డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎవరు....!

ABN , First Publish Date - 2020-02-28T11:47:58+05:30 IST

జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌ పదవి ఎవరికి దక్కనుందన్న విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతున్నది.

డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎవరు....!

కొనసాగుతున్న సస్పెన్స్‌

వీర్ల వైపే అధిష్టానం మొగ్గు..?

రేపు జరుగనున్న ఎన్నిక 

సీల్డ్‌ కవర్‌లో రానున్న పేరు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్‌ పదవి ఎవరికి దక్కనుందన్న విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సంపూర్ణ మెజార్టీ లభించడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులను కైవసం చేసుకోవడానికి టీఆర్‌ఎస్‌కు ఏ ఆటంకం లేకపోయినా పార్టీలోనే ముగ్గురు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవికి పోటీపడుతుండడంతో అధిష్ఠానం ఆచీతూచి వ్యవహరిస్తున్నది. ఈనెల 29న పాలకవర్గం ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం పార్టీ పరిశీలకుడి ద్వారా సీల్డ్‌ కవర్‌లో   చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను పంపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


రేసులో ముగ్గురు

డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవికి ప్రస్తుత చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, వెలిచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వర్‌రావు, ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. డైరెక్టర్‌ పదవులకు ఎన్నిక జరిగిన రోజు మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, బీ-గ్రూపు సంస్థల ప్రతిననిధుల సమావేశంలో డీసీఎంఎస్‌ విషయంలో ఏకాభిప్రాయం రాక పోవడంతో పదవులు కోరుతున్న అందరితో నామినేషన్‌ వేయించాలని అధిష్ఠానం సూచించింది. దీంతో వీరు ముగ్గురు నామినేషన్‌ వేశారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి వెలమ సామాజిక వర్గానికి దక్కడంతో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. 


అధిష్ఠానం మొగ్గు ఎవరివైపో..

ప్రస్తుత చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఆ పదవిని కోరుతుండడంతో రెడ్డి సామాజికవర్గానికి  చెందిన చైర్మన్లు ఈ ప్రతిపాదనను తెచ్చారని సమాచారం. జిల్లా చైర్మన్ల వ్యవహారం అయినందు వల్ల రాష్ట్రస్థాయిలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని పదవులు దక్కాయో చూడాల్సిందే తప్ప స్థానికంగా చూడడం సరైంది కాదని, బీసీ సామాజిక వర్గానికి డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వీర్ల వెంకటేశ్వర్‌రావుకు అధిష్ఠానంలోని పెద్దల ఆశీస్సులు ఉన్నాయని, బీసీ సామాజిక వర్గానికి చెందడం కూడా ఆయనకు కలిసివస్తున్నదని అంటున్నారు. ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ధర్మపురి దేవస్థానం చైర్మన్‌గా కూడా ఉన్నందున పోటీ ముదుగంటి సురేందర్‌రెడ్డికి వీర్ల వెంకటేశ్వర్‌రావు మధ్యకు మారినట్లు సమాచారం. సురేందర్‌రెడ్డి ఒకసారి ఆ పదవిని చేపట్టినందువల్ల రాష్ట్రస్థాయిలో ఆయనకు ఏదైనా పదవిని కట్టబెట్టే ఆలోచనతో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.


ఎన్నికలకు ముందు సురేందర్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పదవిని కోరుకుంటూ పార్టీ పెద్దలతో అధిష్ఠానం ఎదుట ఆ ప్రతిపాదన కూడా చేయించారని అంటున్నారు. దీంతో ఆయనకు రాష్ట్రస్థాయి పదవిని ఇచ్చి వీర్ల వెంకటేశ్వర్‌రావుకు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని ఇస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి ఆయనపట్లే అధిష్టానవర్గం సుముఖంగా ఉందని అయితే పోటీ రావడంతో అందరి మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పి సయోధ్యకుదిర్చి చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించాలని అందరితో నామినేషన్‌ వేయించారని భావిస్తున్నారు.   పార్టీ వర్గాల్లో మాత్రం వీర్ల వెంకటేశ్వర్‌రావుకు చైర్మన్‌ పదవిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పదవి బీసీకి ఇచ్చినందు వల్ల డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ పదవి రెడ్డి వర్గానికి ఇస్తారని భావిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ అభ్యర్థిగా కొండూరి రవీందర్‌రావు,వైస్‌చైర్మన్‌గా పింగిళి రమేశ్‌ పేర్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ఎన్నిక ఈనెల 29న జరుగడం లాంఛనమేనని భావిస్తున్నారు. 

Updated Date - 2020-02-28T11:47:58+05:30 IST