‘ఊపిరి’ ఎందుకు ఆగింది?

ABN , First Publish Date - 2021-05-19T09:37:16+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోవడంతో 11 మంది కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది.

‘ఊపిరి’ ఎందుకు ఆగింది?

  • రుయా ఘటనపై నివేదిక ఇవ్వండి
  • 11 మంది కొవిడ్‌ బాధితుల మృతిపైస్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌
  • 4 వారాల్లోపు అందజేయాలని 
  • వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం


తిరుపతి, మే 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోవడంతో 11 మంది కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. ఈ ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోపు నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన రాత్రి ఆక్సిజన్‌ ప్లాంట్‌లోని ట్యాంకులో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు తగ్గిపోవడంతో ప్రెషర్‌ కూడా తగ్గిపోయి సరఫరా ఆగిపోగా ఐసీయూ వార్డుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులు పెద్దసంఖ్యలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని మృతుల కుటుంబీలకుతో పాటు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఆరోపించాయి. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం ఆ ఘటనలో 11 మంది మృతి చెందారని ప్రకటించింది. ఆ మేరకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సైతం మంజూరు చేసింది. కాగా.. ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘనే అని, దీనిపై విచారణ జరపాలని జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. 


ముఖ్యంగా గుంటూరుకు చెందిన ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ లిబర్టీస్‌ సోషల్‌ జస్టిస్‌ ప్రతినిధి జేష్టాది సుధాకర్‌, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ చేసిన ఫిర్యాదులపై కమిషన్‌ స్పందించింది. ఫిర్యాదులను సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి పంపిన కమిషన్‌ నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ ఫిర్యాదులను విచారణకు స్వీకరించామని, అందులోని ఆరోపణలు కనుక వాస్తవమైతే అవి తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని కమిషన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ బాధితులకు తగిన వైద్యసేవలు అందించే విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంటున్నట్టు కమిషన్‌ స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌ 24వ తేదీన చేపడతామని ఉత్తర్వుల్లో ప్రకటించింది.

Updated Date - 2021-05-19T09:37:16+05:30 IST