కరోనాకు ధన్వంతరి ఎవరు?

ABN , First Publish Date - 2020-04-02T05:56:12+05:30 IST

కరోనా బాధితులు చూస్తుండగానే లక్షల సంఖ్యకు చేరిపోయారు... మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ఈ కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొనేది ఎప్పుడు అనేదే ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న ప్రశ్న. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో తయారవుతోంది అని నిరర్థక కబుర్లు...

కరోనాకు ధన్వంతరి ఎవరు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశ పెట్టినట్టు కరోనా వైరస్ విరుగుడు మందు త్వరలోనే మన చేతికి అందివస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా లేక ఇందులో అతిశయం ఉందా? ఈ మానవ ప్రపంచానికి ఏ ముప్పు సంభవించినా, ఏ ఉపద్రవం మీద పడినా మేమే రక్షకులం అని నూరిపోసే హాలీవుడ్ సినిమాలలో చూపించినట్టు, ఇది మరో శ్వేత జాత్యహంకార వ్యక్తీకరణ కాదు కదా?! ఈ ప్రశ్నలు ఆశను మట్టుపెట్టేవి కావు, నిరాశను అక్కున చేర్చుకోమనేవి కానేకావు, న్యూనతా భావాన్ని పెంపొందించేవీ కావు... వాస్తవ దృష్టిని మరింత సానబెట్టుకోవడానికి అందరూ వేసుకోవలసిన ప్రశ్నలు.


కరోనా బాధితులు చూస్తుండగానే లక్షల సంఖ్యకు చేరిపోయారు... మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ఈ కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొనేది ఎప్పుడు అనేదే ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న ప్రశ్న. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో తయారవుతోంది అని నిరర్థక కబుర్లు వినవస్తున్న సమయంలోనే చావుకబుర్లు మరింతగా పెరిగిపోతున్నాయి. కరోనా విరుగుడు గురించి అరచేతిలో వైకుంఠం చూపుతున్నవారు అయితే రాజకీయ నాయకులు, లేదంటే ఆ విరుగుడును కనుక్కున్న మరుక్షణం మార్కెటింగ్ మీద పడడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు! ఇంతకీ వైద్య శాస్త్ర సంబంధమైన అనుభవజ్ఞులు, పరిశోధకులు ఏమంటున్నారు? 


వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మనుషులకు ఉపయోగపడే ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే, అది అన్ని పరీక్షలకు నిలబడి, ప్రయోగ స్థాయి నుంచి మనుషుల వినియోగార్థం ఉత్పత్తి స్థాయికి చేరాలంటే మామూలుగా అయితే కనీసం ఓ పది సంవత్సరాలైనా పడుతుంది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా నెలకొన్న అత్యంత తీవ్రమైన పరిస్థితులలో సర్వత్రా ఉపయోగపడే దిశగా అటువంటి ప్రయోగం జరగాలంటే, దాని ఫలితం కనిపించాలంటే -- కొన్ని కొన్ని వైద్య సంబంధమైన పరిమితులను, సహజమైన ఆంక్షలను, నైతిక పరమైన అంశాలనూ కాస్త పక్కన పెట్టినా-- కనీసం 18 నెలల విలువైన పరిశోధనా సమయం పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కనీసం ఓ 50 వరకూ పరిశోధనా సంస్థలు కరోనా వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ.) అంచనా. ఇంత పెద్ద ఎత్తున క్షణాలలో ఇన్ని కంపెనీలు ఒకే అంశంపై దృష్టి పెట్టడానికి నడుంబిగించడం చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో కొన్ని వైరస్‌లు ఉన్నట్టుండి మానవాళిపై విరుచుకుపడిన సందర్భంలో వెంటనే రంగంలోకి దిగి పరిశోధకులకు ఊతమిచ్చిన ‘సెపి’ (కొయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రెపేర్డ్‌నెస్ ఇనొవేషన్స్) అనే, నార్వే రాజధాని ఆస్లో కేంద్రంగా పనిచేసే, స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు కూడా కొన్ని పరిశోధనా సంస్థలకు అండగా నిలిచి కరొనావైరస్ విరుగుడుకు ఆర్థికంగా సహకారం అందిస్తోంది. సెపి అందించిన నిధులతో మోడర్నా అనే అమెరికా సంస్థ కరోనా విరుగుడు పరిశోధనల్లో చాలా ముందున్నట్టు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ సంస్థ కేవలం 63 రోజులలో తయారు చేసిన వ్యాక్సిన్‌ను సియాటిల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మనుషులపై ప్రయోగించడానికి రంగం సిద్ధమైంది. ఇవి గాక ఇంకా ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్ క్లైన్, జీ లీడ్ ఇన్క్ వంటి అంతర్జాతీయ సంస్థలు; అలాగే అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా, సెరమ్ ఇన్ స్టిట్యూట్ కూడా ఇదే పనిలో నిమగ్నమైవున్నట్టు సమాచారం.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈమధ్యే ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై మందులు తొందరగా కనిపెట్టండి అని హుకుం జారీచేశారు. ఆ తర్వాత షార్లెలో బహిరంగంగానే రిపబ్లికన్ పార్టీ సభలో మందులు తొందరగానే వచ్చేస్తాయి, అమెరికన్లు భయపడవద్దు అని హామీ ఇచ్చారు. అయితే ఇది నిజంగానే అంత తొందరగా జరిగే పనేనా అన్న అనుమానం అందరికీ ఉంది. ట్రంప్ ఆశ పెట్టినట్టు మరి వైరస్ విరుగుడు మందు త్వరలోనే మన చేతికి అంది వస్తుందా? ఇది ఆచరణ సాధ్యమా లేక ఇందులో అతిశయం ఉందా? ఈ మానవ ప్రపంచానికి ఏ ముప్పు సంభవించినా, ఏ ఉపద్రవం మీద పడినా మేమే రక్షకులం అని నూరి పోసే హాలీవుడ్ సినిమాలలో చూపించినట్టు, ఇది మరో శ్వేత జాత్యహంకార వ్యక్తీకరణ కాదు కదా?! ఈ ప్రశ్నలు ఆశను మట్టుపెట్టేవి కావు, నిరాశను అక్కున చేర్చుకోమనేవి కానేకావు, న్యూనతా భావాన్ని పెంపొందించేవీ కావు... వాస్తవ దృష్టిని మరింత సానబెట్టుకోవడానికి అందరూ వేసుకోవలసిన ప్రశ్నలు.


