కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటే..?

ABN , First Publish Date - 2021-06-12T01:20:52+05:30 IST

భారత్ తయారీ కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి (ఈయూఏ)కి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటే..?

న్యూఢిల్లీ: భారత్ తయారీ కరోనా టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి (ఈయూఏ)కి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించింది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఎందుకు అనుమతి ఇవ్వలేదన్న దానిపై పలు కారణాలున్నాయి. కొవాగ్జిన్ టీకా తయారీలో అచేతన వైరస్ మొత్తాన్ని ఉపయోగిస్తారు. వైరస్‌ను తొలుత ల్యాబ్‌లోనే పెంచి ఆపై అచేతనంగా మార్చిన అనంతరం సార్స్ కోవ్ 2 వైరస్ కణాలను ఉపయోగించి టీకాను తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్‌కు మార్చిలోనే భారత ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఆక్యుజెన్ అమెరికాలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ప్రయత్నిస్తోంది.


కొవాగ్జిన్ టీకాకు ఈయూఏ అనుమతులు ఎందుకు లభించడం లేదన్న దానికి ప్రధాన కారణం.. టీకాపై సమగ్ర సమాచారం లేకపోవడం. అందువల్లే ఈ టీకాపై ఎఫ్‌డీఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. బయోలాజిక్స్ లైసెన్స్ (బీఎల్ఏ) అప్లికేషన్ ద్వారా కొవాగ్జిన్ కోసం పూర్తి అథరైజేషన్ పొందాలని యూఎస్ఎఫ్‌డీఏ సిఫారసు చేసినట్టు ఆక్యుజెన్ పేర్కొంది. కొవాగ్జిన్ టీకాపై మరింత అదనపు సమాచారం, డాటాను అది కోరుతోంది. కాబట్టి బీఎల్ఏ సమర్పణకు ఎలాంటి సమాచారం కావాలన్నదానిపై ఎఫ్‌డీఏతో ఆక్యుజెన్ చర్చలు జరుపుతోంది. క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరింత అదనపు డేటా అవసరమని అమెరికన్ రెగ్యులేటరీ భావిస్తోంది. 


అమెరికాలో కొవాగ్జిన్ ఉత్పత్తికి లైసెన్స్ కోసం ఆక్యుజెన్ ఇప్పుడు మరింత కష్టపడాల్సి రావొచ్చు. అత్యవసర వినియోగ అనుమతితో పోలిస్తే ఇప్పుడు బీఎల్ఏ కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అంటే దీనర్థం వ్యాక్సిన్ తయారీలో తప్పుందని కాదు. ఇది పూర్తిగా సురక్షితమైనదే. మానవుల్లో రోగ నిరోధక ప్రతిస్పందనను ఇది ప్రేరేపిస్తుందని, ఆమోదయోగ్యమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని విశ్వసించడానికి మానవులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ నుంచి మరింత సమాచారాన్ని యూఎస్ ఎఫ్‌డీఏ కోరుతోంది.  


మరోవైపు, కొవాగ్జిన్ టీకాపై భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలు జులైలో వచ్చే అవకాశం ఉంది. ఫలితాలను తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు సమర్పిస్తారు. అనంతరం ప్రచురణ కోసం మూడు నెలల కాల పరిమితితో పీర్ రివ్యూ (విశ్లేషణ) ఉంటుందని భారత్ బయోటెక్ వర్గాలు తెలిపాయి.



Updated Date - 2021-06-12T01:20:52+05:30 IST