‘పౌర’ హింసాగ్నిని రగిలించిదెవరు?

ABN , First Publish Date - 2020-02-26T06:09:21+05:30 IST

భారతదేశంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాల పట్ల విమర్శలు, వ్యాఖ్యానాలు చేయడం, రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది...

‘పౌర’ హింసాగ్నిని రగిలించిదెవరు?

షాహిన్‌బాగ్‌లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తన చేతుల్లోకి సుప్రీంకోర్టు తీసుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఈ అల్లర్లు ఎందుకు ప్రారంభమయ్యాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పర్యటించిన సమయంలోనే అల్లర్లు జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా? అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్యానికి ఆరాటపడటం కాదు అక్కడి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పద్ధతులను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.


భారతదేశంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాల పట్ల విమర్శలు, వ్యాఖ్యానాలు చేయడం, రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఢిల్లీ‍లోని జంతర్ మంతర్ ప్రాంతానికి వెళితే ఏవో సమస్యలపై ప్రదర్శనలు చేసే వారు కనపడుతూనే ఉంటారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని ప్రతి నిమిషానికీ ఒక వ్యాఖ్యానం చేసి మళ్లీ తమలో తాము పంచుకునే ఉద్యమ స్ఫూర్తి కూడా చాలా మందిలో పెరిగిపోతోంది. ఇవి కాక నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు, సభలు జరిపేవారు, పత్రికల్లో వ్యాసాలు రాసే వారు కూడా ఉంటారు. కాని వీటన్నిటి ప్రభావం తిరిగి ప్రభుత్వంపై ఎంత వడుతుందో చెప్పడం కష్టం. మణిపూర్‌లో పోలీసులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఏ) ఎత్తి వేయాలని అక్కడి మహిళలు రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇరోమ్ షర్మిల దాదాపు ఏడేళ్ల పాటు నిరాహార దీక్ష చేశారు. మనోరమ అనే యువతిని పోలీసులు ఇంటరాగేషన్ పేరుతో తీసుకువెళ్లి అత్యాచారం జరిపి హత్యచేసినప్పుడు అక్కడి మహిళలు నగ్నంగా కూడా ప్రదర్శన జరిపారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేసినప్పటికీ మణిపూర్‌తో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, కశ్మీర్‌లోనూ కొనసాగిస్తూనే ఉన్నారు.


డిసెంబర్ 15 నుంచీ ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో మహిళలు, పిల్లలు జరుపుతున్న ప్రదర్శన కూడా భారత దేశంలో ఒక రకంగా ప్రజాస్వామ్య హక్కుల్లో ఒకటైన భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతంగా నిలిచింది. సాధారణంగా ఇలాంటి ప్రదర్శనలను అనుమతి లేకుండా నిర్వహిస్తే వారిని బలవంతంగా తొలగించేందుకు పోలీసులకు అధికారం ఉన్నది. ఐతే స్థల, కాల, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు మిన్నకుండిపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచారం షాహిన్ బాగ్ చుట్టూ తిరిగినా, కొందరు నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సామాజిక వాతావరణం అంతగా దెబ్బతినలేదు.


నిజానికి పౌరసత్వ చట్టం పట్ల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మోదీ ప్రభుత్వం కఠినమైన వైఖరినే ప్రదర్శించింది. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని చెప్పింది. పౌరసత్వ పట్టికను అమలు చేసే ఉద్దేశం లేదని ప్రకటించినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అమలు చేసి తీరతామని ప్రకటించింది. ఈ రీత్యా దేశంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారి స్వరాలు బలహీనపడతాయని, నిరసన ప్రదర్శనలు సద్దుమణుగుతాయన్న అభిప్రాయం క్రమంగా ఏర్పడ సాగింది. నిజానికి మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మతపరమైన అసహనానికి సంబంధించి కొన్ని ఘటనలు జరగడం, కొందరు రచయితలు తమ అవార్డులను తిరిగి ఇవ్వడం వంటివి జరిగాయి. కాని అవేవీ తర్వాతి కాలంలో మోదీ ప్రభుత్వాన్ని రాజకీయంగా పెద్దగా బలహీనపరచలేకపోయాయి. ఇప్పుడు కూడా దేశంలో పరిస్థితి మారిపోతుందని, ప్రభుత్వాధినేతలు, అధికారులు పాలనపై దృష్టి కేంద్రీకరిస్తారని షాహిన్ బాగ్ ప్రదర్శన కారులు తమ నిరసనను ఏదో రోజు ఉపసంహరించుకోక తప్పదని చాలా మంది భావించారు. రోడ్డుకు అడ్డంగా నిరసన ప్రదర్శన చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు షాహిన్‌బాగ్ ప్రదర్శనకారులతో చర్చలు కూడా ప్రారంభించింది. సుప్రీంకోర్టు తరఫున సీనియర్ న్యాయవాదులు సాధనా రామచంద్రన్, సంజయ్ హెగ్డే చర్చలు కూడా జరిపి తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్‌లో న్యాయమూర్తులకు సమర్పించారు. పరిస్థితి యధాతథంగా మారుతుందని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఢిల్లీలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయి హింసాకాండ ప్రజ్వరిల్లింది.


పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తన చేతుల్లోకి సుప్రీంకోర్టు తీసుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఈ అల్లర్లు ఎందుకు ప్రారంభమయ్యాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పర్యటించిన సమయంలోనే అల్లర్లు జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా? శనివారంనాడు జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో సిఏఏకు వ్యతిరేకంగా కొందరు నిరసన ప్రదర్శనలు ప్రారంభిస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చోవడమే ఈ పరిణామాలకు దారితీసిందని చెబుతున్నారు. బహుశా ట్రంప్ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల తీవ్రత పెంచాలని, తమ ఆందోళన ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని వారు భావించి ఉంటారు. ఆ తర్వాత కొన్ని రాళ్లు రువ్వుడు ఘటనలు జరగడం, ఆదివారం బిజెపి నేత కపిల్ మిశ్రా రంగ ప్రవేశం చేయడం జరిగాయి. ఈ శిబిరాన్ని మూడు రోజుల్లో ఎత్తి వేయకపోతే పోలీసుల మాట కూడా విననని ఆయన హెచ్చరించేందుకు ఎవరు ప్రోద్బలం కలిగించారు? ఢిల్లీ ఎన్నికల ప్రచార సమయంలో కపిల్ మిశ్రా చేసిన ‘గోలీ మారో’ వంటి వ్యాఖ్యలను తాను ఆమోదించబోనని హోంమంత్రి అమిత్ షా ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రకటించిన తర్వాత కూడా కపిల్ శర్మ యధావిధిగా ఎందుకు వ్యవహరించారు? ట్రంప్ భారత్ నుంచి వెళ్లిపోగానే ప్రదర్శనా శిబిరాలను ఎత్తివేస్తామని ఆయన ఎందుకు ప్రకటించారు? ఘర్షణల్లో ఒక కానిస్టేబుల్‌తో పాటు అనేకమంది మరణించడానికి ఎవరు కారణం? కేవలం స్థానికుల మధ్య ఘర్షణ జరిగిందా? లేక బయటనుంచి వ్యక్తులు ప్రవేశించారా?


ఈ మొత్తం ఘర్షణల్లో పోలీసుల అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది. జఫ్రాబాద్, మౌజ్ పూర్ ప్రాంతాల్లో పోలీసులు నిశ్చేష్టగా నిలుచుండగా జనం రాళ్లు విసురుకోవడం, తుపాకుల వంటి మారణాయుధాలను కూడా చేతబూనడం, వాహనాలు, టైర్ల ఫ్యాక్టరీలు దగ్ధం చేయడం, పెట్రోల్ బాంబులతో ఇళ్లపై దాడులు చేయడంవంటి ఘటనలు జరిగాయి. ఆఖరుకు దృశ్యాలు రికార్డు చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు, కెమెరాలు లాక్కోవడం, వారిపై భౌతికంగా కూడా దాడులు చేయడం జరిగింది.


