Advertisement
Advertisement
Abn logo
Advertisement

షర్మిల ఎవరు వదిలిన బాణం?

తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవటానికి కుట్రపన్నినవాళ్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన తన హయాంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్‌ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బలహీనపరచటం మనం చూసిన చరిత్ర. వైఎస్ఆర్ మరణించి వుండకపోతే ‘తెలంగాణ ఉద్యమం’ అన్నదే చూడకపోయేవాళ్ళం అన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఆయన వారసత్వంగా వచ్చిన జగన్, విజయమ్మ, షర్మిలలు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలోనే సమైక్యవాదంతో తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేశారు. మరి నేడు షర్మిల అర్ధాంతరంగా మళ్ళీ తెరపైకి వచ్చి పార్టీ పెడతానంటూ లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. పైగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యమంటూ అర్థంపర్థంలేని నినాదం వినిపిస్తున్నారు. ఈ ఎత్తుగడకు షర్మిల రాజకీయ నిరుద్యోగమే కారణమా? లేక షర్మిల క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చటానికి బీజేపీ వదిలిన బాణమా? తెలంగాణలో ఎంఐఎంను, టీఆర్‌ఎస్‌ను విడగొట్టేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అలాగే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి టీఆర్‌ఎస్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పదవులను కేటాయిస్తున్నది. అలాగే టీఆర్‌ఎస్‌కు అండగా ఉండే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కూడా ఆ పార్టీకి కీలకం. కాబట్టి షర్మిల ద్వారా రెడ్డి, క్రిస్టియన్ ఓట్లను టీఆర్‌ఎస్‌కు కాకుండా చేసి తాను బలపడాలన్నది బీజేపీ వ్యూహంగా భావించవచ్చు. కానీ కుల ఉద్యమ సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రాణాలకు తెగించి పోరాడిన విద్యార్థి ఉద్యమ సంఘాలు ఉన్న తెలంగాణలో సమైక్యవాది ఐన రాజన్న రాజ్యం రావటం ఎప్పటికీ అసాధ్యమే! 

డా. కందుల మధు

టిజె‌ఎసి ఒయుజె‌ఎసి అధ్యక్షులు

Advertisement
Advertisement