Sep 29 2021 @ 19:19PM

Hello Brother: నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా?

నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘హలో బ్రదర్‌’. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఆయన నటించిన రెండో చిత్రం ఇది. (తొలి చిత్రం ‘వారసుడు’). అలాగే నాగార్జున సరసన సౌందర్య నటించిన తొలి సినిమా ఇదే. ‘ప్రియ రాగాలే’ పాట చిత్రీకరణతో ‘హలో బ్రదర్‌’ చిత్రం షూటింగ్‌ మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ పాట చిత్రీకరణ సమయంలోనే తొలిసారిగా సౌందర్యను కలుసుకున్నారు నాగార్జున. ఇందులో చిన్న సైజు దొంగగా, పాప్‌ సింగర్‌గా ఆయన నటించారు. కొన్ని సన్నివేశాల్లో ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేస్తాయి. ఇటువంటి సన్నివేశాల్లో నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా... హీరో శ్రీకాంత్. 


‘హలో బ్రదర్‌’ చిత్రాన్ని పూర్తి వినోద భరితంగా తీర్చిదిద్దారు దర్శకుడు ఈవీవీ. ఆయన మార్క్‌ వినోదం ఈ సినిమాలో కనిపిస్తుంది. నాగార్జున  తొలిసారిగా పూర్తి స్థాయి కామెడీ పాత్ర పోషించారు. అయితే ఈ చిత్ర విజయం మీద ఎందుకో ఆయనకు మొదటినుంచీ అపనమ్మకం. సినిమా విజయం సాధించదని, బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడం ఖాయం అని ఆయన అనేవారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘హలో బ్రదర్‌’ సూపర్‌ హిట్‌ అయింది. నాగార్జున, బ్రహ్మనందం, కోట, మల్లికార్జునరావు, నాగార్జున, శ్రీహరిలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని తెగ నవ్వించాయి. 1994లో విడుదలైన చిత్రాల్లో ‘హలో బ్రదర్‌’ టాప్‌ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ‘క్షణక్షణం’ చిత్రం తర్వాత దుర్గా ఆర్ట్స్‌ బేనరుపై కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.గోపాలరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

-వినాయకరావు