ఎవరికి బంగారం?

ABN , First Publish Date - 2021-10-22T05:42:17+05:30 IST

పంట వేస్తే చేతికి వచ్చేదే ఓ పెద్ద ప్రయాస. ఇలా చేతికి వచ్చిన పంట ఇంటికి రావడం ఒక ఎత్తయితే... ఇంటికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లభించడం మరో ఎత్తు. ఈ సీజన్‌లో పత్తి పంటకు భారీ ధర పలికే అవకాశం కనిపిస్తున్నా భిన్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటి మాదిరిగా రైతుకు నష్టం.. వ్యాపారికి లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎవరికి బంగారం?
గజ్వేల్‌ మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన పత్తి


బహిరంగ మార్కెట్‌లో పత్తికి ఊహించని డిమాండ్‌ 

రైతుల చేతికి పంట వచ్చే సరికి దిగువకు!

సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకుంటే వ్యాపారులు సిండికేట్‌ అయ్యే అవకాశం


గజ్వేల్‌, అక్టోబరు 21 : పంట వేస్తే చేతికి వచ్చేదే ఓ పెద్ద ప్రయాస. ఇలా చేతికి వచ్చిన పంట ఇంటికి రావడం ఒక ఎత్తయితే... ఇంటికి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లభించడం మరో ఎత్తు. ఈ సీజన్‌లో పత్తి పంటకు భారీ ధర పలికే అవకాశం కనిపిస్తున్నా భిన్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటి మాదిరిగా రైతుకు నష్టం.. వ్యాపారికి లాభం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగులో భాగంగా 83,343 మంది రైతులు 1,26,925 ఎకరాల్లో పత్తి పంటను పండించారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా 12,69,250 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గతంలో సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ద్వారా పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసేది. కానీ ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో ఊహించని ధర ఉండడంతో సీసీఐ కొనుగోళ్లు నామమాత్రంగానే మారనున్నాయి. కానీ పత్తి పంట రైతుల చేతికి వచ్చే సరికి ప్రస్తుతం ఉన్న ధర నిలబడుతుందా లేక వ్యాపారుల చేతుల్లో సిండికేట్‌గా మారి తెల్లబంగారం కాస్త నల్లబంగారంగా మారుతుందో చూడాలి.


క్వింటాలుకు రూ.7,200 - రూ.7,500 

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తి మంచి ధర లభిస్తుంది. గజ్వేల్‌ మార్కెట్‌లో గురువారం రూ.7,200 పత్తికి ధర పలుకగా, మిల్లుల్లో రూ.7,500 పలికింది. ఈ ధర రైతు చేతిలో పత్తి ఉన్నంత కాలం ఉంటే రైతులకు కష్టాలు గట్టెక్కినట్లే. కానీ పూర్తిస్థాయిలో పత్తి పంట చేతికందే సరికి ధర పడిపోతే ఏంటో పరిస్థితి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో సీసీఐ ద్వారా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తే బహిరంగ మార్కెట్‌లో ధర తగ్గినా సీసీఐకి విక్రయించి కనీసం ప్రభుత్వ మద్దతు ధర రూ.6,025 అయినా పొందే అవకాశాలున్నాయి. సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించని పక్షంలో దళారులు సిండికేట్‌గా మారి ధరను తగ్గిస్తే రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. సీసీఐ ద్వారా కమర్షియల్‌ కాటన్‌ పర్చేజ్‌ను కూడా ప్రారంభిస్తే దళారుల మధ్య పోటీ పెరిగి మంచి పత్తికి ఎక్కువ ధర లభించే అవకాశాలున్నాయి. 


గతంలోనూ తగ్గిన పత్తి ధరలు

సీజన్‌ ప్రారంభంలో ఊరించే పత్తి ధరలు సీజన్‌ మధ్యలో రైతుల చేతుల్లోకి భారీగా పత్తి వచ్చే సమయానికి ఊహించని స్థాయిలో పడిపోయిన సంఘటనలు గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. గత సీజన్‌ ఆరంభంలో మొదట రూ.6,500 నుంచి రూ.7000 పలికిన పత్తి ధర సీజన్‌ మధ్యలో కనీసం రూ.5,500 కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు సీసీఐకి విక్రయించి లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లను ప్రారంభించాల్సిందే. కాగా ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం మిల్లర్ల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించని పరిస్థితి నెలకొన్నది. మిల్లర్లు సైతం నానా ఇబ్బందులున్నాయని, వాటిని తీరుస్తేనే టెండర్లు వేస్తామని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో పత్తికి మంచి ధర లభిస్తుండడంతో ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఒత్తిడి ఏం లేకుండా పోయింది. ఒకవేళ సీజన్‌ మధ్యలో ధర పడిపోతే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కనీసం మండలానికి ఒకటైనా సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు ప్రయోజనం చేకూరవచ్చు.


Updated Date - 2021-10-22T05:42:17+05:30 IST