స్వాతంత్ర్యం అర్ధరాత్రే ఎందుకు వచ్చింది?

ABN , First Publish Date - 2021-09-04T06:02:16+05:30 IST

అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన రచయితలు ల్యారీ కొల్లిన్స్, డామినిక్ లాపియెర్‌లకు సహాయపడే బాధ్యతను నాకు మా ప్రొఫెసర్ అప్పగించారు. తమ సుప్రసిద్ధ పుస్తకం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ రచనాక్రమంలో వారు లార్డ్ మౌంట్ బాటెన్ పత్రాలను....

స్వాతంత్ర్యం అర్ధరాత్రే ఎందుకు వచ్చింది?

అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన రచయితలు ల్యారీ కొల్లిన్స్, డామినిక్ లాపియెర్‌లకు సహాయపడే బాధ్యతను నాకు మా ప్రొఫెసర్ అప్పగించారు. తమ సుప్రసిద్ధ పుస్తకం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ రచనాక్రమంలో వారు లార్డ్ మౌంట్ బాటెన్ పత్రాలను సేకరించారు. అలా నాకు స్వాతంత్ర్యోద్యమ తుదినాళ్లకు సంబంధించిన పలు చారిత్రక పత్రాలను పరిశీలించే అవకాశం లభించింది.


హిందూ పంచాంగం ప్రకారం తిథులు సూర్యోదయంతో ప్రారంభమవుతాయి. పాశ్చాత్య పంచాంగం ప్రకారం తేదీలు అర్ధరాత్రి ప్రారంభమవుతాయి. భారతీయ, పాశ్చాత్య కాలమాన సంప్రదాయాలలోని ఈ వ్యత్యాసమే, మన స్వాతంత్ర్య శుభవేళకు సంబంధించిన సందిగ్ధావస్థను తొలగించడంలో జ్యోతిశ్శాస్త్రపరమైన పరిష్కారానికి దోహదం చేసింది.


మన స్వాతంత్ర్యానికి 75 వసంతాలు. స్వాతంత్ర్య అమృతోత్సవాల పేరిట ఆ మహా స్ఫూర్తిదాయక చరిత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నాం. పాతికేళ్ళ క్రితం -1997లో- స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నిర్వహించుకున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తుత వేడుకలు గుర్తుకుతెస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ స్వర్ణోత్సవాలలో భాగంగా ఎదురయిన ఇబ్బందులు, అసౌకర్యాలు మరీ బాగా జ్ఞాపకం వస్తున్నాయి. ప్రస్తుత అమృతోత్సవాలలో అటువంటి అవస్థలేమీ లేవు. అయితే ఒక ప్రశ్న నీడలా వెంటాడుతోంది: వలస పాలన నుంచి స్వేచ్ఛను పొందుతున్న శుభసందర్భానికి అటువంటి అస్వాభావికమైన ముహూర్తాన్ని ఎందుకు ఎంచుకున్నాం? అది స్వచ్ఛంద నిర్ణయమా లేక నిష్క్రమిస్తున్న పరాయిపాలకులు మనపై బలవంతంగా రుద్దినదా? ఎప్పుడైనా ఈ ప్రశ్నల గురించి ఆలోచించారా? మనకు స్వాతంత్ర్యం అర్ధరాత్రి వేళ రావడం వెనుక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని వివరిస్తాను. 


