38 ఏళ్ల ఈ వ్యక్తిని చైనా ఎందుకు అరెస్ట్ చేసింది.. ఇంతకీ అసలు కథేంటి..?

ABN , First Publish Date - 2021-06-03T20:54:55+05:30 IST

38 ఏళ్ల ఈ వ్యక్తిని చైనా ఎందుకు అరెస్ట్ చేసింది.. ఇంతకీ అసలు కథేంటి..?

38 ఏళ్ల ఈ వ్యక్తిని చైనా ఎందుకు అరెస్ట్ చేసింది.. ఇంతకీ అసలు కథేంటి..?

చైనాలో చట్టాలు కఠినంగా ఉంటాయని చాలా మందికి తెలుసు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించినా కూడా దాన్ని దేశద్రోహం లెవల్లో పరిగణిస్తారా దేశంలో. ఇప్పుడు ఆ దేశంలోని చట్టాల గురించి చర్చ ఎందుకూ అంటే? తాజాగా అక్కడ ఒక 38 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను చేసిన నేరం ఏంటంటే.. గతేడాది కరోనా మహమ్మారి మనదేశంలో ఇంకా అడుగుపెట్టకముందు జరిగిన గాల్వాన్ లోయ ఘటన గురించి మాట్లాడటమే. హిమాలయాల్లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ గుర్తుంది కదా. ఆ సమయంలో ఈ రెండు దేశాల మధ్య యుద్దం వచ్చినా రావొచ్చు అనేంత ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.


ఇక్కడ జరిగిన ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణ జరిగిన వెంటనే ఈ వివరాలను భారత్ వెల్లడించింది. చైనా దళాలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని భారత్ ప్రకటించింది. కానీ చైనా మాత్రం ఈ ఘర్షణల్లో ఎంత మంది మరణించిందీ లెక్కలు చెప్పలేదు. ఘర్షణ జరిగిన 8 నెలల తర్వాత ఈ లెక్కలు వెల్లడించింది. భారత్‌తో జరిగిన ఘర్షణలో నలుగురు జవాన్లు మరణించగా, ఒకరికి గాయాలైనట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిగో ఇప్పుడు దాని గురించే 38 ఏళ్ల కియు జిమింగ్ అనే మాజీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ప్రశ్నలు లేవనెత్తాడు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న కియూ.. చైనా చెప్పిన గల్వాన్ లోయ లెక్కలపై పెదవి విరిచాడు.


కియూ చేసిన పోస్టులు.. దేశం కోసం త్యాగాలు చేసే సైనికులను కించపరిచేలా ఉన్నాయని, వారి గౌరవానికి భంగం కలిగించాయని కోర్టు భావించింది. అలాగే సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెంచేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కియూ తన తప్పు ఒప్పుకొని శిక్షకు అంగీకరించడంతోపాటు మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్రమాణం చేయడంతో కోర్టు కొంత జాలి చూపించదట. అందుకే అతనికి కేవలం 8 నెలల జైలు శిక్ష మాత్రమే విధించిందట. దీనికితోడు తీర్పిచ్చిన పదిరోజుల్లోపు కియూ... జాతీయ మీడియాలోగానీ లేదంటే ప్రముఖ వెబ్‌సైటులోగానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది. జైల్లో ఉండగానే తన తప్పును అంగీకరిస్తూ కియూ క్షమాపణలు చెప్పిన వీడియో ఒకటి చైనా మీడియాలో వచ్చింది. కియూతోపాటు మరో ఐదుగురిని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే పోలీసులు అరెస్టు చేశారట. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏడో నిందితుడు విదేశాల్లో ఉన్న ఒక టీనేజీ కుర్రాడని అధికారులు భావిస్తున్నారు.


‘‘మరణించిన నలుగురు జవాన్లు ఒక అధికారిని కాపాడటానికి వెళ్లారు. ఇలా రక్షించడానికి వెళ్లిన వాళ్లే చనిపోతే.. మరి వీళ్లు రక్షించాల్సిన వాళ్లు ఏమైనట్లు? అంటే నలుగురి కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చని తెలియట్లేదూ? నిజాలను చెబితే తప్పేముంది.? ఇలా దాచాల్సిన అవసరం ఏముంది.?’’ అంటూ కియూ మార్చి 1న ఒక పోస్టు పెట్టాడు. సరిగ్గా అదే రోజు చైనాలో కొత్త క్రిమినల్ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం దేశ సేవలో వీరమరణం పొందిన జవాన్లకు అపకీర్తి కలిగేలా వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన నేరం. ఈ చట్టం ప్రకారం కియూను చైనా అధికారులు అరెస్టు చేశారు. అతనిపై జియాన్యే డిస్ట్రిక్ట్ పీపుల్స్ కోర్టులో విచారణ జరిగింది. కియూ తన నేరాన్ని ఒప్పుకోవడంతో అతనికి తాజాగా 8 నెలల జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Updated Date - 2021-06-03T20:54:55+05:30 IST