YS JAGAN జైలుకెళ్తే ముఖ్యమంత్రి ఎవరు..!? (కొత్తపలుకు)

ABN , First Publish Date - 2021-07-11T14:22:56+05:30 IST

అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులలో తాను జైలుకు వెళ్లవలసి రావచ్చని ...

YS JAGAN జైలుకెళ్తే ముఖ్యమంత్రి ఎవరు..!? (కొత్తపలుకు)

అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులలో తాను జైలుకు వెళ్లవలసి రావచ్చని జగన్‌ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. తనకు శిక్ష పడితే ముఖ్యమంత్రిగా తన స్థానంలో భార్య శ్రీమతి భారతీ రెడ్డి ఉంటారని ఆయన పార్టీ ముఖ్యులకు చెబుతున్నారు. ఈ నిర్ణయం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో గొడవలు పెరగడానికి కారణం కావొచ్చునని చెబుతున్నారు. జగన్‌ రెడ్డికి శిక్షపడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే సీఎం కుర్చీలో తల్లి శ్రీమతి విజయలక్ష్మిని కూర్చోబెట్టాలని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీమతి విజయలక్ష్మి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటన్నది దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సన్నిహితులలో చర్చనీయాంశమైంది. దివంగత వైఎస్‌ఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌ రెడ్డిని ప్రజలు కూడా ఆ కారణంగానే ఆదరించారని, ఏ కారణంవల్లనైనా జగన్‌ రెడ్డి పదవిని వదులుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి మాత్రమే ఉండటం సరైనదని, విజయలక్ష్మి ఉండగా ఆ కుటుంబం కోడలు శ్రీమతి భారతీ రెడ్డి వారసురాలు ఎలా అవుతారని బంధువర్గం ప్రశ్నిస్తోంది. దీన్నిబట్టి సీబీఐ కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్‌ రెడ్డికి శిక్ష పడితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ముఖ్యుడొకరు విశ్లేషించారు. ఆ పరిస్థితి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఏ వైఖరి తీసుకుంటుందన్నది కీలకం అవుతుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


బీజేపీ పెద్దల మద్దతు ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారని వారు విశ్వసిస్తున్నారు. తమిళనాడులో జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. బీజేపీ పెద్దల అండ లభించడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయితే ఆ పదవికి శ్రీమతి విజయలక్ష్మి, భారతీ రెడ్డి పోటీ పడితే బీజేపీ ఏ వైఖరి తీసుకోబోతోందన్నది కీలకం అవుతుంది. నిజానికి ఇప్పటికిప్పుడు జగన్‌ రెడ్డి అధికారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే తనకు శిక్ష పడితే అని జగన్‌ రెడ్డి స్వయంగా అంటున్నందున అధికార పార్టీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు, ఇతర ముఖ్యులు షర్మిలను కలిసి మంతనాలు జరుపుతున్నారు. జగన్‌ రెడ్డి వ్యవహార శైలి కారణంగా తాము ఉక్కపోతకు గురవుతున్నామని, తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆమెను కోరుతున్నారు.


కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య లడాయి ముదిరితే మిగతా వారికంటే ఆమె ఎక్కువగా సంతోషిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలనూ ప్రత్యర్థులుగానే పరిగణిస్తున్న షర్మిల, తెలంగాణలో తన బలంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత మరింత స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆమె అడుగులు కాంగ్రెస్‌ వైపు పడే అవకాశం ఉందని కొందరు, బీజేపీ వైపు పడే అవకాశం ఉందని మరికొందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మున్ముందు చోటుచేసుకోబోయే పరిణామాలను బట్టి ఆమె వైఖరి ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తన సోదరుడైన జగన్‌ రెడ్డిపై కేసీఆర్‌కు ఆగ్రహం కలిగేలా చేయడంలో ప్రస్తుతానికి షర్మిల సక్సెస్‌ అయ్యారు కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఏ మేరకు సక్సెస్‌ అవుతారో తేలాలంటే మరికొంత సమయం పడుతుందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పుకొచ్చారు. వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బీజేపీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు తాము తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. షర్మిల ప్రస్తుతానికి కుటుంబంలో మెజారిటీ సభ్యులను తన వైపునకు తిప్పుకోగలిగారు. ఇక తెలంగాణ ప్రజల మనసులను ఏ మేరకు గెలుచుకుంటారో వేచిచూద్దాం!


శ్రీమతి విజయలక్ష్మి అభిప్రాయపడినట్టుగా రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే అధికారం అనేది రక్తసంబంధీకులను సైతం విడదీస్తుంది. శత్రువులను మిత్రులుగా, మిత్రులను శత్రువులుగా మారుస్తుంది. ఏదిఏమైనా జగన్‌ రెడ్డికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసిందనే చెప్పవచ్చు. ఒకవైపు కుటుంబంలో అంతఃకలహాలు, మరోవైపు ప్రభుత్వంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురుకావడంతో ఆయన పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. మధ్యలో తన శ్రేయోభిలాషి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వచ్చిపడిన పేచీ ఒకటి. వీటన్నింటి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాధితులుగా మారే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల రాజకీయ ప్రయాణం ఇప్పుడే మొదలైంది కనుక మున్ముందు ఆమెకు లభించే మద్దతును బట్టి కేసీఆర్‌ వైఖరి ఆధారపడి ఉంటుంది. షర్మిల వల్ల తనకు రాజకీయంగా నష్టం తప్పదని కేసీఆర్‌ నిర్ధారణకు వస్తే జగన్‌ రెడ్డిని మరింత ఇబ్బందిపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తారు. సోదరుడి కోసం ఎండనకా వాననకా కష్టపడిన తనను అధికారంలోకి రాగానే పక్కనపెట్టడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. 



Updated Date - 2021-07-11T14:22:56+05:30 IST