ప్రపంచమంతా 2019 సంవత్సరం చివరి రోజుకు ఘనంగా వీడ్కోలు చెబుతున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యాధి సోకిన డజన్ల కొద్దీ అనారోగ్య బాధితులకు చికిత్స చేస్తున్నట్టు చైనాలోని వుహాన్ స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆకస్మికంగా పెచ్చరిల్లిన ఈ అనారోగ్యానికి కారణం ఒక రకమైన వైరస్ అని చైనా పరిశోధకులు ఆ తర్వాత కొద్ది రోజులకు తేల్చారు. దీని బారిన పడ్డ 61 ఏళ్ల వ్యక్తి మరణించాడని, చైనాలో ఇదే తొలి మరణం అనీ జనవరి 11వ తేదీన చైనా మీడియా ప్రకటించింది. ప్రపంచానికి అదే తొలి మృత్యు ఘంటిక. వ్యాధి లక్షణాలను కూడా అప్పుడే చైనా మీడియా సవివరంగా వెల్లడించింది. ఆ వ్యాధికి మూలకారణం కరోనా వైరస్ అన్నారు. అతి తక్కువ సమయంలో, ఒక మనిషి నుంచి మరో మనిషికి ఈ వ్యాధి ఒక గొలుసుకట్టులాగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం చైనీయుల కొత్త సంవత్సరం సెలవులు అప్పుడే ప్రారంభం కావడం, ఆ సమయంలో చైనీయులు వేల సంఖ్యలో పని చేస్తున్న ఊళ్ల నుంచి సొంత ఊళ్లకు ప్రయాణిస్తారు – మన సంక్రాంతి లాగా! అప్పుడే వుహాన్ నుంచి కరోనా వైరస్ ప్రపంచ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటికి ఈ వ్యాధికి ఇంకా ఓ ఊరూ పేరూ లేదు! దీనికి కరోనావైరస్ డిసీజ్-–2019 (కోవిడ్-19) అని నామకరణం చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఫిబ్రవరి 11వ తేదీన ఒక ప్రతిపాదన చేసింది. ఇదేదో ఒక ప్రాంతానికో, ఒక జాతికో పరిమితం కాదు కాబట్టి వ్యాధిని వ్యాధి లక్షణాలతోనే గుర్తించే ప్రయత్నం అది. గట్టిగా చెప్పాలంటే కరోనా వైరస్ మానవాళి ఎరుకలోకి వచ్చి, మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంచేసే స్థాయికి ప్రబలిపోవడం మొదలై ఇంకా మూడు నెలలు నిండలేదు.


