Abn logo
Nov 24 2021 @ 00:52AM

ఎవరిది పైచేయి?

ముంబై మాజీ పోలీసు చీఫ్ పరమ్ బీర్ సింగ్‌కు అరెస్టునుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలు విశేషమైనవి. తనపై దాఖలైన కేసుల దర్యాప్తులో సదరు అధికారి సహకరించాల్సి వుంటుందని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ ముందస్తు రక్షణనిచ్చింది. పరమ్ ఎక్కడకూ పారిపోలేదనీ, దేశంలోనే ఉన్నారనీ, కానీ ముంబైలో కాలుపెట్టగానే అరెస్టుతప్పదన్న భయం ఆయనను వెంటాడుతున్నదని పరమ్ తరఫు న్యాయవాది చెప్పుకొచ్చారు. విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం, కానీ, నామీద మహారాష్ట్ర పోలీసులు ఆరుకేసులు పెట్టారు, నా ప్రాణాలకే ప్రమాదం ఉన్నది అంటూ న్యాయవాది ద్వారా పరమ్ సర్వోన్నత న్యాయస్థానం ముందు వాపోయినప్పుడు, గతంలో తాను నాయకత్వం వహించిన పోలీసు వ్యవస్థ నుంచే తనకు ముప్పు ఉన్నదని ఒక పోలీసు అధికారి వాపోవడమేమిటని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. అనేక నెలలుమాయమైన పోలీసు ఉన్నతాధికారి తాను ఎక్కడున్నదీ చెప్పకుండా రక్షణ కరువైందని వాపోవడం న్యాయస్థానానికి విచిత్రంగా అనిపించింది. ఇటువంటి వాతావరణమూ పరిస్థితులూ తప్పుడు సంకేతాలిస్తాయని న్యాయమూర్తి కౌల్ వ్యాఖ్యానించారు.


మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్  అక్రమవసూళ్ళకు పాల్పడుతున్నారంటూ పరమ్ చేసిన ఆరోపణలతో అనిల్ పదవి కోల్పోయారు. ఎవరెవరినుంచి ఎంతెంత వసూలు చేయాలో అనిల్ ఆదేశిస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు తాను లేఖరాయగానే ఆ లేఖ ఉపసంహరించుకొని హోంమంత్రితో రాజీకుదర్చుకోమంటూ తనపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్ళు వచ్చాయనీ, దీనితో తాను ముంబై కోర్టుకు, సీబీఐకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పరమ్ అంటున్నారు. అనిల్ మీద పరమ్ ఆరోపణలు చేయడంతో ముంబై పోలీసు ఉన్నతాధికారి పదవి నుంచి ఆయనను తప్పించారు. ఆ తరువాత ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేయడంతో అనిల్ రాజీనామా చేయక తప్పలేదు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా ఆయనపై విరుచుకుపడింది. గత కొద్దినెలలుగా ఆయన నివాసాలమీదా, సహాయకులమీదా దాడులు చేస్తున్న ఈడీ ఈనెల ఒకటోతేదీన ఆయనను అరెస్టు చేసింది. ఇక, పరమ్ అక్టోబర్ నుంచి బాహ్యప్రపంచానికి కనిపించడం మానేశారు. ముంబై పోలీసు కమిషనర్ పదవినుంచి ఆయనను తప్పించిన తరువాత మేనెలలో ఆఫీసుకు వెళ్ళి ఆ తరువాత సెలవులమీద నెట్టుకొచ్చారు. 


ఇక, అరెస్టునుంచి సుప్రీంకోర్టు రక్షణ ఇచ్చిన మరునాడే, ముంబైలో పరమ్ ఫ్లాట్ తలుపుమీద ముంబై పోలీసులు గతవారం ఆయనను స్థానిక కోర్టు ప్రకటిత అపరాధిగా వెలువరించిన ఆదేశాలను అంటించిమరీపోయారు. పరమ్ మీద నమోదైన కేసులు విచారిస్తున్న ముంబై క్రైమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టునుంచి మూడుమార్లు వారెంట్లు జారీ చేయించినా, పరమ్ ప్రత్యక్షం కాకపోవడంతో ఇప్పుడు పలాయితుడిగా  ముద్రపడింది. పరమ్ బీర్ ముప్పైరోజుల్లోగా కోర్టుకు కనిపించకపోతే ఆయన అధికారాలు, ఆస్తులూ సర్వమూ కోల్పోవలసి రావచ్చు. సాధారణ పౌరుడి కంటపడినా ఆయనను  పోలీసులకు పట్టివ్వవచ్చు. అవినీతి, అక్రమవసూళ్ళకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు తనపై పెట్టిన ఐదు కేసులతో పాటు, అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారంమీద మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ విచారణకూడా పరమ్ ఎదుర్కోవలసి ఉంది. కానీ, తాను కమిషన్ ముందు హాజరుకావడానికీ, సాక్ష్యాలు ఇవ్వడానికి సిద్ధంగా లేనని తేల్చేశారు. అనిల్ మీద తాను చేసిన ఆరోపణలకు పరమ్ వద్ద సరైన ఆధారాలు లేవనడానికి ఇది రుజువని ఎన్సీపీ నాయకుల వాదన. నిజానికి ఈడీ కూడా పరమ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన గైర్హాజరైనప్పటికీ దానికంటే ముఖ్యంగా దాని ప్రధాన దృష్టి మహారాష్ట్ర ఉన్నతాధికారులను ప్రశ్నించడంపైనా, కోర్టుకు రప్పించడంపైనా ఉన్నది. ఉపరితలంలో ఏమి కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్రకూ కేంద్రానికీ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం అంతిమంగా ఎలా ముగుస్తుందో చూడాలి.