ఎందుకీ ‘చైర్‌’?

ABN , First Publish Date - 2021-08-19T05:38:59+05:30 IST

‘రాష్ట్రస్థాయిలో పదవి లభించింది. ఇక మనకు తిరుగులేదు. మన వర్గానికి, నమ్ముకున్న వారికి అన్నివిధాలా న్యాయం చేస్తాం’..అంటూ వివిధ కార్పొరేషన్‌ పదవులు దక్కించుకున్న వారు సంబర పడిపోయారు. తీరా నెలలు గడుస్తున్నా విధులు, నిధులు లేకపోవడంతో నీరుగారిపోతున్నారు.

ఎందుకీ ‘చైర్‌’?




విధులు, నిధులు లేవు

జిల్లా కేంద్రంలో చాంబర్‌ కరువు

కార్పొరేషన్‌ చైర్మన్ల పెదవి విరుపు

పేరుకే పదవి.. ఏ ముచ్చటా లేదని ఆవేదన

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

‘రాష్ట్రస్థాయిలో పదవి లభించింది. ఇక మనకు తిరుగులేదు. మన వర్గానికి, నమ్ముకున్న వారికి అన్నివిధాలా న్యాయం చేస్తాం’..అంటూ వివిధ కార్పొరేషన్‌ పదవులు దక్కించుకున్న వారు సంబర పడిపోయారు. తీరా నెలలు గడుస్తున్నా విధులు, నిధులు లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. తమ పదవులు కేవలం అలంకారప్రాయమేనని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌లకు తగిన హోదా, ప్రోటోకాల్‌ లాంఛనాలు కల్పించనున్నట్లు వైసీపీ అధిష్టానం లీకులిచ్చింది. దీంతో అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. కొందరు బడా నాయకులు సైతం ఈ పదవుల కోసం పోటీ పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అనుచరవర్గానికే చైర్మన్‌ పదవులు దక్కేలా పావులు కదిపారు. కొందరు పార్టీ అధిష్టానంతో నేరుగా మంతనాలు జరిపి మరీ పదవులు చేజిక్కించుకున్నారు.  పదవులు దక్కి నెలలు గడుస్తున్నా..ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. కనీసం జిల్లా కేంద్రంలో ఛైర్మన్‌లకు ఛాంబర్లు కూడా కేటాయించలేదు. కనీసం సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే వారిని కలిసేందుకు సరైన వేదిక కానీ..కార్యాలయం కానీ వారికి లేదు.  తొమ్మిది నెలల కిందట జిల్లాకు ఏకంగా ఆరు కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌ పదవులు దక్కాయి. ఇటీవలే మరో ఏడు పదవులు వరించాయి. పదవుల పంపకాలలో జిల్లాకు ప్రాధాన్యమిచ్చినా నిధులు, విధుల్లో మాత్రం తాము ఆశించిన దానికంటే విరుద్ధ పరిస్థితులు ఉన్నాయని చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 సకాలంలో రాని అలవెన్సులు

కార్పొరేషన్‌  ఛైర్మన్‌లకు గౌరవ వేతనం, వాహన అలెవెన్సులు కూడా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని తెలుస్తోంది. తొలి దశలో పదవులు పొందిన జిల్లాకు చెందిన ఆరుగురు ఛైర్మన్‌లకు మాత్రం ఇటీవలే ఐదు నెలలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదలైనట్టు సమాచారం. కానీ అభివృద్ధి పనులకు మాత్రం నిధులు విదల్చలేదు. జిల్లా కేంద్రంలో కనీసం ఛాంబరు,  ప్రొటోకాల్‌ లాంఛనాలు ఏర్పాటు చేయాలన్న వీరి విన్నపం సైతం బుట్టదాఖలైంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మొండిచేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లాలో కొందరు ఛైర్మన్‌లు ఇప్పటికే తమ నేతల ద్వారా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అడిగినోళ్లకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇచ్చిన సర్కారు నిధులు ఎప్పుడు కేటాయిస్తుందో వేచి చూడాలి మరి.



Updated Date - 2021-08-19T05:38:59+05:30 IST