Abn logo
Jan 21 2021 @ 01:22AM

ఏ పంక్తిలో ఎవరికి అమృతం?

విపత్కర నైతిక వైఫల్యం అంచున ప్రపంచం ఉన్నదట. ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిపతి ఆ మాట అన్నాడు. కరోనా టీకాల పంపిణీ విషయంలో పెద్ద దేశాలు చిన్న బుద్ధులను వదిలిపెట్టకపోతే, పెద్ద ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించాడు. తమకే, తమ దేశాల ప్రజలకే ముందుగా టీకాలు అందాలని సంపన్న, మధ్యతరగతి దేశాలు పడుతున్న తాపత్రయాన్ని ‘టీకా జాతీయవాదం’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు కాదు, ఏడాది కిందట కరోనా బుడిబుడి నడకలు నేర్చుకుంటున్నప్పుడే, టీకాల అవసరాన్ని గుర్తించడం, ఎవరికి వారు తామే మృత్యుంజయులు కావాలని ప్రయత్నించడం మొదలయింది. అన్ని దేశాలు ఈ పోటీలో ఉన్నాయని కాదు. ప్రపంచంలో సగం దేశాలు అడుగూ బడుగూ దేశాలే. వివిధ జీవ రసాయన కంపెనీలు పరిశోధనలు ప్రారంభించాయో లేదో సంపన్న, అగ్ర రాజ్యాలు వాటితో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఒకవేళ కనుక, మీ టీకా పరిశోధన విజయవంతమయితే, దాన్ని మాకే ఇన్ని డోసులు అమ్మాలి అని అడ్వాన్సులు ఇచ్చి మరీ మాట తీసుకున్నాయి. ఆర్థికంగా బలంగాను, ఓ మోస్తరుగాను ఉన్న దేశాలు ఇప్పటికి 500 కోట్ల డోసుల టీకాలను రిజర్వు చేసుకున్నాయట. దీనితో పేద, అత్యంత పేద దేశాల దాకా టీకా అందాలంటే దీర్ఘకాలం వేచి ఉండవలసి వచ్చేట్టు ఉన్నది. పేద దేశాల ప్రజలకు టీకా అందించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక కార్యక్రమం తీసుకున్నది. దానికి తగినంత మద్దతు ఇవ్వకపోతే, నైతికంగా సంక్షోభం ఏర్పడుతుందని ఒక బక్క బెదిరింపు ఇవ్వడం తప్ప ఆ సంస్థ మరేమీ చేయలేదు. 


మధ్యంతర ఆదాయ దేశాల లెక్కలో కూడా భారతదేశం రాకపోవచ్చును కానీ, టీకాలు తయారుచేసే ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండడం ఒక లాభం అయింది. అందరికీ ఆరోగ్యం కావాలి, దాని కోసం అనారోగ్యం తెచ్చుకోవడం ఇష్టం ఉండదు. అందుకని, ఆయా దేశాలు వాళ్ల దేశాల్లో టీకాల తయారీని ప్రోత్సహించవు. కాలుష్యం ఎక్కువట. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఇప్పటికే పదికోట్ల కోవిషీల్డ్ డోసులు ఉన్నాయి, నెలకు 5,6 కోట్ల డోసులు తయారుచేయగలిగే సామర్థ్యం ఉన్నది, ఇంకా పెంచుకుంటున్నారు కూడా. ఇక భారత్ బయోటెక్ ఏడాదికి 30 కోట్ల డోసులు తయారు చేయగలదు. ఇంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఇండియా వచ్చే ఆగస్టు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 60 కోట్ల డోసుల పంపిణీ కష్టమయ్యేట్టు ఉన్నది. సొంతంగా టీకా కనిపెట్టగలగడం అటుంచి, తయారుచేసే ఫ్యాక్టరీలు లేని, కొనుగోలు శక్తి లేని దేశాలు ఏమి చేయగలవు? 


ఇతర దేశాల టీకా జాతీయవాదం భారతదేశానికి చేయగలిగిన నష్టం పెద్దగా లేదు. అట్లాగని మన దేశంలో టీకా జాతీయవాదం లేదని కాదు. ఆ విషయంలో కూడా మనకు ఆత్మనిర్భరత, స్వావలంబన ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రకం టీకా వాదం మనదేశంలో ఉత్పత్తి అయింది. కరోనా వైరస్ క్రిమి ఆశ్చర్యపోయే విధంగా, దానికి కూడా కుల మతాన్ని అంటగట్టిన దేశంలో, ఆ క్రిమిపై జరిగే పోరాటంలో మాత్రం ఉద్వేగాలు ఉద్రేకాలు ఎందుకు ఉండవు? అయ్యా, మీరు ప్రజల మీద ప్రయోగిస్తున్న టీకాలు సురక్షితమైనవేనా, చేసిన ప్రయోగాల ఫలితాలు మీరు పరిశీలించారా, కాస్త ఆలస్యమైనా పరవాలేదు, పూర్తి భరోసా ఉన్న మందునే ఇవ్వవచ్చు కదా- అని కొందరు నోరువిప్పగానే, ఘనత వహించిన కేంద్ర మంత్రి ఒకరు ఏమన్నారు? టీకాలను శంకించడమంటే, రణరంగంలో ఉన్న సైనికులను శంకించినట్టే. విశ్వసించడం మన ధర్మం. అపనమ్మకం అధర్మం. పైగా దేశద్రోహం. 


