జగన్ పంద్రాగస్టు ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన లేదేం..!?

ABN , First Publish Date - 2021-08-15T18:12:53+05:30 IST

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను జగన్ సర్కార్ ఘనంగా నిర్వహించింది...

జగన్ పంద్రాగస్టు ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన లేదేం..!?

అమరావతి : విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను జగన్ సర్కార్ ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు. ముఖ్యంగా.. ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రత్యేకించి మరీ తన ప్రసంగంలో జగన్ మాట్లాడారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం చాలా చేస్తోందని అని ఒకే ఒక్క మాటతో సరిపెట్టారు.


ఎందుకు ప్రస్తావించలేదో..!?

అయితే.. గతంలో పలు సభల్లో, సమావేశాల్లో, పంద్రాగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలా సార్లే ప్రస్తావించారు. అయితే.. ఈ పంద్రాగస్టు ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావనే అస్సలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదు..? మరిచిపోయారా..? లేకుంటే ప్రతిసారీ మాట్లాడుతున్నాం కదా.. అని తేలిగ్గా తీసుకున్నారా..? అనేది తెలియరాలేదు. అయితే.. మూడు రాజధానుల ప్రస్తావన రాకపోవడంతో వేడుకలకు వచ్చిన పెద్దలు, వైసీపీ నేతలు, వీక్షకులు ఇదేంటి..? జగన్ అన్నీ మాట్లాడారు కానీ మూడు రాజధానుల ప్రస్తావనే తేలేదేం..? అని ఒకింత ఆశ్చర్యపోయారట. అయితే.. తాను చేసిన పాదయాత్రలో ప్రజా సమస్యలు విన్నానని.. వారు ఏం కోరుకున్నారో స్వయంగా చూశానన్నారు. పరిపాలన అంటే ఒక నగర కేంద్రం ఉంటుందన్న భావన పోవాలని ప్రజలు కోరుకున్నారని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. కాగా.. 600 రోజులకు పైగా అమరావతిలోనే రాజధాని ఉండాలని.. రైతులు, రైతు కూలీలు ఉద్యమం చేస్తున్నారు. మరోవైపు.. ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి.


ప్రసంగంలోని ముఖ్యాంశాలు..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. ప్రజారంజకమైన పాలనను అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ రంగంపై రూ. 83 వేల కోట్లు వ్యయం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర గతిని మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు.


గ్రామ సచివాలయాల ద్వారా నూతన విప్లవానికి నాంది పలికామని ఆయన పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామన్న విషయాన్ని కూడా మరోసారి సీఎం గుర్తు చేశారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. నేటి కంటే రేపు బాగుండేలా ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చివరిగా.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని పరోక్షంగా సీఎం జగన్ ప్రస్తావించారు. కాగా ఈ పంద్రాగస్టు వేడుకల్లో ప్రగతి, పురోగతి ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన కూడా జరిగింది.

Updated Date - 2021-08-15T18:12:53+05:30 IST