మనుగడలోకి వచ్చి పట్టుమని నూరు రోజులైనా పూర్తి కాని ఒక ప్రాణాంతక వైరస్ నుంచి వచ్చే వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కనిపెట్టడం ఇంత త్వరగా సాధ్యమవుతుందా? ఒక వేళ సాధ్యమైనా, దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి మనుషులు లభిస్తారా? మనుషులపై ప్రయోగించిన తర్వాతే కదా ఇది మనుషులకు పనికి వస్తుందని తేల్చేది! వ్యాధి లక్షణం బయటపడడానికే రెండు వారాలు పడుతుంటే... మరి వ్యాధి నివారణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ సక్రమంగా పనిచేస్తున్నదీ, లేనిదీ, ఏయే వయస్సుల వారికి ఏయే మోతాదులో మందు వినియోగించాలో నిర్ణయించడానికి, ఈ కొత్త మందు వాడడంవల్ల ఇతర వ్యాధులేమైనా వచ్చేదీ, లేనిదీ, అప్పటికే ఫలానా ఫలానా వ్యాధి ఉంటే ఇది పని చేయదనో, పని చేస్తుందనో తేలడానికీ, దీనివల్ల ఏయే సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చేదీ నిర్ధారించడానికీ ఇంత స్వల్ప వ్యవధి సరిపోతుందా? సరిపోదు! ఏ క్షణాన ఈ మహమ్మారి ఎవరిని తీసుకుపోతుందో ఊహకు సైతం అందని ఈ విపత్కర పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సిన్ కోసం పరిశోధనా రంగంలో ప్రస్తుతం భయంకరమైన పోటీ నడుస్తోంది. ఇటు ఇజ్రేల్‌లో, అటు అమెరికాలో, బ్రిటన్‌లో, ఇంకా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీలలో వ్యాక్సిన్ కోసం ఆగమేఘాలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో జర్మనీలోని క్యూర్ వాక్ అనే బయోఫార్మాస్యూటికల్ కంపెనీ త్వరలోనే ఇటువంటి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయబోతున్నట్టు సమాచారం బయటకువచ్చింది. ఆ కంపెనీకి అమెరికాలోని బోస్టన్‌లో కూడా ఒక బ్రాంచ్ ఉందట. కరోనా వైరస్ బాధితుల సంఖ్య అమెరికాలో కూడా వేలకువేలు పెరిగిపోతుండడంతో వైరస్ వ్యాప్తి నివారణపై ట్రంప్ ఏర్పాటు చేసిన ఒక టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ఈ కంపెనీ సిఇఓను ఆహ్వానించిన ట్రంప్ మొత్తం కంపెనీనే కొనేస్తామని, లేదా ఆ పరిశోధనలేవో బోస్టన్‌లోనే నిర్వహించాలనీ ప్రోద్బలిస్తూ వంద కోట్ల డాలర్లు ఆశ చూపించారట. ఈ రెండింటిలో ఏది జరిగినా, ఫలితంగా తయారయ్యే వ్యాక్సిన్‌కు ‘మేడ్ ఇన్ అమెరికా’ హోదా రావడం ఒక ప్రయోజనమైతే, ఆ వ్యాక్సిన్‌ను మొదట అమెరికన్ పౌరులను కాపాడడంకోసం వినియోగించడం మరో ప్రయోజనం. ఈ ద్విముఖ వ్యూహాన్ని జర్మనీ చిటికెలో చిత్తు చేసేసింది. అది వేరే కథ! ఎంత ఖర్చయినా సరే, ఈ వ్యాక్సిన్ తయారీకి అయ్యే నిధులు తామే సమకూర్చనున్నట్టు తాజాగా జర్మనీ ప్రభుత్వం ప్రకటించడంతో అమెరికా ఆశలు అడియాసలయ్యాయి. ట్రంప్ నిజంగా ఆ కంపెనీని కొనజూశారో లేదో గాని ప్రయోగాల నిర్వహణకు కావలసిన నిధులకు మాత్రం జర్మనీ ప్రభుత్వ పరంగా ఇక ఢోకా లేదు. 


