లంక టూర్‌లో పగ్గాలెవరికో?

ABN , First Publish Date - 2021-05-12T10:53:38+05:30 IST

మొదటిసారిగా భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతోంది. ముందుగా విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు వచ్చే నెల ఆరంభంలో

లంక టూర్‌లో పగ్గాలెవరికో?

రేసులో హార్దిక్‌, ధవన్‌


న్యూఢిల్లీ: మొదటిసారిగా భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతోంది. ముందుగా విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు వచ్చే నెల ఆరంభంలో ఇంగ్లండ్‌లో 3 నెలల పర్యటన కోసం వెళ్లనుంది. అటు జూలై రెండో వారంలో మరో భారత జట్టు శ్రీలంక టూర్‌లో మూడు వన్డేలు.. మూడు టీ20ల సిరీ్‌సలు ఆడబోతోంది. అన్ని మ్యాచ్‌లు కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి. అయితే ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎవరుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. రేసులో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న శ్రేయాస్‌ అయ్యర్‌ కోలుకుంటే అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.


‘శ్రీలంక టూర్‌కు వెళ్లే సమయానికి శ్రేయాస్‌ ఫిట్‌నెస్‌ ఎలా ఉంటుందో చెప్పలేం. సహజంగానైతే సర్జరీ అయ్యాక పునరావాస శిబిరానికి వెళ్లి పూర్తి స్థాయిలో శిక్షణ ఆరంభించేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది. ఒకవేళ శ్రేయాస్‌ కోలుకుంటే నేరుగా అతడినే కెప్టెన్‌గా చేయవచ్చు. ఇక జట్టులో సీనియర్‌గా ఉన్న ధవన్‌ ఐపీఎల్‌లో సత్తా చాటుకున్నాడు. తను కూడా గట్టి పోటీదారుడే. హార్దిక్‌ రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్నా కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తాడేమో. బౌలర్‌గాకన్నా అతడు మ్యాచ్‌ ఫినిషర్‌గా మారేందుకు ఎక్కువ ఫోకస్‌ చేయాలి’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు.


 కోచ్‌గా ద్రవిడ్‌!

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత రెండో జట్టుకు కోచ్‌గా ఎవరిని నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి టీమిండియాతోపాటే ఉంటాడు. దీంతో లంకకు వెళ్లే జట్టుకు కొత్త కోచ్‌, సహాయక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పదవికి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ను బోర్డు ఎంపిక చేయనుందనే కథనాలు వెలువడుతున్నాయి. అలాగే పారస్‌ మాంబ్రే కూడా లైన్‌లో ఉన్నాడు. ఇప్పటికైతే తుది నిర్ణయానికి రాలేదని, త్వరలోనే కెప్టెన్‌, కోచ్‌ ఎంపిక జరుగుతుందని బోర్డు అధికారి పేర్కొన్నాడు.

Updated Date - 2021-05-12T10:53:38+05:30 IST