Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర గీతం విషయంలో తాత్సారమేల?

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాల రూపకల్పనలో నిమగ్నమైంది. అలా రాష్ట్ర అధికారిక రాజముద్ర (ఎంబ్లమ్/లోగో), పక్షి, జంతువు, చెట్టు, పుష్పాలను నిర్ణయించి, ప్రకటించింది. తెలంగాణ సమాజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాటినే రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించి ప్రభుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుంది. రాష్ట్ర చిహ్నాలల్లో ఏది కూడా ఉద్యమ సమయంలో చోదక శక్తి కాలేదు. వాటిని రాష్ట్రం ఏర్పడ్డాక అధికారికంగా ప్రకటించుకున్నాం. ఏ రాష్ట్రానికైనా రాష్ట్ర చిహ్నాలు, రాష్ట్ర గీతం విశిష్టమైనవి. తెరాస ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేసింది కానీ రాష్ట్ర గీతం ఊసెత్తలేదు. సాధారణంగా, రాష్ట్ర విశేషాలు పాట రూపంలో అందుబాటులో లేకపోతేనో లేదా అసలు ఎవరూ రచించకపోతేనో రాష్ట్ర గీతం ప్రకటించలేరు. కానీ తెలంగాణ విషయంలో అలా కాదు. ఒక పాట ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది.


తెలంగాణ ప్రజానీకం మొత్తం ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్ మీద ‘ఏ‌పి’ బదులుగా ‘టి‌జి’ అని ఎవరికి వారే సొంతంగా ఎలా రాసుకున్నారో, అదే విధంగా అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆలపించారు. ‘సకల జనుల సమ్మె’ సమయంలో ఈ పాట ఎంతోమందిని ప్రేరేపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, పల్లె పట్నం అన్న తేడాలేకుండా తెలంగాణ వాదులందరిని ఈ పాట ఏకం చేసింది. అయితే ఈ పాట రాష్ట్ర గీతం కాలేదు. రెండు నెలల కిందట సి‌ఎం కే‌సీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా, ‘జయ జయహే’ రాష్ట్ర గీతం కాదనీ, కొత్త రాష్ట్ర గీతం రాసుకున్నాక తప్పకుండా పాడే ప్రయత్నం చేద్దామని ప్రకటించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రగీతంగా అక్కెరకచ్చిన పాట, నేడు స్వరాష్ట్రంలో ‘రాష్ట్ర గీతం’ అర్హతను పొందలేకపోవడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కటంలేదు. తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేయకుండా రాష్ట్ర గీతంగా ‘జయ జయహే’ గీతాన్ని ప్రకటించాలి. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా గీతం లేనప్పుడు/ రాసుకోనప్పుడు, ఉద్యమ    కాలంలో ‘మా తెలుగు తల్లి’ గీతాన్ని ఎందుకు మార్చారన్నది సగటు తెలంగాణ పౌరుడి ప్రశ్న.


డాక్టర్ శ్రీరాములు గోసికొండ

Advertisement
Advertisement