‘దూరవిద్య’లో జాప్యమేల?

ABN , First Publish Date - 2020-08-07T07:22:06+05:30 IST

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్‌ బాట పడుతుండగా, పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌లో

‘దూరవిద్య’లో జాప్యమేల?

  • దిక్కూమొక్కూలేని అంబేడ్కర్‌ వర్సిటీ ప్రవేశాలు
  • ఏప్రిల్‌లో జరగాల్సింది.. అతీగతీ లేదు
  • ఆరేళ్లుగా ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే
  • అయినా నోటిఫికేషన్ల జారీలో తీవ్ర ఆలస్యం
  • వేలాదిమంది విద్యార్థుల ఎదురుచూపులు 
  • ఇగ్నో, ఓయూలో ఇప్పటికే ప్రకటనలు విడుదల


హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్‌ బాట పడుతుండగా, పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహించే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌లో చేపట్టాల్సిన యూజీ ప్రవేశాల ప్రక్రియను ఇంతవరకూ ప్రారంభించకపోగా.. పీజీ అడ్మిషన్ల కోసం  నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఎలాంటి ప్రకటన లేకుండానే అకస్మాత్తుగా రద్దు చేసింది. దీంతో అనేక మంది విద్యార్థులు ఇతర వర్సిటీల డిస్టెన్స్‌ కోర్సుల్లో చేరేందుకు తరలిపోతున్నారు. దూరవిద్య అంటేనే అంబేడ్కర్‌ వర్సిటీ అన్నంతగా దీనికి పేరుంది. తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ స్టడీ సెంటర్లు ఉన్న ఏకైక వర్సిటీ కూడా ఇదే. ఏటా ఏప్రిల్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి ఇంతరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఏటా అంబేడ్కర్‌ వర్సిటీ నిర్వహించే ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా దాదాపు 40వేల మంది యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో ఇంటర్‌ ఉత్తీర్ణతతో నేరుగా ఆన్‌లైన్‌ అడ్మిషన్లు తీసుకునేవారి సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉంటోంది. ఈసారి ఇంటర్‌లో మొత్తం 4.34 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేటుగా రాసినవారు, ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలని భావించేవారు దూరవిద్య ద్వారా చదువు కొనసాగించే ఆవకాశాలున్నాయి. అలాగే ఈసారి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలపై సందిగ్దం నెలకొనడంతో అనేకమంది దూరవిద్య విధానాన్ని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. 


పీజీ ప్రవేశాలు ఉన్నట్టా.. లేనట్టా..? 

ఏటా దాదాపు 10వేల మంది పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతుంటారు. ఈసారి ఇతర వర్సిటీల్లో ప్రవేశాలన్నీ నిలిచిపోవడంతో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రవేశాలు పూర్తి చేయాల్సిన వర్సిటీ.. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేన్‌ను సైతం రద్దుచేయడం గమనార్హం. జూలైలో అకస్మాత్తుగా వెబ్‌సైట్‌ నుంచి ప్రవేశాల విభాగాన్ని తొలగించారు.  అసలు ప్రవేశాలు ఉంటాయా.. లేవా అన్న విషయాన్ని కూడా వర్సిటీ స్పష్టం చేయలేకపోతోంది. 


ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో), ఉస్మానియాలోని ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి దూరవిద్యా కేంద్రంతో పాటు అనే రాష్ట్రాల్లోని వర్సిటీలు దూర విద్యలో వివిధ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. దాంతో అన్ని దూరవిద్య వర్సిటీలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ప్రస్తుతం ఇగ్నో నోటిఫికేషన్‌కు గడువు ఆగస్టు 16 వరకు ఉండగా.. ఉస్మానియా వర్సిటీ దూరవిద్య కేంద్రం సైతం నోటిఫికేషన్‌ను విడుదల చేసి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. అంబేడ్కర్‌ వర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థులు ఇతర వర్సీటీల డిస్టెన్స్‌ కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. 


ఏడాదిగా ఇంఛార్జీల పాలనే...

దాదాపు 1.30 లక్షల మంది విద్యార్థులు ఉన్న ఈ వర్సిటీ ఏడాదిగా ఇంఛార్జి వీసీల పాలనలో సాగుతోంది. గత ఏడాది  జూలైలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథిని ఇంఛార్జి వీసీగా నియమించగా.. ఆయన ఏప్రిల్‌లో రిటైర్‌ అయ్యారు. అనంతరం రెండు నెలల పాటు పదవి ఖాళీగా ఉండగా..  మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌ రాజ్‌కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో అత్యంత కీలకమైన అకడమిక్‌ డైరెక్టర్‌ సైతం గత నెలలో రిటైర్‌ అయ్యారు.

Updated Date - 2020-08-07T07:22:06+05:30 IST