సీపీఎస్‌ రద్దుపై తాత్సారం ఎందుకో..?

ABN , First Publish Date - 2021-07-30T05:49:32+05:30 IST

సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదో తెలియడం లేదని ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు తమరాన త్రినాథ్‌ అన్నారు.

సీపీఎస్‌ రద్దుపై తాత్సారం ఎందుకో..?
ధర్నా శిబిరంలో కూర్చున్న ఉపాధ్యాయులు

ఏపీటీఎఫ్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు త్రినాథ్‌

చోడవరంలో ఉపాధ్యాయుల ఆందోళన


చోడవరం, జూలై 29: సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదో తెలియడం లేదని ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు తమరాన త్రినాథ్‌ అన్నారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు, డీఎ బకాయిలు చెల్లింపు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యం తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హామీ ప్రకారం సీఎం జగన్‌ తక్షణమే సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులను వేదనకు గురిచేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఏపీటీఎఫ్‌ నేత జగన్నాథరావు మాట్లాడుతూ, ప్రతి నెలా ఒకటో తేదీనాటికి వేతనాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక ట్రైనీ కలెక్టర్‌ అదితిసింగ్‌కు ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు గొల్లు శ్రీనివాసరావు, ఎం.మహలక్ష్మినాయుడు, తాలూకా పరిధిలోని ఏపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T05:49:32+05:30 IST