానికి , అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని వసతి విభాగానికి మార్చారు. బిల్లులు మంజూరు చేసే సమయంలో సాఫ్ట్‌వేర్‌లో అక్రమాలను దేవస్థాన విభాగం సూపరింటెడెంట్‌ గుర్తించారు. ఒక పేరుపై రావాల్సిన ఐడీ రెండు పేర్లపై రావడాన్ని గమనించి కంప్యూటర్‌ ఆపరేటర్‌పై వారం పాటు నిఘా ఉంచారు. అక్రమాలు జరిగినట్లు స్పష్టం కావడంతో ఆపరేటర్‌ను నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిది. దీంతో ఈవో కేఎస్‌ రామరావుకు అధికారులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కూపీలాగిన ఈవో, ఆ ఒక్క ఆపరేటరే రూ.14లక్షల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. డొనేషన్‌ కౌంటర్లలో 2017నుంచి లెక్కలు తీసి విచారణ చేపట్టగా అక్కడ మరో రూ.56లక్షల అవినీతి బయటపడింది. బాధ్యులైన ఉద్యోగుల నుంచి రూ.42లక్షలు రికవరీ చేశారు.   అలాగే ఆర్జిత అభిషేకాలు, రూ.150 దర్శనం టికెట్ల కౌంటర్లలో రూ.1.42కోట్లు గోల్‌మాల్‌ అయినట్లు గుర్తించారు.  ఇదిలా ఉండగా, 2015 నుంచి దేవస్థానంలో ఒకే విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు ఈ కుంభకోణంలో సూత్రధారులన్న ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిలో ఆ ఇద్దరి వాటాలు తేల్చాలని సీఎంకు, ఈవోకు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ ఆ ఇద్దరినీ తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-27T09:26:16+05:30 IST