ప్రైవేటుకు ఎందుకెళ్తున్నారు?

ABN , First Publish Date - 2021-06-19T09:22:16+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా.. ప్రజలు ప్రైవేటు దవాఖానాలకు ఎందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తేల్చాలని సర్కారు నిర్ణయించింది.

ప్రైవేటుకు ఎందుకెళ్తున్నారు?

  • ప్రజలపై ఆర్థికభారం ఎంత పడుతోంది?.. 
  • ప్రభుత్వ ఆస్పత్రుల వైఫల్యం ఎందుకు!
  • వైద్యుల్లో జవాబుదారీతనం పెంపు ఎలా
  • నివేదిక ఇవ్వాలని ఉప సంఘం ఆదేశం


హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా.. ప్రజలు ప్రైవేటు దవాఖానాలకు ఎందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తేల్చాలని సర్కారు నిర్ణయించింది. ప్రైవేటులో వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? మొత్తంగా వైద్యం పేరిట జనంపై పడుతున్న ఆర్థిక భారమెంత? దానిని ఎలా తగ్గించాలి? ప్రభుత్వ ఆస్పత్రులు ఎందుకు విఫలమవుతున్నాయి? అనే అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రజల్లో ఎక్కువశాతం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, తద్వారా ఆర్థికంగా కుదేలవుతున్నారని అభిప్రాయపడింది. ఇలా ఒక్కో కుటుంబంపై వైద్యసేవలకు ఎంత భారం పడుతుందన్న అంశంపై అధ్యయనం చేయాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ప్రైవేటుకు వెళ్లకుండా చేపట్టాల్సిన చర్యలేంటన్న అంశంపైనా ఉపసంఘం చర్చించింది.


ప్రభుత్వ ఆస్పత్రులు బాగా పని చేస్తే ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా వైద్య విధాన పరిషత్‌ (వీవీపీ) ఆస్పత్రులున్నా, వాటిలో స్పెషలిస్టు వైద్యులున్నా.. అక్కడ శస్త్రచికిత్సలు జరగకపోవడంపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. అక్కడ జరగాల్సిన సర్జరీలను కూడా హైదరాబాద్‌కు పంపడంపై ఉపసంఘం విస్మయం వ్యక్తం చేసింది. జిల్లా ఆస్పత్రుల్లోనూ అదే తంతు నడుస్తోందని, చాలామంది వైద్యుల్లో జవాబుదారీతనం లోపించిందని అభిప్రాయపడింది. సమయపాలన పాటించకపోవడంపై, బయోమెట్రిక్‌ అమలు తీరుపై కూడా వివరాలివ్వాలని సూచించింది. 


పని చేసే వారికి ప్రోత్సాహకాలు

ఇదే సమయంలో అందరినీ ఒకే గాటన కట్టకుండా బాగా పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రోత్సహించాలని, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉంది. అవి ఎలా ఉండాలన్న దానిపై నివేదికివ్వాలని వైద్యశాఖను కోరింది. ఇక రాష్ట్రంలో సంభవిస్తున్న ప్రతి మరణాన్ని ఆడిట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏయే కారణాల వల్ల ప్రజలు చనిపోతున్నారు? ఏయే జబ్బులు మరణాలకు కారణమవుతున్నాయి? ఏయే ప్రాంతాల్లో ఎటువంటి తరహా మరణాలు చోటుచేసుకుంటున్నాయి? వ్యాధులే కాకుండా ఇతర కారక మరణాలు సంభవిస్తున్నాయా? లాంటి అంశాలపై డెత్‌ ఆడిట్‌ నిర్వహించి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా.. అవసరమయ్యే మందులు, వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రుల ఏర్పాటు, వైద్యుల నియామకంపై సర్కారుకు స్పష్టతకు రానుంది. 


ఈ అంశాలపై కూడా నర్సింగ్‌  కౌన్సిల్‌ ఏర్పాటు

కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాయంత్రం ఓపీ నిర్వహణ. మన రాష్ట్రంలో దీని సాధ్యాసాధ్యాలపై రిపోర్టు.

ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం. వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల పనితీరు, నెలకు అక్కడ జరిగే సర్జరీల సంఖ్య. 

వైద్య ఆరోగ్య పథకాల పునఃసమీక్ష. ఆరోగ్యశ్రీ, ఈఎ్‌సఐ లాంటివి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య యంత్ర పరికరాల నిర్వహణ. వైద్య సిబ్బంది రేషనలైజేషన్‌. ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణ

Updated Date - 2021-06-19T09:22:16+05:30 IST