వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి...డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి

ABN , First Publish Date - 2020-03-24T16:39:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది....

వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి...డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడి

  • 67 రోజుల్లో లక్షమందికి కరోనా...
  • ఆపై 15 రోజుల్లో 2 లక్షలమందికిపైగా వ్యాపించింది

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.మొదట కరోనా వైరస్ 67 రోజుల్లో లక్షమందికి సోకింది. అదికూడా ఎక్కువగా ఈ వైరస్ ఉద్భవించిన చైనా దేశానికే పరిమితమైంది. కానీ ఆ తర్వాత 11 రోజుల్లోనే అనూహ్యంగా పలు దేశాల్లో 2 లక్షల మంది రోగులకు కరోనా సోకింది. అనంతరం గడచిన 4రోజుల్లో కొవిడ్-19 రోగుల సంఖ్య లక్షమందికి పైగా వచ్చింది. అంటే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 3,80,000 మందికి చేరుకోగా మృతుల సంఖ్య 16వేలకు దాటింది.


ఇటలీలో  అత్యధికం...

ఇటలీ దేశంలో ఫిబ్రవరి నెలలో 3 కేసులతో ప్రారంభమై 60వేలకు చేరింది. యూరప్ దేశాల్లోనే ఇటలీలో అత్యధికంగా 6వేలకు పైగా ప్రజలు కరోనా కాటుకు మరణించారు. ఇంకా చాలా దేశాల్లో కరోనా వైరస్ పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయడం లేదని, వనరులు లేక పోవడం, కరోనా కిట్ల కొరతతో పలు దేశాలు అవస్థలు పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అంగీకరించారు.


భారతదేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్

భారతదేశంలో కరోనా వైరస్ పరీక్షలు చేయడానికి ఎట్టకేలకు 12 ప్రైవేటు ప్రయోగశాలలను ప్రభుత్వం అంగీకరించింది. భారతదేశంలో 400 కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పదికి చేరడంతో మేల్కొన్న సర్కారు లాక్‌డౌన్ చేపట్టింది. భారతదేశం విదేశాల నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను నిషేధించింది. అనంతరం దేశీయ ప్రయాణాలను కూడా నిలిపివేసింది.

Updated Date - 2020-03-24T16:39:11+05:30 IST