ముందుగా నేను గతంలోకి వెళ్ళవలసి ఉంది. 1980వ దశకంలో నేను జేఎన్‌యూలో పరిశోధక విద్యార్థిగా ఉండేవాడిని. ఎం.ఫిల్ కోర్సు పూర్తి చేశాను. నా పరిశోధన ఉత్కృష్టత ఆధారంగా నేరుగా పిహెచ్‌డిలో చేరేందుకు అర్హుడినయ్యాను  మన చివరి వైస్రాయ్, మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ వ్యక్తిగతపత్రాలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చేందుకు గాను అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన రచయితలు ల్యారీ కొల్లిన్స్, డామినిక్ లాపియెర్‌లకు సహాయపడే బాధ్యతను నాకు మా ప్రొఫెసర్ అప్పగించారు. తమ సుప్రసిద్ధ పుస్తకం ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ రచనాక్రమంలో వారు ఆ పత్రాలను సేకరించారు. అలా నాకు స్వాతంత్ర్యోద్యమ తుదినాళ్లకు సంబంధించిన పలు చారిత్రక పత్రాలను పరిశీలించే అవకాశం లభించింది. ఆ పత్రాల ఆధారంగానే ఆ తరువాత ‘మౌంట్‌బాటెన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’, ‘మౌంట్ బాటెన్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా’ అనే పుస్తకాలు వెలువడ్డాయి. 


అప్పట్లో మనదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తక రచయితలు లార్డ్ మౌంట్ బాటెన్‌తో జరిపిన ముఖాముఖి సంభాషణ పూర్తిపాఠం కూడా ఆ పత్రాలలో ఉంది. ‘మౌంట్ బాటెన్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’ మొదటి భాగంలో ఆ ఇంటర్వ్యూను పూర్తిగా చేర్చారు. ఆ ఇంటర్వ్యూలోని ఒక సుదీర్ఘభాగాన్ని ఉటంకిస్తాను: 


ప్రశ్న: ‘ఆగస్టు 15 ఉత్సవానికి పూర్వోదాహరణ ఏదీ లేదు. ఎవరు దీన్ని నిర్ణయించారు?

జవాబు: నేను ఈ విషయమై నెహ్రూతో చర్చించాను. మొదటగా చెప్పవలసిన ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆగస్టు 15 జపాన్ లొంగిపోయిన రోజు. రెండేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటనను పురస్కరించుకుని భారత స్వాతంత్ర్యానికి ఆగస్టు 15ను నిర్ణయించాను. ఇలా చేయడంలో నేను జ్యోతిష్కులు ఎవరినీ సంప్రదించలేదు. భారతీయులకు జ్యోతిష్యంలో విశ్వాసమున్న విషయం మీకు తెలుసు. మొదట నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. అమంగళకరమైన రోజున ఎవరూ ఏదీ చేయరు. నెహ్రూకు కూడా జ్యోతిష్యంలో నమ్మకం లేదు. అయితే చాలా మందికి జ్యోతిష్యంలో విశ్వాసముందని, స్వాతంత్ర్యోదయానికి అశుభదినాన్ని ఎంపిక చేశారని ఆయన అన్నారు. జ్యోతిష్కులను సంప్రదించడం మరచిపోయానని నేను సమాధానమిచ్చాను. నెహ్రూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అర్థరాత్రి 12 గంటల వేళ అధికార బదిలీ జరగాలని మీరు నిర్ణయిస్తే అది శుభ ముహూర్తమవుతుందని నెహ్రూ అన్నారు. మంచి ఆలోచన. ప్రపంచమంతా నిద్రిస్తుండగా భారతదేశం నవయుగంలోకి మేల్కోంటోంది... స్వాతంత్య్రానికి నేను ఒక తప్పుడుదినాన్ని ఎంపిక చేశాను. జ్యోతిష్కులేమో అది మంగళప్రదమైన రోజు కాదని భావించారు. చివరకు అర్ధరాత్రి ముహూర్తాన్ని నిర్ణయించారు’.


వైస్రాయి అహంకారపూరిత నిర్ణయానికి, జ్యోతిశ్శాస్త్ర సంబంధిత సర్దుబాటు (దీన్ని తరచు ఉపాయ్ అని అంటారు) మధ్య రాజీ ఫలితంగా మనకు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. భారత స్వాతంత్ర్య తేదీని చివరి వైస్రాయి యాదృచ్ఛికంగా నిర్ణయించారన్నది స్పష్టం. అయితే మన నాయకులు ఆ వలసపాలకుని నిర్ణయాన్ని ఎలా అంగీకరించారన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వైస్రాయి నిర్ణయాన్ని నెహ్రూ తన సహచర కాంగ్రెస్ నాయకుల వద్ద ప్రస్తావించినప్పుడు వారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అమంగళకరమైన రోజున ఎటువంటి పరిస్థితులలోనూ అధికార బదిలీ, స్వాతంత్ర్య వేడుకలను నివారించాలని సర్దార్ పటేల్, జేబీ కృపలానీ గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్టసమస్యను అంతిమంగా ఒక చతుర జ్యోతిష్కుడు చాలా తెలివిగా పరిష్కరించాడు.

