భారత్ బయోటెక్ `కోవాగ్జిన్` వ్యాక్సిన్‌పై అమెరికా సంచలన నిర్ణయం.. ఎందుకు నో చెప్తోందంటే..

ABN , First Publish Date - 2021-06-12T01:16:45+05:30 IST

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది

భారత్ బయోటెక్ `కోవాగ్జిన్` వ్యాక్సిన్‌పై అమెరికా సంచలన నిర్ణయం.. ఎందుకు నో చెప్తోందంటే..

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. ఐసీఎమ్‌ఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన `కోవాగ్జిన్` టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా `ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్` (ఎఫ్‌డీఏ) నిరాకరించింది. యూఎస్ ఫార్మా కంపెనీ `ఆక్యుజెన్` భాగస్వామ్యంతో `కోవాగ్జిన్`ను అమెరికాలో సరఫరా చేసేందుకు భార‌త్ బ‌యోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోర‌గా ఎఫ్‌డీఏ నిరాక‌రించింది.


అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ `కోవాగ్జిన్‌`కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెనీ `ఆక్యుజెన్`.. రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అయితే  మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ ఎఫ్‌డీఏ దీన్ని తిరస్కరించింది. 


తిరస్కరణకు కారణాలు అవేనా..


మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను వెల్లడించలేదనే కారణంతోనే ఎఫ్‌డీఏ `కోవాగ్జిన్`ను తిరస్కరించింది. భారత్‌లో జరిగిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా వచ్చే నెలలో వెల్లడి కానుంది. అయినప్పటికీ అత్యవసర అనుమతి కింద కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు అనుమతి ఇచ్చేసింది. ఇతర దేశాలు మాత్రం కోవాగ్జిన్‌ను ఇంకా గుర్తించడం లేదు. పూర్తి స్థాయి సమాచారం లేదనే కారణంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇవ్వలేదు. తాజాగా అమెరికా కూడా అదే బాటలో నడిచింది. అమెరికాలో ప్రస్తుతానికి కరోనా టీకాలకు కొరత లేదు. అందువల్ల పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాని వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి ఇవ్వాలనుకోవడం లేదు. అమెరికా మాత్రమే కాదు.. పలు ఇతర దేశాలు కూడా `కోవాగ్జిన్` టీకా రెండు డోసులు తీసుకున్న వారిని కూడా `అన్ వ్యాక్సినేటెడ్`గానే పరిగణిస్తున్నాయి. 


భారత్ బయోటెక్ ఏమంటోంది.. 

ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా పూర్తి స్థాయి ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంటామని కంపెనీ తెలిపింది. కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించినట్టు భారత్ బయోటెక్ అమెరికా భాగస్వామి ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. అలాగే కోవాగ్జిన్ మార్కెటింగ్ అప్లికేషన్‌ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాలని సంస్థ అనుకుంటోంది. అత్యవసర అనుమతుల కోసం అవసరమైన 90శాతం పత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించామని, త్వరలోనే మిగిలిన పత్రాలు కూడా ఇస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. 



Updated Date - 2021-06-12T01:16:45+05:30 IST