చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే YS Jagan తో చిరంజీవి భేటీ అయ్యారేం..!?

ABN , First Publish Date - 2022-01-13T20:28:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.

చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే YS Jagan తో చిరంజీవి భేటీ అయ్యారేం..!?

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గురువారం నాడు మధ్యాహ్నం అమరావతిలోని జగన్ నివాసానికి వెళ్లిన చిరు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి.. అనంతరం శాలువా కప్పారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. సుమారు గంటన్నర పాటు ఇద్దరి మధ్య పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదం, థియేటర్ల వ్యవహారంపైనే చర్చించినట్లు తెలియవచ్చింది. అయితే.. అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది..? భేటీ వెనుక ఆంతర్యమేంటి..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మెగాస్టార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే  ఈ భేటీ జరిగిందేం..? అంటూ అటు టాలీవుడ్‌లో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఇటు సోషల్ మీడియాలో అయితే చిత్రవిచిత్రాలుగా చర్చించుకుంటున్నారు.


ఇప్పుడే ఎందుకు..!?

తన రాజ్యసభ ఎంపీకి పదవీకాలం ముగిశాక రాజకీయాలకు చిరు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు.. రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇక సినిమాలకే తన జీవితం అంకితమని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అలా సినిమాలతో ప్రస్తుతం చిరంజీవి బిజీబిజీగా గడుపుతున్నారు. అంతేకాదు.. తన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ పెట్టినప్పటికీ కనీసం ఎన్నికల ప్రచారానికి కానీ.. ఆ పార్టీ గురించి ఎక్కడా ముక్క కూడా మాట్లాడలేదు. రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. నిన్న, మొన్న కూడా చంద్రబాబు.. చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి చిరు వార్తల్లో నిలిచారు. అయితే.. చంద్రబాబు అలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఇలా జగన్ నుంచి పిలుపు రావడం.. చిరు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. మరి బాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఎందుకు భేటీ అయ్యారనే విషయం పెరుమాళ్లకే ఎరుక.


చిరు ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎయిర్‌పోర్టులో చిరు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినీ ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. సీఎం ఆహ్వానం మేరకే విజయవాడ వచ్చాను. సీఎంని కలిశాక అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానుఅని చిరు చెప్పారు. జగన్ నివాసంలో గంటన్నరపాటు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే జగన్-చిరు భేటీ ముగిసింది.


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..!?

2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే టీడీపీ అధికారంలోకి వచ్చేది. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా నాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి నాతో బాగానే ఉన్నారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగం. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా నాకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా.. టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన సందర్భంలో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-01-13T20:28:55+05:30 IST