Kuppam తర్వాత అంతటి బలమైన ఈ నియోజకవర్గంలో TDPకి లీడర్ ఎవరు.. ఏంటీ విచిత్ర పరిస్థితులు.. అంతా అయోమయం..!

ABN , First Publish Date - 2021-12-22T13:22:49+05:30 IST

Kuppam తర్వాత అంతటి బలమైన ఈ నియోజకవర్గంలో TDP లీడర్ ఎవరు.. ఏంటీ విచిత్ర పరిస్థితులు.. అంతా అయోమయం..!

Kuppam తర్వాత అంతటి బలమైన ఈ నియోజకవర్గంలో TDPకి లీడర్ ఎవరు.. ఏంటీ విచిత్ర పరిస్థితులు.. అంతా అయోమయం..!

చిత్తూరు జిల్లా/సత్యవేడు : సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. టీడీపీకి జిల్లాలో కుప్పం తరువాత బలమైన నియోజకవర్గం సత్యవేడు. ఇక్కడ ఆపార్టీకి పటిష్టమైన క్యాడర్‌ ఉంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదురొడ్డి నిలిచే కార్యకర్తలకు కొదవలేదు. అయితే పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నడూలేని విధంగా గత కొద్ది రోజుల నుంచి ఆ పార్టీలో వింత పరిణామాలు చోటు  చేసుకుంటున్నాయి. ఎవరికి వారు పార్టీకి తామే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అని ప్రకటించుకుంటూ సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు.


స్వయం ప్రకటిత ఇన్‌చార్జ్‌ల హోదాలో ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ కార్యకర్త్తలకు దిశ నిర్దేశం చేస్తూ విస్మయానికి గురి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ రాజశేఖర్‌ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి అధికారికంగా ప్రకటించక పోయినా జేడీఆర్‌ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులతో ఆయనకు విభేదాలు పొడచూపాయి. జేడీఆర్‌కు వ్యతిరేకంగా మరో వర్గం ఏర్పాటయింది. మాజీ ఎమ్మెల్యే హేమలతను తెరపైకి తీసుకొచ్చారు. ఆమె ఆధ్వర్యంలో విడిగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక వర్గం నియోజకవర్గ కేంద్రంలో చేస్తే, మరో వర్గం మండల కేంద్రాల్లో చేసుకుంటూ చర్చనీయాంశంగా మారుతున్నారు.


నిజానికి 2019లో టీడీపీ ఓటమి అనంతరం హేమలత బీజేపీ గూటికి చేరారు. అయితే ఆమె ఆ పార్టీలో ఇమడలేక అతికొద్ది కాలంలోనే మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. మరోవైపు టీడీపీలోని కొందరు తాము పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లమని ప్రకటించుకుని ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఇరుక్కుని ఎటువైపు వెళ్ళాలో తెలియక మదనపడుతున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ఈ కొత్త ఇన్‌చార్జ్‌ల అవతారంతో అయోమయం నెలకొంది. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా స్పష్టతనివ్వకుంటే పార్టీకి లాభంకంటే నష్టం ఎక్కువ జరగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-22T13:22:49+05:30 IST