తీన్మార్‌ మల్లన్న చానెల్‌ ఆఫీసులో సోదాల వెనుక ‘యువతి’!

ABN , First Publish Date - 2021-08-04T15:04:41+05:30 IST

చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో

తీన్మార్‌ మల్లన్న చానెల్‌ ఆఫీసులో సోదాల వెనుక ‘యువతి’!

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌/పీర్జాదిగూడ : చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీ‌స్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా  అక్కడి పోలీసులు సైతం 41ఏ నోటీసు అందజేశారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు.


అసలేం జరిగింది..!?

క్యూ-న్యూస్‌లో బ్యూరోచీ‌ఫ్‌గా పనిచేసిన చిలుక ప్రవీణ్‌ ఇటీవల సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి మల్లన్నపై తీవ్ర ఆరోపణలు చేశాడు.  ఈ నేపథ్యంలో ఓ మహిళ సైబర్‌క్రైమ్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. తనను తీన్మార్‌ మల్లన్న మానసికంగా వేధిస్తున్నాడని, ప్రవీణ్‌తో ఉన్న వివాదంలోకి తనను లాగి వ్యక్తిగతంగా అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్నకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీఐ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం క్యూ-న్యూస్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నిరాకరించారు. క్యూ-న్యూస్‌ చానెల్‌లో సోదాల నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం జరగగా, ఇతరులను లోపలికి అనుమతించలేదు.



Updated Date - 2021-08-04T15:04:41+05:30 IST