వైస్‌ చైర్మన-2 ఎవరు..?

ABN , First Publish Date - 2021-07-29T05:17:54+05:30 IST

కడప కార్పొరేషన, పులివెందుల, రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీల పాలకవర్గం మార్చి 18న కొలువుదీరింది. రెండు మూడు

వైస్‌ చైర్మన-2 ఎవరు..?

ఎంపికలో సామాజిక సమీకరణాలు

జడ్పీ, మండల పరిషత్తులో రెండో పదవి ఉంటుందా..?

వైసీపీలో ఇదే హాట్‌టాపిక్‌


నగర పాలిక, మున్సిపాలిటీల్లో రెండో డిప్యూటీ, వైస్‌ చైర్మన పదవులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ నెల 30వ తేదీన బాధ్యతలు చేపట్టేలా సన్నాహాలు చేస్తున్నారు. రెండో వైస్‌ చైర్మన పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా సామాజిక సమీకరణాల ఆధారంగా అధిష్టానం కసరత్తు చేస్తోందని వైసీపీ వర్గీయులు అంటున్నారు. కడప నగర డిప్యూటీ మేయర్‌-2గా బండి నిత్యానందరెడ్డి పేరు ఖరారైందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో ఎంపిక కొలిక్కిరాలేదు. రేపు ప్రమాణస్వీకారం చేసే వైస్‌ చైర్మన-2లు ఎవరు..? జడ్పీ, మండల పరిషత్తులో కూడా వైస్‌ చైర్మన-2 పదవులు ఉంటాయా..? వైసీపీలో ఇదే ప్రధాన చర్చగా మారింది.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన, పులివెందుల, రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీల పాలకవర్గం మార్చి 18న కొలువుదీరింది. రెండు మూడు మున్సిపాలిటీల్లో అనూహ్యంగా చైర్మన అభ్యర్థులను మార్చారు. డిప్యూటీ, వైస్‌ చైర్మన పదవులు ఆశించినవారికి సామాజిక సమీకరణాల రూపంలో నిరుత్సాహం మిగిలింది. చివరి క్షణంలో పదవులు చేజారడంతో సీనియర్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసంతృప్తికి లోనయ్యారు. ఈ సమయంలో వైస్‌, డిప్యూటీ చైర్మన-2 పదవులు ఉంటాయని, త్వరలోనే బాధ్యతలు చేపడతారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడమే కాదు.. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. కీలక నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధుల ద్వారా ఎవరికివారే ప్రయత్నాలు చేపట్టారు. మరో 24 గంటల్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కడప కార్పొరేషన డిప్యూటీ మేయర్‌-2గా బండి నిత్యానందారెడ్డి పేరు ఖరారైందని తెలిసింది. ఈ మేరకు నగరమంతా ఫ్లెక్సీలు సైతం వెలిశాయి.


మున్సిపాలిటీల్లో తెగని పంచాయితీ

- సీఎం జగన స్వంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీ వైస్‌ చైర్మన-2 అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. చైర్మన పీఠం బీసీకి రిజర్వు కావడంతో ఆ వర్గానికి చెందిన వల్లేపు వరప్రసాద్‌, వైస్‌ చైర్మనగా ఓసీ వర్గానికి చెందిన వైఎస్‌ మనోహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకు వైస్‌ చైర్మన-2 పదవి ఇవ్వాలని ఆదిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో కౌన్సిలర్లు సలీమా, షహీదా, రజీయాలు ప్రయత్నాలు తీవ్రం చేశారు.

- ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మనగా ప్రస్తుత ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌ మార్చి 18న బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సామాజిక సమీకరణాల వల్ల ఆ పదవి చేనేత సామాజికవర్గానికి చెందిన భీమునిపల్లి లక్ష్మిదేవిని వరించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బావమర్ది పాతకోట బంగారు మునిరెడ్డి వైస్‌ చైర్మనగా బాధ్యతలు చేపడతారని అందరూ భావించారు. అయితే ముస్లిం మైనార్టీకి చెందిన షేక్‌ ఖాజా మోహిద్దీనకు దక్కింది. వైస్‌ చైర్మన-2గా బంగారురెడ్డికే ఖాయమని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.

- బద్వేలు మున్సిపాలిటీ చైర్మనగా ఓసీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాకమల రాజగోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మనగా బీసీకి చెందిన వై.గోపాలస్వామి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైస్‌ చైర్మన-2గా ఓసీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన రాచపుడి సాయికృష్ణను ఎంపిక చేశారని తెలిసింది. 

- రాయచోటి మున్సిపాలిటీ చైర్మనగా ఫయాజ్‌, వైస్‌ చైర్మనగా ఓసీ సామాజికవర్గానికి చెందిన దశరథరామిరెడ్డి ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. వైస్‌ చైర్మన-2 పీఠం ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చంద్రశేఖర్‌కు దక్కే అవకాశం ఉందని వైసీపీ నాయకుల్లో చర్చ సాగుతోంది. 

- ఎర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మనగా ఓసీ రెడ్డి సామాజికవర్గం నుంచి మూలె హర్షవర్ధనరెడ్డి, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షేక్‌ జేబున్నీషా వైస్‌ చైర్‌పర్సనగా ప్రమాణస్వీకారం చేశారు. వైస్‌ చైర్మన-2 పీఠం ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. ఆ పదవికి 2వ వార్డు కౌన్సిలర్‌ చంద్రకళ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

- మైదుకూరు మున్సిపాలిటీ చైర్మనగా ఓసీ బలిజ వర్గానికి చెందిన మాచనూరు చంద్ర, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన షరీఫ్‌ వైస్‌ చైర్మనగా బాధ్యతలు చేపడితే.. తాజాగా వైస్‌ చైర్మన-2 ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

- జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్‌పర్సనగా బీసీ వేల్పునూరు శివమ్మ, వైస్‌ చైర్‌పర్సనగా ఓసీ మహిళ పోరెడ్డి రామలక్ష్మమ్మ మార్చి 18న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వైస్‌ చైర్మన-2 పదవి ఎస్సీలకు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. ఆ వర్గానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్‌ మంగతోటి సింగరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే.. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ముల్లా జానీ, 20వ వార్డు షేక్‌ షామీర్‌ ఆశిస్తున్నారు. 


జడ్పీ, మండల పరిషత్తులో వైస్‌ చైర్మన-2 ఉంటుందా..?

వైసీపీలో రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టేందుకు జగన ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా కార్పొరేషన్లు సృష్టించింది. కార్పొరేషన, మున్సిపాలిటీల్లో డిప్యూటీ మేయర్‌-2, వైస్‌ చైర్మన-2 పదవులు సృష్టించారు. పంచాయతీ రాజ్‌ చట్టం-1994 చట్టం వచ్చాక జరిగిన పలు ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన-2 పదవి లేదు. కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో శుక్రవారం 8 మందికి కొత్తగా పదవులు రానున్నాయి. ఇదే తరహాలో త్వరలో కొలువుదీరనున్న జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులో కూడా వైస్‌ చైర్మన-2 పదవులు ఉంటాయా..? జడ్పీ వైస్‌ చైర్మన పీఠం పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండు పదవులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని వైసీపీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే జిల్లాలో జడ్పీ, మండల పరిషత్తుల్లో 52-53 మందికి అదనంగా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-29T05:17:54+05:30 IST