Abn logo
Jul 27 2021 @ 10:37AM

పెగాసస్‌పై చర్చకు భయమెందుకు?: కేంద్రాన్ని నిలదీసిన దిగ్విజయ్

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారంనాడు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ''పార్లమెంటులో చర్చకు మోదీ-అమిత్‌షా ఎందుకు భయపడుతున్నారు? అంతర్గత భద్రత, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, ఏ నేరగాడిపైనానా చట్టబద్ధమైన నిఘా తప్పుకాదు. కానీ, మన సమాచారం మొత్తాన్ని ఎన్‌ఎస్ఓకు, ఇజ్రాయలీలు తెలుసుకునే వీలు మాత్రం కల్పించకూడదు''అని దిగ్విజయ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 2019లో తాను రాజ్యసభలో ఈ అంశం లేవనెత్తినప్పుడు ఐటీ మంత్రి తన ప్రజలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారని అన్నారు. పెగాసిస్‌పై రాజ్యసభలో మంగళవారం చర్చించాలని నోటీసు ఇచ్చానని, పూర్తి స్థాయి చర్చకు మోదీ, అమిత్‌షా అంగీకరిస్తారనే అనుకుంటున్నానని అన్నారు. అన్నింటికీ మించి ఇది దేశ భధ్రతా సమస్య అని ఆయన అన్నారు. జాతీయ భద్రతపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, వాస్తవాలను దాచిపెడుతోందని కూడా దిగ్విజయ్ కేంద్రంపై ఆరోపణలు చేశారు.

పెగాసస్ వ్యవహారంపై ఇజ్రాయెల్ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు, మోదీ-షాలు ఎందుకు ముఖం చాటేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. జాతీయ భద్రతాపై వాళ్లకెలాంటి ఆందోళనా లేదా? ఎన్‌ఎస్‌పైకు వ్యతిరేకంగా మీ కేసులో సహకరించమని మీ మిత్రుడు మోదీని దయజేసి మార్క్ జుకెర్‌బెర్గ్ కోరగలరా?'' అని దిగ్విజయ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పెగాసస్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.