జనరల్ రావత్ వారసుని ఎంపిక మోదీ ప్రభుత్వానికి గొప్ప సవాల్

ABN , First Publish Date - 2021-12-09T18:51:42+05:30 IST

మన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్

జనరల్ రావత్ వారసుని ఎంపిక మోదీ ప్రభుత్వానికి గొప్ప సవాల్

న్యూఢిల్లీ : మన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అనూహ్యంగా దివంగతులు కావడంతో ఆ పదవిలో తదుపరి ఎవరిని నియమించాలనే విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఓవైపు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం, మరోవైపు యుద్ధం తీరు నానాటికీ మారుతుండటం వల్ల సీనియారిటీని మాత్రమే కాకుండా వినూత్న ఆలోచనలతో సైనిక దళాలను నడిపించగల సత్తా ఉన్నవారిని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఓ వారంలోనే నూతన సీడీఎస్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019లో స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ, సీడీఎస్ పదవిని సృష్టిస్తున్నట్లు ప్రకటించారు. అదే సంవత్సరం డిసెంబరు 31 నుంచి అమల్లోకి వచ్చే విధంగా తొలి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి ఎంపిక చేయడానికి నిర్దిష్టమైన విధానం లేదు. సీనియర్లకు పదోన్నతి కల్పించడం ఈ విషయంలో జరగదు. వివిధ సందర్భాల్లో చూపిన చొరవ, అమలు చేసిన ఆలోచనలు, ప్రతిభాపాటవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవికి నియామకం జరుగుతుంది. 


సైనిక దళాల్లో అతి పెద్దదైన భారత సైన్యం నుంచి తదుపరి సీడీఎస్‌ను నియమించవచ్చు. దేశంలోని సీనియర్ మోస్ట్ డిఫెన్స్ ఆఫీసర్‌ను ఈ పదవికి ఎంపిక చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీనియారిటీతోపాటు విశేష ప్రతిభగలవారిని ఈ పదవికి ఎంపిక చేస్తుంది. 


చైనా, పాకిస్థాన్‌లపై ప్రత్యేక దృష్టి

తదుపరి సీడీఎస్ నియామకం సమయంలో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్ళను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంటుంది. వెస్టర్న్ థియేటర్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు ఘర్షణాత్మక వైఖరితో ఉన్నాయి. ఈ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులు, రాకెట్లు, క్షిపణులను చైనా మోహరించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్‌ల నుంచి వస్తున్న ఉగ్రవాదాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంటుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమవడంతోపాటు, తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు ఉండటం, అంతేకాకుండా ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ పరిపాలన, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వంటివాటి ప్రభావం భారత దేశంపై పడుతోంది. కశ్మీరులో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దూకుడు పెంచింది. 


యుద్దం తీరు మారింది

21వ శతాబ్దంలో యుద్ధం చేసే తీరు పూర్తిగా మారిపోయింది. రణరంగంలో కత్తులు దూయటం, బాంబులు విసరడం మాత్రమే కాకుండా సైబర్ యుద్ధం, సమాచార యుద్ధం జరుగుతోంది. నిఘా సమాచార సేకరణ, తప్పుడు సమాచార వ్యాప్తి కోసం చైనా పుష్కలంగా ఖర్చుపెడుతోంది. తైవాన్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత దేశం, లిథువేనియా వంటి సార్వభౌమాధికారంగల దేశాలను చైనా తన జూనియర్ డిప్లమేట్ల ద్వారా బెదిరిస్తోంది. 


ఎవరు అర్హులు?

సీడీఎస్ పదవికి భారత దేశంలోని త్రివిధ దళాల కమాండింగ్ ఆఫీసర్లలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. భారత సైన్యం, భారత వాయు సేన (ఐఏఎఫ్), భారత నావికా దళంలలోని ఏ కమాండింగ్ ఆఫీసర్‌ని అయినా సీడీఎస్‌గా నియమించవచ్చు. అయితే ప్రతిభ, సీనియారిటీలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. కమాండింగ్ ఆఫీసర్ వయసు 65 సంవత్సరాలకు మించి ఉండకూడదు. 


ప్రస్తుతం భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవనే సైన్యంలో జనరల్ బిపిన్ రావత్ తర్వాత అత్యంత సీనియర్ ఆఫీసర్. జనరల్ నరవనే భారత సైన్యాధ్యక్ష పదవీ కాలం 2022 ఏప్రిల్ వరకు ఉంది. జనరల్ రావత్ తర్వాత ఆయన ఈ పదవిని 2019లో చేపట్టారు. 


ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ ఏడాది సెప్టెంబరు 30న ఐఏఎఫ్ చీఫ్ పదవిని చేపట్టారు. అడ్మిరల్ ఆర్ హరి కుమార్ నవంబరు 30న చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ పదవిని చేపట్టారు. కాబట్టి జనరల్ నరవనేతో పోల్చితే వీరిద్దరూ తమ పదవులకు కొత్తవారు. ఈ ముగ్గురినీ పరిశీలించినపుడు తదుపరి సీడీఎస్‌గా నియమితులయ్యే అవకాశం జనరల్ నరవనేకే ఎక్కువ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 


కొత్తగా ఈ పదవిని చేపట్టేవారు ఎవరైనప్పటికీ, జనరల్ బిపిన్ రావత్ చేపట్టిన సంస్కరణలు, ఆధునికీకరణ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్ళవలసి ఉంటుంది. 


Updated Date - 2021-12-09T18:51:42+05:30 IST