ఆక్రమణదారు ఎవరు?

ABN , First Publish Date - 2021-06-19T06:11:48+05:30 IST

వనపర్తి మునిసిపాలిటీలోని నమ్మ చెరువు కట్ట ధ్వంసం, చెరువు స్థలం ఆక్రమణ వివాదం ఇంకా సమసిపోలేదు.

ఆక్రమణదారు ఎవరు?
చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ కోసం ఫిలర్లు వేసిన అధికారులు

నమ్మ చెరువు కట్ట తొలగింపు నిజమేనని నిర్ధారణ

హద్దులు నిర్ణయించే పనిలో అధికారులు

ధ్వంసం చేసిన వారిపై చర్యలకు అఖిలపక్షం డిమాండ్‌

గత ప్రభుత్వాల హయాంలోనే జరిగిందంటున్న వైస్‌ చైర్మన్‌


వనపర్తి మునిసిపాలిటీలోని నమ్మ చెరువు కట్ట ధ్వంసం, చెరువు స్థలం ఆక్రమణ వివాదం ఇంకా సమసిపోలేదు. 15 రోజులుగా చర్చ జరుగుతున్నా ఈ విషయం కొలిక్కి రావడం లేదు. అధికారులు కట్ట ఆక్రమణను నిర్ధారించి, సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తున్నప్పటికీ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అఖిలపక్షం డిమాండ్‌ చేస్తోంది. లేదంటో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటోంది. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కుమ్మక్కైన మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కట్ట ధ్వంసానికి కారణమని అఖిలపక్షం ఆరోపిస్తుండగా,  తనకు సంబంధం లేదని, కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని వైస్‌ చైర్మన్‌ అంటున్నారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


వనపర్తి మునిసిపాలిటీలోని నమ్మ చెరువు సంస్థానాదీశుల కాలం నాటిది. 1167 సర్వే నంబర్‌లోని ఈ చెరువులోని కొంత భాగంలో గతంలో రాజీవ్‌ స్వగృహ పేరుతో బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. నిర్మాణ సమయంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ నిర్మాణాలు పూర్తవడం, లబ్ధిదారులకు కేటాయించడం జరిగిపోయాయి. 2009 వరదలు వచ్చినప్పుడు ఈ నిర్మాణాల్లోకి భారీగా నీరు చేరడంతో చెరువు కట్టలోని కొంత భాగాన్ని తొలగించి, నీరు దిగువకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. అంతటితో అప్పటి వివాదం తొలగిపోయింది. అయితే ఇటీవల చెరువు అవతలివైపు ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేస్తున్నారు. దానికి వేరే రోడ్డు ఉంది. అయితే అది చుట్టూ తిరుగుతూ రావాల్సి వస్తోందని సదరు వ్యాపారులు చెరువు కట్ట తొలగింపునకు పూనుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా వెంచర్‌కు నేరుగా రోడ్డు ఏర్పడి డిమాండ్‌ వస్తుందని ఆశించారని తెలుస్తోంది. ఈ క్రమంలో చెరువు కట్ట వెంట ముళ్ల పొదల తొలగింపు, చదును చేయడం జరిగాయి. దాంతో చెరువు కట్ట ధ్వంసం అయినట్లు అఖిపలక్షం నాయకులు గుర్తించారు. ముళ్ల పొదల తొలగింపు చేపట్టిన సమయంలోనే 30వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కట్టను కూడా వెంచర్‌ రోడ్డు కోసం తొలగించారని, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన కౌన్సిలర్‌ వెంచర్‌ కోసం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపణలు చేశారు. అక్కడ వివాదం మొదలైంది. తాను కేవలం ముళ్ల పొదలను తొలగించానని, పార్కు కోసం స్థలం ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉందని ప్రజాప్రతినిధులను కోరానని వైస్‌ చైర్మన్‌ అంటున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనే తొలగింపు ప్రక్రియ జరిగిందని స్పష్టం చేస్తున్నారు. 


