Abn logo
Sep 22 2021 @ 23:34PM

టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడెవరు?

- మంత్రి ఆశీస్సుల కోసం ఆశావహుల యత్నం

- ఏకగ్రీవం చేసేందుకు మంత్రి గంగుల కసరత్తు 

- రెండు రోజుల్లో నగర కమిటీ ప్రకటనకు అవకాశం 

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 22: తెలంగాణ రాష్ట్ర సమితి  (టీఆర్‌ఎస్‌) కరీంనగర్‌ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీపడుతున్నారు.సీనియర్‌ కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు ఎలాగైనా పార్టీ పదవిని చేజిక్కించుకునేందుకు ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 24లోగా నగర, మండల కమిటీలను నియమించాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆశావహులు మంత్రి గంగుల కమలాకర్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని కరీంనగర్‌, కొత్తపల్లి పట్టణ, కొత్తపల్లి మండల, కరీంనగర్‌ రూరల్‌ మండల శాఖ కమిటీలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి గంగుల ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. 


 2015 నుంచి పెండింగ్‌లో..


2012 సంవత్సరంలో నగర, జిల్లాశాఖ అధ్యక్ష పదవులతోపాటు కమిటీలను వేయగా ఆ తర్వాత పోస్టులను భర్తీ చేయలేదు. 2012లో సర్దార్‌ రవీందర్‌సింగ్‌ పార్టీ నగర అధ్యక్షుడిగా రెండేళ్ళు కొనసాగగా ఆ తర్వాత కూడా కమిటీలు వేయక పోవడంతో  2015 వరకు ఆయనే పనిచేశారు. 2015లో సభ్యత్వనమోదు ప్రక్రియను పూర్తి చేసి కమిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసి ఒకటిరెండు రోజుల్లో పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని భావించగా చివరకు కమిటీలను వేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత 2017, 2019 సంవత్సరాల్లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యం మేరకు పూర్తి చేసినప్పటికి కమిటీలను ప్రకటించక పోవడంతో ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. 2021లో తిరిగి సభ్యత్వ నమోదును చేపట్టి ఈసారి గ్రామ, మండల, పట్టణ, జిల్లా, రాష్ట్ర కమిటీలను పూర్తి చేస్తామని అధినాయకత్వం ప్రకటించడంతో గులాబీశ్రేణుల్లో ఆశలు చిగురించాయి. 


 రేసులో పలువురు


 మంత్రి గంగుల కమలాకర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ 2015 నుంచి సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ మేయర్‌ భర్త చల్ల హరిశంకర్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఏదైనా కారణంతో ఆ పదవి రానిపక్షంలో తనకు నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్‌ నాయకుడు కార్పొరేటర్‌ ఎడ్ల సరిత భర్త ఎడ్ల అశోక్‌, మూడుసార్లు కార్పొరేటర్లుగా గెలిచిన బోనాల శ్రీకాంత్‌, గందె మాధవి భర్త మహేశ్‌తోపాటు, కార్పొరేటర్‌ జంగిలి ఐలేందర్‌యాదవ్‌,  టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌గౌడ్‌తోపాటు మరికొందరు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. కార్పొరేటర్‌ టికెట్‌ రానివారు, పోటీచేసి ఓటమి పాలైన సీనియర్లు కూడా నగర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో పార్టీ నగర కమిటీ ప్రకటించే అవకాశముంది. నగరపాలక సంస్థలో 40 మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉండగా తిరిగి వారికే పార్టీ పదవులు ఎలా ఇస్తారని కొంత మంది అంటున్నారు. పార్టీకి విధేయలుగా ఉంటున్నామని, తమకు అవకాశమివ్వాలని కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు అంటున్నారు. 


 అనుబంధ సంఘాలపై ఆశలు


టీఆర్‌ఎస్‌ అనుబంధ మహిళా విభాగం అధ్యక్ష స్థానానికి కార్పొరేటర్‌ గందె మాధవి పోటీపడుతుండగా వివిధ అనుబంధ కమిటీల్లో కీలక పదవులను సీనియర్లు ఆశిస్తున్నారు. మేయర్‌ సునీల్‌రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు, సీనియర్‌నాయకులు, ఆశావహులు మంత్రి గంగుల కమలాకర్‌తో నగర శాఖపై చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల పదవులు అందరికి ఇవ్వడం సాధ్యపడదని, నగర, జిల్లా కమిటీతోపాటు అవసరమైతే రాష్ట్ర కమిటీలో కూడా కొందరికి అవకాశమిస్తామని చెప్పారని తెలిసింది. నగర, మండలశాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ఇందుకోసం ఆశావహులు, సీనియర్లు చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాలని సూచించినట్లు సమాచారం.