ప్రపంచానికి ఇప్పటికే కొన్ని రకాల వైరస్‌లు, వాటి వల్ల ఎదురయ్యే ముప్పు తెలుసు కాబట్టి కొన్ని రకాల రసాయన మిశ్రమాలతో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ తమ ప్రయోగాలు తాము చేస్తున్నట్టు వార్తలు బయటకువస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఐవి, సార్స్‌లకు వినియోగించే మందుల కాంబినేషన్‌లతో ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారట. అంటే సూక్ష్మంలో మోక్షం అన్నమాట! వాషింగ్టన్ నుంచి వచ్చిన కరోనా వైరస్ బాధితునిపై ఈ ప్రయోగం నిర్వహించగా అతనికి వ్యాధి లక్షణాలు తగ్గినట్టు వారి ప్రయోగ ఫలితం తేల్చిందట. అయితే ఒక వ్యక్తిపై చేసిన ప్రయోగాన్ని, దాని ఫలితాన్ని సార్వత్రికంగా ఆపాదించి చెప్పలేమని ఆ శాస్త్రవేత్తలు చిత్తశుద్ధితో చెబుతున్నారు. 


కంటికి కనిపించని ఒక సూక్ష్మ కణం మానవ నాగరికతను పరిహసిస్తూ, శాస్త్ర సాంకేతికరంగాలకు సవాలు విసురుతూ ఇన్ని వేలమంది శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేయడం ఈ ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో ఎబోలా, సార్స్ వంటివి మానవజాతిపై విరుచుకుపడినప్పుడు కూడా మానవ హననం ఇంత తీవ్ర స్థాయిలో, ఇంత వేగంగా జరగలేదు. ఇప్పుడు అలా కాదు. కళ్లు మూసి తెరిచేలోగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకే మందును తొందరగా తయారుచేయాలన్న తాపత్రయం! ఈ పరిశోధనలలో మునిగి తేలుతున్నవారిలో ఎవరు ముందుగా మందును కనిపెడితే వారే కోట్లకోట్ల కోటీశ్వరులు! కార్పొరేట్ కంపెనీల దృష్టి నుంచి చూసినప్పుడు సామాజిక బాధ్యత కంటె కాసుల పంటకే ఎక్కువ ప్రాసంగికత ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున కరోనా వైరస్‌కు విరుగుడు టీకా బయటకువచ్చిందంటే ఒక్కొక్క ఇంజక్షన్ వెయ్యి డాలర్లకు అమ్ముడుపోయినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఇది కేవలం బిలియనీర్ల జబ్బుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది గనక ప్రభుత్వాలు దీని ధరను తొలి దశలోనే కొంత నియంత్రించే అవకాశం ఉంది. లేకపోతే మందు తయారైన తర్వాత కూడా కరోనా పీడితులు లక్షల్లో మరణించవచ్చు! 


ఈ సమయంలోనే ఓ మంచి వార్త వెలువడింది. కరోనా విరుగుడుకు సంబంధించిన వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ఇంగ్లండ్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సుమారు 500 మంది వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. రకరకాల వయస్సులవారిని ముందుగా ఎంపిక చేసి వారి ఆరోగ్యంపై సమగ్రమైన విశ్లేషణ చేసి ఆ తర్వాత వ్యాక్సిన్‌ను వారిపై ప్రయోగిస్తారు. ఈ శాస్త్రవేత్తల బృందం గతంలో 2014లో ఎబోలా వైరస్ వ్యాపించినప్పుడు కూడా గణనీయమైన కృషి చేసింది. ఆ అనుభవంతో ఇప్పుడు ఈ కొత్త వ్యాక్సిన్‌పై పనిచేస్తోంది. ఈ ప్రయోగాల ఫలితాలు వెలువడి, మనుషులకు ఉపయోగపడే టీకా తయారు కావడానికి కనీసం ఒక సంవత్సర కాలమైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఇదంతా ఇలా ఉంటే కరోనా ప్రాణాంతక మహమ్మారి ఇంత పెద్ద ఎత్తున మానవాళిపై విరుచుకుపడిన ఈ సందర్భంలో భూగోళంపై దృశ్యం ఎలా ఉందంటే -- శబ్దాల రణగొణ ధ్వనుల నుంచి తాత్కాలికంగా విముక్తి చెందినట్టు... పక్షుల కిలకిలారావాలు తప్ప మరే శబ్దమూ వినపించనట్టు... ఫ్యాక్టరీలలోనుంచి విషవాయువులు ఆగిపోయినట్టు... పుడమి తల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు... పర్యావరణం నిర్మలంగా ఉన్నట్టు... వినూత్నంగా ధవళ వస్త్రం ధరించినట్టు...!!!

జగన్

Updated Date - 2020-04-02T05:56:12+05:30 IST