కొలిక్కి రాని వివాదం

ఈ వివాదం కొనసాగుతుండగానే ఆక్రమణపై స్పందించిన ఇరిగేషన్‌ అధికారులు రెవెన్యూ అధికారులకు సమస్యను నివేదించారు. దీంతో వారు క్షేత్రస్థాయి సర్వే చేశారు. ఆక్రమణను గుర్తించి హద్దులను నిర్ణయించారు. ఓ వైపు వైస్‌ చైర్మన్‌ చెరువు కట్టను ధ్వంసం చేయించారని కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా, తనకు సం బంధం లేదని వైస్‌ చైర్మన్‌ అంటున్నారు. మరి ఎవరు ఆ కట్టను ధ్వంసం చేశారనే విష యంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కట్ట ధ్వంసం ఇటీవలి కాలంలో జరిగితే తాజాగా వివాదంలో ఉన్నవారిని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంటుందని, గతంలో జరిగి ఉంటే దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మునిసిపల్‌ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరిపై చర్యలు తీసుకోకుండా కేవలం హద్దులు నిర్ణయించడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఎవరిపైనా చర్యలు తీసుకోకపోతే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకుపోతుంది. ఈ ఆక్రమణ విషయం అఖిలపక్ష నాయకులు గుర్తించారు కాబట్టి వెలుగులోకి వచ్చిందని, ఆ విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడితే ఆక్రమణలకు అధికారులే ఊతం ఇచ్చినట్లవుతుందని విమర్శలు వస్తున్నాయి.


కాంగ్రెస్‌ హయాంలోనే ధ్వంసం 

 నమ్మ చెరువు కట్ట ధ్వంసం ఇప్పుడు జరుగలేదు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో రాజీవ్‌ గృహకల్ప కట్టిన సమ యంలోనే జరిగింది. 2009లో వరద వచ్చినప్పుడు రాజీవ్‌ గృహకల్ప మునిగి పోతుం డటంతో కట్టను ధ్వంసం చేశారు. తాజాగా అక్కడి ప్రజలు ముళ్ల పొదలు తొలగించాలని చెప్పడంతో మునిసిపాలిటీ ఆధ్వర్యంలోనే తొలగించడం జరిగిం ది. అఖిలపక్షం నాయకులు అవగాహనా రాహిత్యం తోనే నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన ధ్వంసాన్ని ఇప్పుడు జరిగిందని చూపుతున్నారు.

- వాకిటి శ్రీధర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ 


తానే చేశానని ఒప్పుకున్నాడు

 చెరువు కట్టను వైస్‌ చైర్మ న్‌ ధ్వంసం చేశారని మేము అనడం కాదు మొదటి రోజు వివాదం తలెత్తినప్పుడు తానే చదును చేశానని, పార్కు కోసం ఉపయోగిస్తామని పత్రికా ముఖంగా చెప్పారు. ఇప్పుడు ఆ వివాదం పెరగడంతో తనకు సంబంధం లేదని, కేవలం ముళ్ల పొదలు తొలగించానని చెబు తున్నారు. 2009లో వరదలు వచ్చినప్పుడు కట్టను తొలగించింది కొద్ది భాగం మాత్రమే. కానీ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం లోపాయికారి ఒప్పందంతో కట్టను ధ్వంసం చేశారు. వైస్‌ చైర్మన్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

- సతీష్‌యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌


ఫెన్సింగ్‌ వేస్తున్నాం

 నమ్మ చెరువు కింద 1167, 1165, 1166 సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, 6.02 ఎకరాలకు హద్దులు నిర్ణయించాం. బౌండరీస్‌లో ఇప్పటికే ఫిల్లర్లు పాతాం. నేటి నుంచి ఫెన్సింగ్‌ వేస్తాం. కొంతమంది తమ పట్టా భూముల చుట్టూ ఫెన్సింగ్‌ వేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ సర్వే ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కట్ట ధ్వంసం అయిన విషయం వాస్తవమే. అయితే అది ఎప్పుడు అయ్యిందో తెలుసుకోవాల్సి ఉంది. గత ఆగస్టులో వరద వచ్చినప్పుడు తొలగించారేమోనని భావిస్తున్నాం. 

- రాజేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌, వనపర్తి

Updated Date - 2021-06-19T06:11:48+05:30 IST