చైనా పేరెత్తాలన్నా భయమేనా?: రక్షణమంత్రిపై రాహుల్ ఫైర్

ABN , First Publish Date - 2020-06-18T00:36:02+05:30 IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు లద్దాక్‌లోని..

చైనా పేరెత్తాలన్నా భయమేనా?: రక్షణమంత్రిపై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో 20 మంది సైనికుల వీరమరణంపై ట్విటర్లో స్పందించిన రాజ్‌నాథ్.. చైనా పేరు ప్రస్తావించకుండా భారత సైన్యాన్ని అవమానించారంటూ దుయ్యబట్టారు. సైనికుల మరణంపై సంతాపం తెలిపేందుకు రెండు రోజుల సమయం ఎందుకు పట్టిందంటూ రాహుల్ రక్షణ మంత్రిని నిలదీశారు. ఓ వైపు సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే.. మరోవైపు రాజ్‌నాథ్ ర్యాలీల్లో ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సైనికుల మరణం తీవ్రంగా బాధించిందంటూ ఇవాళ రాజ్‌నాథ్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే రాహుల్ ట్విటర్లో స్పందిస్తూ..


 ‘‘అది మీకు నిజంగా బాధకలిగిస్తే...: మీ ట్వీట్‌లో చైనా పేరు చెప్పకుండా భారత ఆర్మీని ఎందుకు అవమానించారు? సంతాపం తెలిపేందుకు రెండు రోజులు సమయం ఎందుకు తీసుకున్నారు? సైనికులు ఓ వైపు అమరులవుతుండగా... వర్చువల్ ర్యాలీల్లో ఎందుకు ప్రసంగాలు చేశారు? ఆశ్రిత మీడియాతో ఆర్మీని తిట్టిస్తూ ఎందుకు దాక్కున్నారు? పెయిడ్ మీడియాతో భారత ప్రభుత్వానికి బదులు ఆర్మీపై ఎందుకు నిందలు వేశారు?’’ అని రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. 


కాగా ఇవాళ ఉదయం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘గాల్వాన్‌లో సైనికులను కోల్పోవడం తీవ్రమైన బాధను, కలవరాన్ని కలిగించింది. మన సైనికులు వీరోచిత సాహసాన్ని ప్రదర్శించారు. సరిహద్దు విధుల్లో శౌర్యాన్ని కనబర్చారు. భారత సైన్యంలో అత్యున్నత సంప్రదాయాన్ని చాటుకుంటూ తమ ప్రాణాలను అర్పించారు..’’ అని కొనియాడారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ తన పోస్టులో చైనా పేరును ప్రస్తావించేందుకు ఎందుకు ‘‘భయపడ్డారంటూ’’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా సైతం ప్రశ్నలు సంధించారు. ‘‘చైనా పేరెత్తేందుకు ఎందుకంత భయం? మన సైనికులు ఎంత మంది చనిపోయారు? చైనా దళాలు మన సైనికులను అపహరించాయా? తప్పుదోవ పట్టించొద్దు. దేశం ముందుకొచ్చి సమాధానం చెప్పండి..’’ అంటూ సుర్జేవాలా ప్రశ్నించారు. 



Updated Date - 2020-06-18T00:36:02+05:30 IST