‘చిన్న విషయానికి.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావెందుకు తల్లీ!’

ABN , First Publish Date - 2020-02-23T05:58:37+05:30 IST

ఏం కష్టం వచ్చిందో తెలీదు. పేగు బంధం మరచిపోయిన ఓ తల్లి నవమాసాలు మోసి కని పెంచిన ఇద్దరు

‘చిన్న విషయానికి.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావెందుకు తల్లీ!’

బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య

తల్లిదండ్రుల ఆవేదన


కోట(నెల్లూరు): ఏం కష్టం వచ్చిందో తెలీదు. పేగు బంధం మరచిపోయిన ఓ తల్లి నవమాసాలు మోసి కని పెంచిన ఇద్దరు చిన్నారులు చేజేతులా చంపేసింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అన్యోన్యమైన దాంపత్యం, రత్నాల్లాంటి బిడ్డలు ఉండగా ఏం కష్టమొచ్చిందని ఇంతపని చేశావు తల్లీ అంటూ ఊనుగుంటపాళెం ధనుంజయరెడ్డి గిరిజన కాలనీకి చెందిన ఆమె తల్లిదండ్రులు విలపించారు.


కోట మండలం ఊనుగుంటపాళెంలోని ధనుంజయ రెడ్డి గిరిజన కాలనీకి చెందిన శీనయ్య, పోలమ్మ దంపతులు తమ కూతురు రాణి (23)కి కొడవలూరు మండలం గుండాలమ్మపాళెంకు చెందిన ఏలూరు నాగార్జునతో 2014లో వివాహం చేశారు. నాగార్జున నెల్లూరులోని ఓ హోటల్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ, స్వగ్రామంలో భార్యతో కలసి నివసిస్తున్నాడు. ప్రస్తుతం వీరికి సందీప్‌ (5), సుధీర్‌ (2) సంతానం. కాపురాన్ని నెల్లూరుకు మార్చాలని ఈ మధ్య కాలంలో రాణి భర్తపై ఒత్తిడి చేయగా, రెండు మూడు నెలల్లో అలాగే చేద్దామని అతను సర్దిచెప్పాడు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ఆమె పిల్లలతో కలిసి పుట్టినింటికి వచ్చింది.


శుక్రవారం ఉదయం తండ్రి శీనయ్య పనిమీద కోటకు వెళ్ళగా, తల్లి పోలమ్మ గూడూరులోని ఆసుపత్రికి వెళ్ళింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రాణి, ఆడుకున్న బిడ్డలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శీనయ్య తలుపులకు లోపలినుంచి తాళం వేసిన విషయం గమనించాడు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా, ఉరికి వేలాడుతూ కూతురు కనిపించింది.


స్థానికుల సహకారంతో తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించి, ఉరితాడు నుంచి రాణి మృతదేహాన్ని కిందకు దించారు. ఇంట్లోని మంచంపై సందీప్‌, సుధీర్‌ చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ కుటుంబంతోపాటు, గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. తమ బిడ్డ, అల్లుడు అన్యోన్యంగా జీవించేవారని, చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తల్లిదండ్రులు విలపించారు. 


వలంటీర్ల సహకారంతో పోలీసులకు సమాచారం

ఈ విషయం బయటకు తెలిస్తే తమను ఇబ్బంది పెడతారన్న భయంతో రాణి తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను పూడ్చే ప్రయత్నం చేశారు. అయితే గ్రామ వలంటీర్లు సమాచారం అందించడంతో  వాకాడు సీఐ  నరసింహారావు, ఎస్సై భోజ్యానాయక్‌, చిట్టమూరు ఎస్సై రవికిషోర్‌, ఓజిలి ఎస్సై నరహరి, తహసీల్దార్‌ మల్లికార్జునరావు, వైసీపీ సీఈసీ సభ్యుడు కొడవలూరు ధనుంజయరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వాకాడు మండలం బాలిరెడ్డి పాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-02-23T05:58:37+05:30 IST