వివేకా హత్య కేసు నిందితుడిని మీ నివాసంలో ఎందుకు కలిశారు?

ABN , First Publish Date - 2021-04-09T08:49:17+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాడేపల్లి నివాసంలో ఎందుకు కలిశారో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పాలని వైసీపీ...

వివేకా హత్య కేసు నిందితుడిని మీ నివాసంలో ఎందుకు కలిశారు?

  • చిన్ననాటి నేర స్నేహితుడిని కూడా..
  • జగన్‌కు రఘురామరాజు ప్రశ్నలు
  • ఆ నేరస్థులు ఆయన బాల్యమిత్రులు!
  • వారి బెదిరింపు కాల్స్‌ ఐబీకిచ్చాను
  • కేంద్ర హోంశాఖకూ సమర్పించాను
  • జగన్‌ వారిని రక్షించలేడు: ఎంపీ


అమరావతి/న్యూఢిల్లీ, ఏప్రిల్‌  8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాడేపల్లి నివాసంలో ఎందుకు కలిశారో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం ఉదయం ఒక వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. ‘జగన్మోహన్‌రెడ్డి బాబాయి వివేకాను రెండేళ్ల కింద మార్చి 15న నిర్దాక్షిణ్యంగా గొడ్డలితో చంపారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి ఇప్పుడు (గురువారం ఉదయం 10.46 గంటలు) నేను మాట్లాడే సమయానికి ముఖ్యమంత్రిగారి నివాసంలో ఆయనతో ఫ్యూచర్‌ ప్లాన్‌, మర్డర్స్‌ గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నారు. అలాగే నిన్న కూడా ఆయన తన చిన్ననాటి నేర స్నేహితుడిని కలిశారనీ వినపడుతోంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం బిజీగా ఉండి కోర్టుకు కూడా హాజరు కావడం లేదని.. సమయం అంత తక్కువగా ఉన్నప్పుడు.. బాబాయి హత్య కేసులో నిందితుడైన వ్యక్తితో.. చర్చలు జరపడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను బుధవారం ప్రధాని మోదీకి రాసిన లేఖకు బలం చేకూరుస్తూ వీళ్లు ఇటువంటి పనులన్నీ ప్లాన్‌ చేసుకుంటున్నారని చెప్పారు. ‘జగన్‌రెడ్డి చిన్ననాటి స్నేహితులారా.. ప్రస్తుత నేరస్థులారా.. మీ బెదిరింపు కాల్స్‌ వివరాలను కేంద్ర హోం శాఖకు, ఐబీకి సమర్పించాను. నేను హైదరాబాద్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా మీ బెదిరింపు కాల్స్‌ పోలీసు శాఖ రిజిస్టర్‌ చేస్తుంది. నాపై దాడికి పురిగొల్పుతున్న ముఖ్యమంత్రి మిమ్మల్ని రక్షించలేడు. ఆయన మాటలు వింటే మీరే దెబ్బతింటారు జాగ్రత్త’ అని హెచ్చరించారు.




Updated Date - 2021-04-09T08:49:17+05:30 IST