మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పళ్లు తినవచ్చా?

ABN , First Publish Date - 2021-06-12T22:25:19+05:30 IST

వేసవి వస్తోందంటే చక్కటి రంగు, రుచితో పాటు, ఎన్నో పోషకవిలువలతో అలరించే మామిడిపండు కోసం ఎదురుచూడని వారు అరుదు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చెయ్యడానికి, ఆహారంలోని

మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పళ్లు తినవచ్చా?

ఆంధ్రజ్యోతి(12-06-2021)

ప్రశ్న: మామిడి పళ్ళ కాలం కదా. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినవచ్చా?


- సుధాకర్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వేసవి వస్తోందంటే చక్కటి రంగు, రుచితో పాటు, ఎన్నో పోషకవిలువలతో అలరించే మామిడిపండు కోసం ఎదురుచూడని వారు అరుదు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చెయ్యడానికి, ఆహారంలోని ఇనుమును మన శరీరం శోషించుకోడానికి మామిడిపండు ఉపయోగపడుతుంది. నోటిలోని దంతాలు, చిగుళ్ల ఆరోగ్య సంరక్షణకు, కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహకరించి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసేందుకు అవసరమైన విటమిన్‌- సి మామిడి పండులో అధికం. ఎముకల పటుత్వం, కంటి చూపు కాపాడడం, రోగాలనెదుర్కొనే శక్తినివ్వడం వంటి ముఖ్యమైన పనులను చేసే విటమిన్‌- ఎ, ఫోలేట్‌, విటమిన్‌ - బి 6 కూడా మామిడిపండులో పుష్కలం. ఈ పండులోని ఫైబర్‌  జీర్ణవ్యవస్థను కాపాడడమే కాక, బరువు నియంత్రణకు కూడా ఉపయోగ పడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలున్న మామిడిపండును వేసవికాలంలో తీసుకోవడమే ఉత్తమం. పంచదార వేసి జామ్‌, జ్యూస్‌గానో తీసుకున్నట్లయితే పోషకాలు తక్కువగా అందుతాయి. కెలోరీలు ఎక్కువై బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్ని వయసుల ఆరోగ్యవంతులు మామిడి పండును నిస్సంకోచంగా తినవచ్చు. మధుమేహం ఉన్న వారు మాత్రం రోజుకు వంద లేదా నూటయాభై గ్రాములకు మించకుండా తక్కువ మోతాదులో, అది కూడా భోజనం వెంటనే కాక చిన్న స్నాక్‌ లాగా తీసుకుంటే మంచిది. బరువు పెరగకుండా ఉండాలంటే మీరు ఏ పరిమాణంలో మామిడి పండు తీసుకుంటారో దానికి తగినట్లుగా భోజనంలో పిండి పదార్థాలైన అన్నం, రొట్టెలు తగ్గించుకుంటే మంచిది.



డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2021-06-12T22:25:19+05:30 IST