ఆకాశాన్నంటిన India-Kuwait విమాన టికెట్ ధరలు.. ప్రయాణికులకు చుక్కలే!

ABN , First Publish Date - 2021-09-05T14:36:46+05:30 IST

భారత్‌ నుంచి కువైత్‌కు డైరెక్ట్ విమానాలకు ఆ దేశ మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలిపింది.

ఆకాశాన్నంటిన India-Kuwait విమాన టికెట్ ధరలు.. ప్రయాణికులకు చుక్కలే!

కువైత్ సిటీ: భారత్‌ నుంచి కువైత్‌కు డైరెక్ట్ విమానాలకు ఆ దేశ మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వారానికి 5,528 మంది భారత ప్రయాణికులు కువైత్ వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. వీటిలో ఇరు దేశాలకు చెందిన క్యారియర్లు చెరో సగం సీట్లు పంచుకోనున్నాయి. అయితే, భారత పౌరవిమానయాన శాఖ నుంచి విమాన షెడ్యూల్‌కు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. కానీ, కువైత్ క్యారియర్లు మాత్రం తమకు సివిల్ ఏవియేషన్ అథారిటీ కేటాయించిన షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు నడిపిస్తామని ప్రకటించాయి.


దీనిలో భాగంగా ఆ దేశానికి చెందిన జజీరా ఎయిర్‌వేస్ సెప్టెంబర్ 9వ తేదీన భారత్‌‌లోని కొచ్చికి నడపనున్న విమాన సర్వీసుకు సంబంధించిన టికెట్ ధరలను శుక్రవారం తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం కువైత్ నుంచి కొచ్చికి విమాన టికెట్ ధర రూ.2,43,308గా ఉంది. అలాగే ఇదే రూట్‌కు సంబంధించిన సెప్టెంబర్ 21వ నాటి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1,27,808గా నిర్ణయించింది.


ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన క్యారియర్లలో జజీరా ఎయిర్‌వేస్ మాత్రమే కువైత్-భారత్ మధ్య విమాన టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగి విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదిలాఉంటే.. సాధారణంగా కేరళ-కువైత్ సెక్టార్‌లో విమాన టికెట్ ధర కేవలం రూ. 15వేలు మాత్రమే ఉంటుంది. అదే పండుగ సీజన్ల అప్పుడు మాత్రం రూ.32వేల వరకు ఉంటుంది. అటువంటిది ఇప్పుడు రూ.2.43లక్షలకు చేరడంతో ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు.        

Updated Date - 2021-09-05T14:36:46+05:30 IST