అయినా, మనదేశ శాస్త్రవేత్తలను, వారి విజయాలను ఎవరైనా ఎందుకు శంకిస్తారు? ప్రాచీన, ఆధునిక శాస్త్రవిజ్ఞానాలలో భారతదేశం దోహదాలు అనేకం ఉన్నాయి. చేసిన ప్రారంభాలకు కొనసాగింపులు లభించకపోయి ఉండవచ్చు. నవీన విజ్ఞానంతో అనుసంధానించి, సంలీనం చేసుకోవడంలో విఫలమై ఉండవచ్చు. ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర భారతదేశం, తొలిదశకాల్లో ఎంతటి వైజ్ఞానిక అభినివేశాన్ని చూపినా, మౌలిక వ్యవస్థలను ఏర్పరచినా, దేశం నుంచి మేధావలస జరగకుండా నిరోధించలేకపోయారు, దేశీయ పరిశోధనలకు కావలసిన సానుకూల వాతావరణాన్ని నిర్మించలేకపోయారు. అయినప్పటికీ, ఈ దేశంలో గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు, గొప్ప ఆవిష్కరణలు జరిగాయి, ఈ దేశం నుంచి వెళ్లి రచ్చలో గెలిచిన వారు అనేకులున్నారు. అవన్నీ చెప్పుకోవలసిన గొప్పలే కదా? టీకా విషయంలో పద్ధతులు పాటించమని ఎందుకు అడిగారంటే, అది మునుపెన్నడూ లేనంత పెద్దస్థాయిలో చేస్తున్న ఆరోగ్య కార్యక్రమం కనుక. దానికి భద్రత ముఖ్యం కనుక. 


కొవిడ్–19ను మన పొరుగు శత్రువు తయారుచేస్తే, దేశంలో దాన్ని దేశద్రోహులు వ్యాపింపజేస్తే, దేశభక్తులు దాన్ని అరికట్టే ఔషధం కనిపెట్టారని చెప్పడం ఒక రసవత్తరమైన కథనం. మన దేశభక్తి ఎప్పుడూ పాకిస్థాన్ మీదే గురిపెట్టి ఉంటుంది కాబట్టి, పాకిస్థాన్ కంటె మెరుగుగా ఉండడమే మన పరమ లక్ష్యం, అత్యధిక లక్ష్యం కూడా అయిపోతుంది. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద కార్యక్రమం మొదలుపెడుతూ ప్రధానమంత్రి ఏం చెప్పారు? కొన్ని దేశాలు చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న తమ వారిని వెనక్కి రప్పించుకోలేకపోయాయి, మనం తీసుకురాగలిగాం- అని పాకిస్థాన్ వైఫల్యాన్ని గుర్తు చేశారు. గత ఏడాది జనవరి మూడోవారంలోనే కరోనా ప్రమాదంపై వేసిన కమిటీని, ఆ తరువాత దేశాన్ని సంసిద్ధం చేయడానికి మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ను అన్నిటిని ప్రధాని ఏకరువు పెట్టి, ఇతరుల కంటె ఈ విషయాల్లో భారత్ ముందున్నదని చెప్పుకున్నారు. చెప్పుకోవలసిందే, వాటిని కాకుండా, వలసకూలీల మహా పాదయాత్రలను, జీవనాధారాలపై కరోనా వేటును చెప్పుకోవాలని ఎందుకు ఆశిస్తాము? టీకాను ఆవిష్కరించడానికి ఆగస్టు 15, డిసెంబర్ 25 వంటి గడువులను విధించి, ఒత్తిడి తేవడం వెనుక కూడా టీకా జాతీయవాదమే ఉన్నది. ఇతర దేశాల్లోని టీకా జాతీయవాదం, కరోనాకు విరుగుడు మొదట తమకే, తమ దేశ పౌరులకే దక్కాలన్న జాతీయవాద ఆత్రుతను ప్రకటిస్తున్నది. ఒక గ్లోబల్ విపత్తు సమయంలో, ప్రపంచ మానవాళి ఒక సోదరభావంతో ఎదుర్కొనాలన్నది ఆదర్శం. ఆచరణలో దానికంత చెలామణి దొరకడం లేదు. మనదేశంలోని టీకా జాతీయవాదం, మునుపే స్థిరపడి, విస్తరిస్తున్న తీవ్ర జాతీయవాద ఎజెండాతో సంలీనమైపోయింది. 


