గాలి ద్వారా కరోనా వ్యాప్తి ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో..

ABN , First Publish Date - 2020-07-10T23:52:51+05:30 IST

గాలి ద్వారా నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తొలిసారి..

గాలి ద్వారా కరోనా వ్యాప్తి ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో..

న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. తుంపర్లు వెలువడేందుకు కారణమయ్యే వైద్య విధానాల వల్ల సార్స్-కోవ్-2 వైరస్ గాలిద్వారా వ్యాపించగలదని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో కాకుండా మరో విధంగా కూడా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించగలదా లేదా అన్న దానిపై ప్రస్తుతం విశ్లేషణ జరుపుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంతగా వెంటిలేషన్ లేని మూసివుంచిన ప్రదేశాల్లో.. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వ్యాపిస్తున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. బృంద గానం, రెస్టారెంట్లు, ఫిట్‌నెస్ క్లాసులు వంటి చోట్ల డ్రాప్‌లెట్స్ (బిందువులు)తో పాటు తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వివరించింది. 


కాగా కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై వస్తున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటున్నామనీ.. మరింత సమగ్రంగా సమీక్షిస్తామని తెలిపింది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయంటూ ఇటీవల వివిధ దేశాలకు చెందిన వందాలాది మంది పరిశోధకులు డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారు. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన మార్గదర్శకాలను దీనికనుగుణంగా సవరణ చేయాలని వారు కోరారు. 

Updated Date - 2020-07-10T23:52:51+05:30 IST