ఆ పాటికి నోటీసు ఎందుకిచ్చినట్టో..?

ABN , First Publish Date - 2021-03-05T06:16:46+05:30 IST

జాతర నిర్వహణలో మునిసిపల్‌ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ పాటికి నోటీసు ఎందుకిచ్చినట్టో..?

ఎగ్జిబిషన్‌ పాస్‌ల కోసమేనా?

మొదటి రోజే నోటీసు , మరుసటి రోజు బంద్‌... తర్వాత కొనసాగింపు

రూ.లక్షలు చేతులు మారాయని ఆరోపణలు

చివ్వెంల, మార్చి 4 : జాతర నిర్వహణలో మునిసిపల్‌ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఎగ్జిబిషన్‌ యాజమానులను వేధించిన తీరును అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. సుమారు రూ.25 లక్షల 25 వేలకు టెండర్‌ పాటను దక్కించుకున్న ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు జాతర మొదటి రోజే అధికారులు షాక్‌ ఇచ్చారు. వారికి కేటాయించిన స్థలం కంటే రెండెకరాల స్థలం ఎక్కువగా వాడుకున్నారని, నిబంధనలు అతిక్రమించారని, ఇందుకు గాను సూచన-2 ద్వారా మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి ఈ నెల 1వ తేదీన నోటీసు జారీ చేశారు. అదనంగా వాడుకుంటున్న స్థలానికి ఎకరాకు రూ.6 లక్షల 31,250 చొప్పున మొత్తం రూ.12,62,500 చెల్లించాలని, ఇందులో భూమి అద్దె రూ.60 వేలు పోను మిగతా రూ.12,02,500 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం ఎగ్జిబిషన్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి, ఎగ్జిబిషన్‌ నిర్వహించవద్దని కమిషనర్‌ హుకూం జారీ చేశారు. జరిమానా చెల్లిస్తేనే ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అనుమతి ఇస్తామని చెప్పారు. అయితే ఇదంతా బయటికు నిబంధనల మేరకు నడుచుంటున్నట్లు కనిపించేలా అధికారుల తీరు ఉన్నా, తెర వెనక ఏదో ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై ఎగ్జిబిషన్‌ యజమాని రఫిక్‌ వివరణ ఇస్తూ తాము మూడు వేల పాస్‌లు ఇవ్వడంతో పాటు కొంత మంచిచెడులు చూశామని, తిరిగి నాయకుల పేర్లు చెప్పి మరో మూడు వేల పాస్‌లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఆరోపించారు. తీవ్రంగా నష్టం వస్తుందని చెప్పడంతో నోటీసులు, జరిమానాలు విధిస్తూ తీవ్రంగా నష్టపరిచారని బహిరంగంగానే ఆరోపించారు. అయితే జరిమానా చెల్లించకపోయినా మరుసటి రోజు ఎగ్జిబిషన్‌ నిర్వహణ కొన సాగింది. అది ఎలా సాధ్యమైందన్న దానిపై పలు ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు మునిసిపాలిటీ అధికారులు సహకరించారని అంటున్నారు. నోటీసులు అందిన తర్వాత అధికారుల్లో కొందరికి రూ.లక్షల్లో ముట్టడజెప్పడంతో పాటు వేల ఉచిత పాస్‌లు తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆ పాస్‌లను శాఖల వారీగా ఓ అధికారి సూచన మేరకు కౌన్సిలర్లు, బడా నేతలు, అధికారుల బంధువులకు పంచారన్న ప్రచారం సాగుతోంది. ప్రారంభానికి ముందు కొంత, నోటీసులు అందజేసిన తర్వాత రూ.5 లక్షల వరకు నగదు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. 


అధికారుల తీరుపై కోర్టుకు వెళతా

మునిసిపల్‌ కమిషనర్‌ తీరుతో నష్టపోయాం. రూ.16 లక్షలకు దుకాణ స్థలాలను టెండర్‌ను దక్కించుకున్నాం. అయితే తమకు కేటాయించిన స్థలాల్లోని  రెండు ఎకరాలను ఎగ్జిబిషన్‌ వారికి కేటాయించారు. అంతేకాక నిబంధనలకు విరుద్దంగా ఎగ్జిబిషన్‌ స్థలాల్లో దుకాణాలు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఇష్టానుసారంగా ప్రైవేట్‌ వ్యక్తులతో దుకాణాలు ఏర్పాటుచేయించారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్ళగా తమతో వాగ్వాదానికి దిగారు. కమిషనర్‌ తీరుతో అపార నష్టం జరిగింది. ఇదే విషయంపై కోర్టులో న్యాయపరంగా పోరాడుతా. 

ఫ నల్లబోతుల నాగరాజు, దుకాణ  స్థలాల టెండర్‌దారుడు  

Updated Date - 2021-03-05T06:16:46+05:30 IST