భారత జాతీయోద్యమ విలువలలో స్వదేశీ ముఖ్యమైనది. విదేశీ వస్తు దహనం వంటి ఉద్యమ కార్యక్రమాలను, ఉద్యమకారులంతా ఖద్దరునే ధరించాలనే ప్రవర్తనా నియమావళిని నాటి ఉద్యమం అమలుచేసింది. స్వాతంత్ర్యానంతరం, మిశ్రమ ఆర్థికవ్యవస్థ పేరుతో గడిచిన కాలంలో కూడా, భారతీయ తయారీలను కొనుగోలు చేయడమే నిజమైన భారతీయులుగా మెలగడమన్న నినాదం వినపడేది. నూతన ఆర్థిక విధానాల ప్రారంభం తరువాత, ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న ప్రక్రియ ఉధృతమైన తరువాత, ఉన్న కొద్దిపాటి స్వదేశీ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఆదరణ మరీ తగ్గిపోయింది. తయారీ రంగంలో అయితే మరీ కనాకష్టం. ఇక ఎట్లాగూ, మనమే కనిపెట్టి, మనమే ఉత్పత్తిచేయడం అయ్యేది కాదు అనుకుని, మేడిన్ ఇండియాను మేకిన్ ఇండియాగా సవరించుకున్నాము. ఎక్కడో కనిపెట్టబడి, ఎవరో పెట్టుబడి పెడితే, మనం కాసింత భూమి, కొంత చవుక శ్రమ, మరికొంత పన్నురాయితీలు ఇచ్చి, సాంకేతికంగా ఈ నేల మీద ఉత్పత్తిని చేసి మమ అనడమే ఈ మేకిన్ ఇండియా. వియత్నాంలూ, మలేషియాలూ, కొరియాలూ ఈ కొరివితోనే తలగోక్కున్నాయట. ఆ లెక్కన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వారు తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ టీకాను ఆత్మనిర్భరతతో మనం దేశీయం చేసేసుకున్నాం. పూణేలోని ఆ ఇన్‌స్టిట్యూట్, వివిధ ప్రపంచ కంపెనీలకు చెందిన అనేక ఇతర కొవిడ్ టీకాలను కూడా పరీక్షిస్తున్నది, ఉత్పత్తి చేయనున్నది. కోవిషీల్డ్‌తో పాటు, కోవాగ్జిన్‌ను కూడా వరుసలో నిలబెట్టి, రెంటినీ స్వదేశీ లెక్కలో జమ వేయడం న్యాయం కాదు. భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్, స్వదేశీ, సందేహం లేదు. మరి ప్రభుత్వం వారి టీకా పంపిణీలో ఏ టీకా ఎంత విస్తృతంగా ఉపయోగిస్తున్నారో చూస్తే, కొన్ని అనుమానాలు రాకమానవు. వైద్య ఆరోగ్య ప్రాధాన్యాల ప్రకారం మొదట టీకా అందవలసిన శ్రేణులు సరే. వారికి పంపిణీ ముగిసిన తరువాత, సామాజిక, ఆర్థిక ప్రాతిపదికలపై వేర్వేరు రకాల టీకాలు అందుతాయోమే తెలియదు. అందరూ కలిసి సాగరమథనం చేశాక, అమృతం పంపిణీ చేయడానికి దేవుడే దిగి రావలసి వచ్చింది! తమకు దక్కదేమోనని రాక్షసులు మాస్కులు పెట్టుకుని దేవతల పంక్తిలో కూర్చొనవలసి వచ్చింది. 


ఇతర దేశాలకు అందకుండా, టీకా క్యూలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మాత్రమే టీకా జాతీయవాదం కాదు. అది మరీ పెద్ద దేశాల విద్య. భారత్ వంటి ప్రాంతీయ శక్తి, చుట్టుపక్కల చిన్నా చితకా దేశాలకు టీకాను పెద్దమనసుతో అందుబాటులోకి తెస్తోంది. దాతృత్వం చూపగలగడం కూడా ఒకరకం జాతీయవాదమే. దాతృత్వం ప్రతిష్ఠనే కాదు, గ్రహీతలపై కొంత పట్టును కూడా అందిస్తుంది. గ్రహీత దేశాల్లో బ్రెజిలూ ఉన్నది, భూటానూ ఉన్నది. పంపిస్తున్న టీకా మందు కోవాగ్జిన్. కొంత ఖరీదుకు కొంత ఉచితంగానూ మనదేశం పంపిస్తున్నదట. మన సాయం అందుకునే పొరుగుదేశాల్లో పాకిస్థాన్ లేదట. ఆ దేశం చైనా టీకా వైపు ఆశగా చూస్తున్నదట. దానిదొక జాతీయవాదం!

కె. శ్రీనివాస్