పార్ట్‌టైమ్‌ లెక్చరర్లపై ఎందుకీ వివక్ష?

ABN , First Publish Date - 2021-01-07T09:53:32+05:30 IST

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేసే పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అంటే అధికారుల్లో ఒక చులకన భావం ఉంది....

పార్ట్‌టైమ్‌ లెక్చరర్లపై ఎందుకీ వివక్ష?

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేసే పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అంటే అధికారుల్లో ఒక చులకన భావం ఉంది. వీరందరూ 1994 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 53 మంది మాత్రమే ఉన్నారు. అందరి వయసు 45 సంవత్సరాల పైనే ఉంటుంది. ఈ ఉద్యోగంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం కలిగినవారు. అయితే పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అనగానే అదేదో అంటరానిదని, అవసరం లేనిదని, పనికి రాని ఉద్యోగమని అధికారుల్లో ఒక అపోహ ఉంది. ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ దగ్గర నుంచి ఉన్నత విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విద్యామంత్రి, ఆర్థిక శాఖాధిపతుల వరకు ప్రతి ఒక్కరికీ వీరిపట్ల చులకన భావమే ఉంది. ఒక గంటో, రెండు గంటలో పనిచేసి వెళ్ళిపోతారు ఈ లెక్చరర్లు అన్న భావం ఆయా అధికారుల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో జరిగేది వేరుగా ఉంటుంది. వీరు పనిచేసే విధానం గాని, పని గంటలు గాని బోధించే సబ్జెక్టులు గాని రెగ్యులర్‌ లెక్చరర్ల లాగానే ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యాబోధన చేస్తారు. పేరుకే పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు గాని చేసేది మాత్రం ఫుల్‌టైమ్‌ ఉద్యోగమే.


ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్లు అయిదు కేటగిరీలుగా ఉన్నారు. 1. రెగ్యులర్‌ లెక్చరర్లు 2. పార్ట్‌టైమ్‌ ఎంటిఎస్‌ లెక్చరర్లు (1993కి ముందు) 3. పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు (1993-1999) 4. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు (2000-2016) 5. గెస్ట్‌ లెక్చరర్లు (2000 తరువాత). వీరిలో రెగ్యులర్‌ లెక్చరర్లు కాకుండా మిగిలిన వారిని ఆయా సంవత్సరాలలో ఆయా అవసరాలకు తగినట్లు తాత్కాలిక పద్ధతిన తీసుకుని పని చేయించుకుంటున్నారు. 1989లో రాష్ట్రవ్యాప్తంగా వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టి, వాటిని బోధించడానికి రెగ్యులర్‌గా కాకుండా పార్ట్‌టైమ్‌ పద్ధతిలో లెక్చరర్లను నియమించారు. అప్పుడు రెగ్యులర్‌, పార్ట్‌టైమ్‌ అనే రెండు విధానాలు మాత్రమే ఉన్నాయి. పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యాబోధనకు వినియోగించేవారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టి వాటిని బోధించడానికి పార్ట్‌టైమ్‌ పద్ధతిలో 1999 వరకు నియమిస్తూ వచ్చారు. వీరిలో అనేక మందిని ప్రభుత్వం రెగ్యులర్‌ చేసింది. ఆ తరువాత వీరు ప్రిన్సిపాల్‌గాను, ఇంటర్‌ బోర్డులో విద్యాధికారులుగాను ఉద్యోగం పొంది సేవలు అందించారు. ఉద్యోగాలు రెగ్యులర్‌ కాని, 1993 వరకు నియమితులైన పార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు వేతనంగా అప్పుడున్న రెగ్యులర్‌ లెక్చరర్లకు ఇచ్చినట్టే మూలవేతనం, డి.ఎ. చెల్లించారు.


1994 నుంచి 1999 వరకు నియమితులైన పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు (53 మంది) మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. వీరికి ప్రస్తుతం అమల్లో ఉన్న పిఆర్‌సి ప్రకారం పెంచకపోవడం వల్ల నెలకు రూ.21,600 మాత్రమే వేతనంగా పొందుతున్నారు. పిఆర్‌సి ప్రకారం రెగ్యులర్‌ లెక్చరర్ల మూలవేతనం రూ. 37,100. ఈ మొత్తాన్ని తమకూ చెల్లించాలని పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు సంబంధిత అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా ప్రయోజనం కలగలేదు.


తెలంగాణలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, మున్సిపల్‌ వర్కర్లు, పంచాయతీ వర్కర్లు, విద్యావలంటీర్లు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, గెస్ట్‌ లెక్చరర్ల వంటి అనేక వర్గాల వారికి వేతనాలు పెంచారు. కానీ పార్ట్‌టైమ్‌ లెక్చరర్లపై ఉన్న చులకన భావంతో వారి వేతనాలను మాత్రం పెంచలేదు. వీరందరూ 25 సంవత్సరాలుగా పనిచేస్తూ వయసు మీరి, చాలీచాలని జీతంతో కుటుంబ అవసరాలు తీర్చలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇకపోతే 2000–2001 సంవత్సరం నుంచి పార్ట్‌టైమ్‌ పద్ధతిన కాకుండా కాంట్రాక్ట్‌ పద్ధతిలో లెక్చరర్లను నియమిస్తూ వచ్చారు. వీరికి తొలుత నెలకు రూ. 4,500 మొదలుకొని పెంచుతూ రూ. 8,500 వరకు చెల్లించారు. మంత్రి హరీష్‌రావు చొరవతో వారి వేతనం నెలకు రూ. 8,500 నుంచి 18,030కు చేరుకుంది. తదుపరి ఆరు నెలల్లోపే రూ. 27,000 గాను, అనంతరం ఒక నెలలోనే రూ. 37,100గాను స్థిరపడింది. 25 సంవత్సరాల సర్వీసు కలిగిన పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ కన్నా తక్కువ సర్వీసు ఉన్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ఎక్కువ వేతనం చెల్లిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచించాలి. వారికి మరో అన్యాయం కూడా జరుగుతోంది. అదేమిటంటే, తాత్కాలిక పద్ధతిన నియమితులైన పార్ట్‌టైమ్‌, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఎవరికైనా కళాశాల పనిచేసే నెలలు అంటే జూన్‌ నుంచి మార్చి వరకు 10 నెలలకు మాత్రమే వేతనం చెల్లించేవారు. ఏప్రిల్‌, మే నెలలకు వేసవి సెలవులని జీతం చెల్లించేవారు కాదు. కొన్నాళ్ళ తరువాత రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ఆ రెండు నెలలు కూడా వేతనం చెల్లించాలని ఉత్తర్వు జారీచేసి, అమలుచేసింది. అనేక ప్రయత్నాల తరువాత పార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు కూడా ఏప్రిల్‌, మే నెలలకు జీతాలు చెల్లించాలని 2019లో జీవో ఇచ్చారు కానీ ఇప్పటివరకు అది అమలు చేయలేదు. అడిగితే ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. మా తరువాత పార్ట్‌టైమ్‌ ఎం.టిఎస్‌ లెక్చరర్లకు కూడా ఆ సంవత్సరమే జీవో ఇచ్చి అమలు చేశారు. ఈ విధంగా మాకంటే ముందు, తరువాత నియమితులైన వారికి అన్ని విషయాల్లో లాభం చేకూరుస్తూ మాకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికయినా పార్ట్‌టైమ్‌ లెక్చరర్ల సమస్యను సానుభూతితో పరిశీలించాలని, పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

కె. సర్వేశ్వరరావు

ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ వృత్తివిద్యా పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ సంఘం

Updated Date - 2021-01-07T09:53:32+05:30 IST