 

హిందూ పంచాంగం ప్రకారం తిథులు (సౌరమాన/చాంద్రమాన కాలచక్రం ప్రకారం రోజులు) సూర్యోదయంతో ప్రారంభమవుతాయి. పాశ్చాత్య గ్రెగోరియన్ పంచాంగం ప్రకారం తేదీలు అర్ధరాత్రి ప్రారంభమవుతాయి. భారతీయ, పాశ్చాత్య కాలమాన సంప్రదాయాలలోని ఈ వ్యత్యాసమే, మన స్వాతంత్ర్య శుభవేళకు సంబంధించిన సందిగ్ధావస్థను తొలగించడంలో జ్యోతిశ్శాస్త్రపరమైన పరిష్కారానికి దోహదం చేసింది. జ్యోతిష్కుల ప్రకారం 15 ఆగస్టు 1947 కృష్ణపక్షంలోని 14వ రోజు అంటే చతుర్దశినాడు వస్తుంది. ఆ మరుసటి రోజు అమావాస్య కనుక అది ఎటువంటి శుభకార్యక్రమానికి అనువైన దినం కాదు. మరి అర్ధరాత్రి ముహూర్తాన్ని ఎలా తప్పించుకోవాలి? జ్యోతిష్కుల రాజీసూత్రాన్ని అనుసరించి హిందూ పంచాంగం ప్రకారం 15 ఆగస్టు సూర్యోదయ వేళ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించకపోవడం ద్వారా అమంగళకర చతుర్దశి/ అమావాస్యను తప్పించుకోవచ్చు. పాశ్చాత్య పంచాంగం ప్రకారం 15 ఆగస్టు అర్ధరాత్రి తరువాత ప్రారంభమవుతుంది. ఉభయతారకంగా భారత స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి ముహూర్తాన్ని నిర్ణయించారు. 


ఇదొక ఉభయార్థసాధకమైన ఉపాయం. వాస్తవానికి అది ఒక క్లిష్ట రాజీ సూత్రం. స్వచ్ఛందంగా గాక బలవంతంగానే దీన్ని అంగీకరించవలసివచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే సామ్రాజ్యవాద అహంకారి అయిన వైస్రాయి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా భారత స్వాతంత్ర్యానికి తనకుతానుగా ఒక తేదీని నిర్ణయించాడు. అయితే మన నాయకులు ఆ వలసపాలకుని నిర్హేతుక నిర్ణయానికి సమ్మతించడం చాలా నిరుత్సాహం కలిగిస్తోంది. ఆ అర్థరాత్రి వేళ రాజ్యాంగసభలో జవహర్‌లాల్ నెహ్రూ వెలువరించిన ‘ట్రిస్ట్ విత్ డెస్టీనీ’ ఉపన్యాసం చరిత్రాత్మకమైనది. ౧5 ఆగస్టు 1947న జరిగిన అధికార బదిలీ మన స్మృతుల్లో అదొక విచిత్ర రాజీ గాథగా మిగిలిపోయింది. స్వాతంత్ర్యపు తొలి సంవత్సరాలలో దేశప్రజల సందిగ్ధావస్థను అది నిర్వచించింది. ఇప్పటికీ మనం అనేకవిధాలుగా ఆ సందిగ్ధావస్థలోనే ఉన్నాం.


-బి.పి.ఆచార్య 

విశ్రాంత ఐఏఎస్ అధికారి

Updated Date - 2021-09-04T06:02:16+05:30 IST