హైదరాబాద్‌లోని ఈ ఏరియాకు కార్పొరేటర్‌ ఎవరో.. అంతా అయోమయం!

ABN , First Publish Date - 2021-06-24T16:39:49+05:30 IST

దానికి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్‌ ఎవరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది...

హైదరాబాద్‌లోని ఈ ఏరియాకు కార్పొరేటర్‌ ఎవరో.. అంతా అయోమయం!

  • అక్కడి ఓటర్లు మూడు వార్డుల్లో...
  • గత సెప్టెంబరులో బడంగ్‌పేట్‌లో విలీనం
  • అల్మాస్‌గూడ శ్రీసాయిబాలాజీ టౌన్‌షిప్‌-2 దుస్థితి

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : అల్మాస్‌గూడ శ్రీసాయిబాలాజీ టౌన్‌షిప్‌-2 కాలనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ కాలనీ ఏ వార్డులో ఉందో.. దానికి ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్‌ ఎవరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దాంతో కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎవరూ చర్యలు తీసుకోవడంలేదు. బడంగ్‌పేట్‌కు కొత్త పాలకవర్గం ఏర్పడిన కొత్తలో అప్పటి కార్పొరేటర్‌ రూ.2.50లక్షలతో వాటర్‌ పైపులైన్‌ వేయించారు. ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. ఈ కాలనీలో 10కి పైగా అంతర్గత రోడ్లు ఉన్నా, అన్నీ కచ్చా రోడ్లే. డ్రైనేజీ సమస్య కాలనీని పట్టి పీడిస్తోంది. ఇది చాలదన్నట్లు మరో వైపు వరద ముంపు భయం కూడా కాలనీని వెంటాడుతోంది. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి ఎవరు తీసుకువెళ్లాలి.. వాటిని ఏ కార్పొరేటర్‌ పరిష్కరించాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


గతంలో సాహెబ్‌నగర్‌లో.. ఇప్పుడు బడంగ్‌పేట్‌లో..

శ్రీసాయిబాలాజీ టౌన్‌షి్‌పకు సంబంధించి సర్వే నంబర్లు. 236 నుంచి 244 వరకు గతంలో హయత్‌నగర్‌ మండలంలోని సాహెబ్‌నగర్‌ కలాన్‌ రెవెన్యూ గ్రామం పరిధిలో ఉండేవి. ఆ స్థలం అప్పటి సరూర్‌నగర్‌ మండలంలోని అల్మా్‌సగూడ గ్రామాన్ని ఆనుకుని ఉంది. ఈ విషయం తెలియక అల్మా్‌సగూడ గ్రామ పంచాయతీ నుంచే ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. కాగా ఇది మునిసిపాలిటీగా మారిన తర్వాత అసలు విషయం బయటపడింది. బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ అధికారులు ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిబంధనలు ఒప్పుకోవంటూ మెలిక పెట్టడంతో ఈ అంశం మంత్రి సబితారెడ్డి దృష్టికి వెళ్లింది. 


2018 నాటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విషయంపై స్థానికులు సబితారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న సబితారెడ్డి ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపి, శ్రీసాయిబాలాజీ కాలనీ సర్వే నంబర్లను హయత్‌నగర్‌ మండలంలోని సాహెబ్‌నగర్‌ కలాన్‌ నుంచి తొలగించి ప్రస్తుత బాలాపూర్‌ మండలంలోని అల్మా్‌సగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో చేర్చాలంటూ ప్రతిపాదించారు. దీనిని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి సైతం తీసుకెళ్లడంతో ఈ అంశాన్ని గతేడాది సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. సబితారెడ్డి ప్రవేశపెట్టిన ఈ అంశం అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆ వెంటనే సెప్టెంబరు 19న గెజిట్‌ విడుదల చేశారు. అప్పటి నుంచి శ్రీసాయిబాలాజీ కాలనీ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని అల్మా్‌సగూడ పరిధి కిందకు వచ్చింది. ఇప్పటికైనా తమ కాలనీని ఏదో ఒక వార్డులో విలీనం చేసి రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా వారు కోరుతున్నారు. 


మూడు వార్డుల్లో ఓటర్లు.. 

ఈ కాలనీలో సుమారు 180 ఓటర్లు ఉండగా, గతేడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో (అప్పటికీ సాహెబ్‌నగర్‌ పరిధిలోనే ఉంది) వాటిని అల్మా్‌సగూడలోని 2,3,4 వార్డులకు సర్దుబాటు చేశారు. అత్యధికంగా 3వ వార్డులో 120కి ఓట్లు ఉన్నట్టు జాబితాను బట్టి తెలుస్తోంది. మిగతా 60 ఓట్లలో సుమారు 20 ఓట్లు 2వ వార్డులో, 40 ఓట్లు 4వ వార్డులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాలనీ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో విలీనమైనా దానిని ప్రత్యేకంగా ఒక వార్డుకు కేటాయించకపోవడంతో పాలనాపరంగా అయోమయం నెలకొంది. 

Updated Date - 2021-06-24T16:39:49+05:30 IST