Abn logo
Sep 22 2021 @ 23:08PM

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎవరో?

- పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి

- జిల్లా పీఠం కోసం పెరుగుతున్న ఆశావహుల సంఖ్య

- ఆశిస్తున్న వారిలో అత్యధికులు ఆసిఫాబాద్‌ నేతలే

- రేసులో సీనియర్‌ నేత అరిగెల

- సిర్పూర్‌కే దక్కేలా చూడాలంటూ అక్కడి నేతల ఒత్తిడి

- రసకందాయంలో గులాబీ అధ్యక్షుడి ఎంపిక

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

 టీఆర్‌ఎస్‌ పార్టీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం తారా స్థాయికి చేరింది. పక్షం రోజులుగా పార్టీ సంస్థాగత ఎన్నికల కోసం జిల్లా పార్టీ నాయకత్వం గ్రామ, మండల స్థాయి కమిటీల ప్రక్రియను ముగింపు దశకు చేర్చింది. దీంతో ఇక అందరి దృష్టి జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కేంద్రీకృతమైంది. జిల్లాలో ఈ పదవిని దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కార్యకర్తలు, నాయకుల రాకపోకలు పైరవీలతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పోలింగ్‌ బూత్‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేసే వ్యూహంలో బాగంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర న్యాయకత్వం సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు గానూ సత్యవతి రాథోడ్‌కు ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఇటీవల జిల్లాలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మండలస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు నాయకులతో సమీక్ష నిర్వహించి సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గ్రామ, మండల కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. మండల స్థాయిలో కార్యవర్గాల ఎన్నికకు గ్రామస్థాయి కమిటీల ఏకాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ఆయాగ్రామాలు, మండలాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కార్యవర్గాలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో చాలావరకు గతంలో బాధ్యులుగా కొనసాగుతున్న నాయకులే ఉన్నా కొత్తవారికి కూడా అవకాశం ఇచ్చారు. ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఇక జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్నదానిపైనే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఉత్కంఠం నెలకొంది. అయితే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో సామాజిక , రాజకీయ, భౌగోలిక అంశాలతోపాటు పార్టీలో అతడి చరిత్ర, క్రియాశీలత ఆధారంగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉందాలేదా అనే విషయంలోనూ క్షుణ్ణంగా పరిశీంచే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నేతల్లోని మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లా ఇంచార్జ్‌ రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించి అధ్యక్ష పీఠాన్ని చాలామందే ఆశిస్తున్నా వారిలో ముగ్గురు నలుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ఎనిమిది మంది పోటీ..

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవికోసం ఆ పార్టీకి చెందిన 8 మంది నేతలు ప్రధానంగా పోటీపడుతున్నారు. వీరిలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్‌ నేత, ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గతంలో రాజసభ సీటును ఆశించి తృటిలో అవకాశం కోల్పోయారు. డిసెంబరులో ఖాళీ అయ్యే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తూ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి పోటీపడటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లాలో ఆయన కొంతకాలంగా ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌లతో అంటీముట్టనట్లుగా దూరంగా ఉంటున్నార ని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షత పదవికి దరఖాస్తు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అలాగే జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మికి సన్నిహితులుగా గుర్తింపు పొందిన వాంకిడి జడ్పీటీసీ అజయ్‌, రెబ్బెన మాజీ జడ్పీటీసీ చంద్రయ్య, కాంట్రాక్టర్‌ అబ్దుల్లా, కెరమెరికి చెందిన అబ్దుల్‌ కలాం కూడా పదవిని ఆశిస్తున్నారు. ఇక సిర్పూర్‌(టి) నియోజకవర్గానికి చెందిన చింతలమానేపల్లి ఎంపీపీ దుబ్బుల నానయ్య, సిర్పూర్‌కు చెందిన మైనారిటీ నాయకుడు కీజర్‌ హుస్సేన్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇందులో దుబ్బుల నానయ్య స్థానిక ఎమ్మెల్యే ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో జిల్లా గులాబి దళపతి ఎవరనేది తేలిపోనుంది.