ఒక అగ్రదేశాధినేత మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పోలీసులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారు? ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఈ ఘటనల గురించి సమాచారం ఇచ్చినప్పటికీ వారెందుకు చర్యలు తీసుకోలేదు? కొత్తగా నిరసన ప్రదర్శనలను ఎందుకు అనుమతించారు? అనుమానిత వ్యక్తుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు? నిషేధాజ్ఞలు విధించడం, డ్రోన్‌లను ఉపయోగించడం వంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? జామియా, జెఎన్‌యు వంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీకాలం గత జనవరిలో పూర్తయినప్పటికీ మరో నెలపాటు ఎందుకు పొడిగించారు? 1984లో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన తర్వాత ఢిల్లీలో ఇంతటి తీవ్రమైన ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఘర్షణలకు పాల్పడేవారంతా ఒకే చోట చేరి తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేందుకు పోలీసులు వీలు కల్పించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీ పోలీసులు ఒక వైపు సంయమనం పాటిస్తూనే మరో వైపు కఠినంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు బారికేడ్లు నిర్మించాలి, ఎక్కడి వరకు ప్రదర్శనకారులను అనుమతించాలి, బాష్పవాయువు, లాఠీ ఛార్జి వంటివి ఎప్పుడు ప్రయోగించాలి అన్న విషయంలో వారు శాస్త్రీయమైన పద్ధతులను అవలంబిస్తారు. అందుకే పార్లమెంట్‌కు అతిసమీపంలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ధర్నా జరిపేందుకు సిద్ధ పడినా వారు అనుమతిస్తూనే అప్రమత్తంగా ఉండడం కనిపిస్తుంది. కాని ట్రంప్, మోదీ వివిధ ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న హైదరాబాద్ హౌజ్‌కు సమీపంలోనే ఘర్షణలు జరగడం, వాటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వ్యాప్తి కావడం వారి సమర్థతను శంకించేలా చేస్తుంది. ఇది కేవలం పోలీసుల సమర్థతకు సంబంధించిన విషయం కాదు. దేశ రాజధానిలోనే ఇలాంటి ఘర్షణలు జరిగితే న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, సిఎన్‌ఎన్ లాంటి అంతర్జాతీయ మీడియాకు కూడా చేరుతుంది. ఢిల్లీలో చాలా మంది మీడియా ప్రతినిధులు ఘర్షణల గురించి రాయాలా, లేక ట్రంప్ పర్యటన గురించి రాయాలా తేల్చుకోలేకపోయారు. ఈ రెండింటికీ అత్యంత ప్రాధాన్యత ఉన్నదన్న విషయం వారికి తెలుసు. అందువల్ల ఇది దేశంలో ఉన్న పాలనా వ్యవస్థ పనితీరును కూడా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు యంత్రాంగం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల్లో ఉన్నందువల్ల లేని పోని అనుమానాలు ఆయన మీదకు వెళతాయి. నిజానికి దేశంలో ఒక అగ్రనేత పర్యటిస్తున్నప్పుడు ఇలాంటి ఘర్షణలు జరగాలని ఏ నేత అయినా కోరుకుంటారా? అన్నది సరళమైన ప్రశ్న. పైగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఎంతో అవసరం. ఈ మద్దతు అవసరం వల్లే గత ఎనిమిది నెలల్లో ట్రంప్‌ను మోదీ అయిదు సార్లు కలుసుకున్నారు. భారత్- అమెరికాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వర్తక వివాదాలు సమసిపోయి ఒకరి మార్కెట్‌కు మరొకరు అందుబాటు పొందేందుకు తీవ్ర యత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రధానంగా 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం అయితే జరిగింది కాని ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన సమగ్రవాణిజ్య ఒప్పందం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు కనపడటం లేదు. ఈ ఒప్పంద వివరాలు బయటపడితే కాని ట్రంప్ పర్యటన వల్ల మనకు వచ్చే ఫలితాలు స్పష్టం కావు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకే అధ్యక్ష్యుడు ట్రంప్‌ భారత్ వచ్చారని, మనకు ఒరిగేది ఏమీ లేదని కొందరు నిత్య సంశయవాదులు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ వారి సంశయాలు నిజమో కాదో తర్వాతి కాలంలో తెలుస్తుంది.


నిజానికి జరిగింది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య చర్చలే అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించారు. భారతదేశంలో గడిపిన సమయం కంటే ఎక్కువ సమయం విమానంలో గడిపి మరీ వచ్చిన ట్రంప్ మన దేశంపై ప్రశంసల వర్షం కురిపించడం సాధారణ విషయం కాదు. తనతో పాటు తన దేశ మీడియాను వెంట తీసుకువచ్చిన ట్రంప్ వ్యాపార ప్రతినిధులతోనూ, మీడియా ప్రతినిధులతోనూ బహిరంగంగా స్పష్టంగా మాట్లాడారు. ఎటువంటి ప్రశ్నలు వేసినా తడుముకోకుండా చెప్పారు. సిఏఏ గురించి మోదీతో మాట్లాడలేదని అంటూనే మతపరమైన స్వేచ్ఛ గురించి లోతుగా చర్చించానని అన్నారు. ఇలాంటి పారదర్శకత, మీడియాతో అరమరికలు లేని ధోరణి మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అవలంబించి ఉంటే దేశంలో వాతావరణం ఆరోగ్యకరంగా మారే అవకాశాలు ఉండేవి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడడం కాదు, అక్కడి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పద్ధతులను కూడా నేర్చుకోవడం కూడా అవసరం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-02-26T06:09:21+05:30 IST