కరోనా గుట్టు విప్పేందుకు చైనాకి డబ్ల్యూహెచ్‌వో బృందం..

ABN , First Publish Date - 2020-06-30T19:34:34+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించేందుకు తమ బృందాన్ని చైనాకి పంపనున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ..

కరోనా గుట్టు విప్పేందుకు చైనాకి డబ్ల్యూహెచ్‌వో బృందం..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించేందుకు తమ బృందాన్ని చైనాకి పంపనున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం చాలా చాలా కీలకమనీ... అది ఎలా మొదలైందో తెలిస్తేనే వైరస్‌తో పోరాడగలమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ పేర్కొన్నారు. ఇందుకోసం వచ్చేవారంలో చైనా వెళ్లేలా ఓ బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పర్యటన ద్వారా వైరస్ ఎలా ప్రారంభమైందన్న దానిపై సమగ్ర అవగాహన సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ మిషన్‌లో భాగంగా ఎవరెవరిని పంపుతారు, ఈ బృందం ఎలా పనిచేస్తుంది అన్న సమాచారం మాత్రం డబ్ల్యూహెచ్‌వో చీఫ్ వెల్లడించలేదు.


చైనాలోని వుహాన్ కేంద్రంగా ఆరు నెలల క్రితం వెలుగుచూసిన ఈ మహమ్మారి ఇప్పటికే 5 లక్షల మందిని బలితీసుకుందనీ.. పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతోందని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ముందు మరింత విజృంభించే అవకాశం ఉందన్నారు. ‘‘ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాం. మళ్లీ మన జీవితాలు సాధారణ స్థితికి రావాలి. అయితే చేదు నిజం ఏమిటంటే.. ఇది అంత త్వరగా ముగిసేది కాదు. కొన్ని దేశాలు వైరస్‌ను నిలువరించగలిగినా.. ప్రపంచ వ్యాప్తంగా ఇది మరింత వేగం పుంజుకుంటోంది..’’ అని ఆయన పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి చైనానే కారణమనీ.. చైనాకి డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలనీ అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - 2020-06-30T19:34:34+05:30 IST